మందులెక్కడ..?

medicine supply problems in nellore aganwadi centers
Share Icons:

నెల్లూరు, సెప్టెంబర్ 13 :

నెల్లూరు జిల్లాలోని అంగన్ వాడీ కేంద్రాలకు సరిపడా మందులు సరఫరా కావడం లేదు. దీంతో చిన్నారులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కార్యకర్తలు, ఆయాలు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల నుంచి వీటికి మందుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. జిల్లాలో మొత్తం 3,454 మెయిన్‌, 320 మినీ కేంద్రాలు కలిపి మొత్తం 3,774 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో మూడేళ్లలోపు చిన్నారులు 1,16,936 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 1,12,737 మంది ఉన్నారు. వీరితోపాటు జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, కిశోరబాలికలు ఈ కేంద్రాల ద్వారా ప్రతినిత్యం లబ్ధి పొందుతున్నారు.

పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన చేయడంతోపాటు పౌష్టికాహారం అందిస్తూ వారి బాగోగులు చూసుకోవడమే ఈ కేంద్రాల ముఖ్య ఉద్దేశం. సాధారణంగా చిన్నారులు ఆటలాడేటపుడు చిన్నపాటి గాయాలవుతుండటం సహజం. ఇలాంటి సమయంలో కట్టు కట్టేందుకు, దెబ్బ తగిలిన చోట పూసేందుకు మందులు అవసరమవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఏటా ఐసీడీఎస్‌ ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రథమ చికిత్స పెట్టెలను సరఫరా చేస్తున్నారు. ఈ కిట్లో ఆయింట్మెంట్, కట్టు వస్త్రం, దూది, జలుబు, జ్వరం, నులిపురుగుల నివారణ మాత్రలు, విరోచనాల నివారణ మందులు ఉంటాయి. గత ఏడాది నుంచి ప్రథమ చికిత్స కిట్ల పంపిణీ నిలిచిపోయింది. దీంతో చిన్నారులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా, గాయాలైనా ఎలాంటి చికిత్స అందించలేకపోతున్నారు.

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మందులు, అక్కరకు వచ్చే మందులు అంగన్‌వాడీ కేంద్రాల్లో సంబంధిత శాఖ తప్పనిసరిగా ఉంచాలి. శాఖాపరమైన నిర్లక్ష్యమో, వైద్యశాఖ అలసత్వమో అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రథమ చికిత్స మందులు, కిట్లు ఉండాలన్న విషయమే మరిచిపోయారు. జ్వరానికి వాడే పారాసిటమల్‌, గాయాలకు కట్టే వస్త్రం, ప్లాస్టర్లు, చిన్న పిల్లలకు దగ్గు మందులు, గర్భిణులు, బాలింతలకు ఐరన్‌ బిళ్లలు, జీర్ణశక్తికి వినియోగించే సిరప్‌లు, కాలిన గాయాలకు ఉపయోగించే మందులు, విరేచనాలకు వాడే మాత్రలు ఏ కేంద్రంలోనూ కనిపించడం లేదు.

కాలం చెల్లిన మందులు…

కొన్ని కేంద్రాల్లో అయితే 2015లో పంపిణీ చేసిన కిట్లు ఉన్నాయి. ఆ సమయంలో పంపిణీ చేసిన కొన్ని మాత్రలు ఉండగా, కొన్ని మందులు అయిపోయాయి. నిల్వ ఉన్న మాత్రలు కాలం చెల్లిపోయాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరికి అత్యవసర చికిత్స అవసరమవుతూనే ఉంటుంది. ప్రథమ చికిత్స పెట్టెలు ఖాళీగా దర్శనమిస్తుండటంతో అత్యవసర సమయాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఎటువంటి ప్రాథమిక చికిత్స పొందలేకపోతున్నారు. చిన్నపాటి గాయమైనా కేంద్రాల్లో ఏమి చేయలేని పరిస్థితి. అధికారులు సైతం కేంద్రాలకు మందులు సరఫరా చేయాలన్న విషయం మరిచిపోయినట్లున్నారు.

గతంలో సరఫరా చేసిన ప్రథమ చికిత్స కిట్లు కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మిగిలి ఉన్నాయి. వాటిలో చాలా వరకు కాలం చెల్లిన మందులు, మాత్రలు ఇంకా మిగిలి ఉన్నాయి. కేంద్రాల్లో కార్యకర్తలు లేని సమయాల్లో అత్యవసరమైనపుడు కిందిస్థాయి సిబ్బంది అవగాహన లేక కాలం చెల్లిన మందులను చిన్నారులకు వాడినా, గర్భిణులు, బాలింతలకు అందజేసినా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

మామాట: ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని మందులు సరఫరా చేస్తే బాగుటుంది…..

Leave a Reply