సైరా…ఔరా: ఆరుపదుల వయసులో అదరగొట్టిన చిరు…

megastar chiranjeevi syeraa narasimhareddy movie review
Share Icons:

హైదరాబాద్: చరిత్ర మరిచిపోయిన తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి కథని తెలుగు ప్రజలకు తెలియజెప్పడమే లక్ష్యంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా’. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో పోషించిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అన్నిచోట్ల సినిమాకు మంచి స్పందన వస్తుంది. ఈ సందర్భంగా సైరా అభిమానులతో పాటు ప్రేక్షకుల అంచనాలని అందుకుందో లేదో ఒక్కసారి పరిశీలిస్తే…

మొదట ఉయ్యలవాడ జీవిత చరిత్రని స్టోరీగా ఎందుకోవడమే సినిమాకు మెయిన్ బలం. 18వ శ‌తాబ్దం మ‌ధ్యలో కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో దౌర్జన్యంగా శిస్తు వసూలు చేస్తున్న బ్రిటిషర్ల మీద ఎదురుతిరిగిన పాలెగాడు  ఉయ్యలవాడ నరసింహారెడ్డి. ఈ క్రమంలోనే బ్రిటిషర్లు నరసింహారెడ్డిని అంతమొందించాలని ప్లాన్ చేస్తుంటారు. ఆ కుట్రలని నరసింహారెడ్డి ఎలా ఎదురుకున్నారు. చివరికి భార‌త‌దేశ తొలి స్వాతంత్య్ర కాంక్ష ర‌గిల్చిన ఈ వీరుడు జీవితం ఎలా ముగిసింది అనేది స్టోరీ.

మొదట మెగాస్టార్ చిరంజీవి ఉయ్యలవాడ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. సినిమా ఆద్యంతం తన భుజాల మీద నడిపించారు. ఆరుపదుల వయసులో కూడా అటు యాక్షన్ సీన్లతో పాటు ఇటు డైలాగ్స్‌తో ఎక్కడ తడబాటు లేకుండా అద్భుతంగా నటించారు. ముఖ్యంగా గుర్రపు స్వారీలో మెగాస్టార్ కు సాటిలేదని నిరూపించారు. ఇక నర‌సింహారెడ్డి గురువు పాత్రలో గోసాయి వెంకన్నగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మెగాస్టార్ భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార కొన్ని సీన్లకు పరిమితం కాగా, నరసింహారెడ్డి ప్రియురాలుగా వీర వెంకట మహాలక్ష్మి పాత్రలో తమన్నా తళుక్కు మంది. సైరా కోసం ఆమె చేసిన త్యాగం మెప్పించింది.

అటు సామంత రాజులుగా కిచ్చా సుదీప్, జగపతిబాబులు మెప్పించారు. బ్రిటీష్ వారిపై న‌ర‌సింహా రెడ్డి పోరాటం గురించి తెలుసుకొని త‌మిళ‌నాడు నుంచి వ‌చ్చి ఉద్యమంలో పాల్గొనే రాజ‌నంబిగా విజ‌య్ సేతుప‌తి తన న‌ట‌న‌తో క‌న్నీళ్లు తెప్పించాడు. డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి విఫలమయ్యాడనే చెప్పొచ్చు. అసలు కథ-కథనం గురించి పట్టించుకోకుండా నటీనటులని హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. పైగా పరబాషా నటుల కోసం తెలుగు నేటివిటీ మిస్ చేసి…ఆయా బాషల నేటివిటీ తెలిసేలా తీశారు. ఇక వి‌ఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల బాగున్న, మరికొన్ని చోట్ల అంత అనిపించలేదు. అయితే అమిత్ త్రివేది మ్యూజిక్‌తో పాటు నేప‌థ్య సంగీతం కూడా అద్భుతంగా సీన్లకు త‌గిన‌ట్టుగా ఉంది. ప‌రుచూరి బ్రద‌ర్స్ క‌థ కోసం చాలా వ‌ర్క్ చేసిన‌ట్టే క‌నిపించింది. అలాగే సాయి మాధవ్ బుర్రా అందించిన కొన్ని డైలాగ్స్ కి అయితే థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

సినిమా మొత్తం మీద మెగాస్టార్ నటన అతి పెద్ద ప్లస్ పాయింట్. అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సెట్టింగులు, సినిమాటోగ్రఫీలు కూడా బాగున్నాయి. ఇక ఫస్టాఫ్ కొంచెం స్లోగా నడవడం, కథని పక్కకుతోసేసి నటీనటులని హైలైట్ చేయడం మైనస్ గా ఉన్నాయి. మొత్తంమీద చూసుకుంటే మ‌న తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడి జీవిత చ‌రిత్రని చూడాలసిందే.

 

Leave a Reply