అక్కడ గాడిదలకి డిమాండ్.. ఎక్కడో!

Share Icons:

మెదక్, ఆగస్టు 30,

కుక్కక్కూడా ఓ టైమొస్తుందని సామెత. నిజమే ఆక్కడ గాడిదలకు టైమొచ్చింది. డిమాండుపెరగడంతో వాటి పెంపకం కూడా పెరిగింది. మెదక్ జిల్లా, నారాయణఖేడ్‌ నియోజకవర్గం పరిధిలోని కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో నేటికీ గాడిదలు విరవిగా కనిపిస్తున్నాయి. కర్ణాటక సరిహద్దుగా ఉన్న మంజీర నదీ తీర ప్రాంత గ్రామాల్లో వీటి సేవలను వినియోగించుకోవడం ఎక్కువ.  ఈ ప్రాంత వ్యవసాయ క్షేత్రాలు నల్లమట్టి నేలలు కావడంతో రైతులు అడుగు తీసి అడుగు వేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. మరోవైపు వ్యవసాయ క్షేత్రాలకు దారి లేకపోవడం, దారి ఉన్నా రేగడి నేలల మీదుగా విత్తనాలు, ఎరువులు మోసుకెళ్లడం అసాధ్యంగా మారింది. దీంతో ఎరువులు, విత్తనాలను వ్యవసాయ క్షేత్రాలకు చేరవేసేందుకు గాడిదలను వినియోగిస్తున్నారు. దీంతో పెంపకందారులు దూరం, బరువును బట్టి డబ్బులు వసూలు చేస్తారు.

వ్యవసాయ సీజన్‌లో రోజుకు గాడిద పై కనీసం రూ.200 నుంచి రూ.500వరకు గిట్టుబాటు అవుతుందని పెంపకందారులు వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న వీటిని మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తున్నారు. వాహనాలు వెళ్లలేని వ్యవసాయ క్షేత్రాల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. అయితే సీజన్‌లో మాత్రమే వీటి ద్వారా ఉపాధి లభిస్తుండగా, పోషణ భారంగా మారిందని పెంపకందారులు ఆవేదన చెందు తున్నారు. నారాయణఖేడ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మనూరు, నాగల్‌గిద్ద, కంగ్టి తదితర మండలాల్లో గాడిదల పెంపకం ద్వారా కొన్ని కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. గతంలో కుండలు చేయడం, బట్టలు ఉతకడం కుల వృత్తిగా ఉన్న వారు.. ప్రస్తుతం తమ రూటు మార్చి గాడిదల పెంపకాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ధాన్యం దిగుబడి సమయంలోనూ గాడిదలను రవాణాకు ఉపయోగిస్తున్నారు.

అయితే ధాన్యం రవాణాలో డబ్బులు కాకుండా, ధాన్యాన్నే అద్దె రూపంలో వసూలు చేస్తారు. ఒక్కో మడికి తవ్వెడు  వసూలు చేస్తామని పెంపకందారులు తెలిపారు. పెసలు, కందులు, మినుములు తదితరాల రవాణాతో అద్దె గిట్టుబాటవు తుందని చెప్తున్నారు. అయితే కొందరు మంజీర నుంచి ఇసుక అక్రమ రవాణాకు గాడిదలను ఉపయోగిస్తుండడం, అప్పుడప్పుడూ తమకు సమస్యలు తెచ్చి పెడుతోందని మోర్గి, కరస్‌గుత్తి గ్రామాలకు చెందిన పెంపకం దారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో గాడిద ధర రూ.15వేలకు పైనే పలుకుతుండగా, వీటి కొనుగోలుకు సంబంధించి స్థానికంగా మార్కెట్‌ లేదు.

అయితే మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఘోడే మాలేగావ్‌ నుంచి కొనుగోలు చేస్తారు. మాలేగావ్‌లో ప్రతీ ఏటా డిసెంబర్, జనవరి మాసాల్లో సుమారు 30 రోజుల పాటు అతిపెద్ద సంత నిర్వహిస్తారు. దేశం నలుమూలల నుంచి గాడిదలు, గుర్రాలు, ఒంటెల కొనుగోలుకు వ్యాపారులు, పెంపకందారులు వస్తారని స్థానికులు తెలిపారు.మాలేగావ్‌లో కొనుగోలు చేసిన గాడిదలను కాలినడకనే తీసుకొచ్చేవారని, ఇటీవలి కాలంలో డీసీఎంల ద్వారా రవాణా చేస్తున్నట్లు పెంపకందారులు తెలిపారు. మేలు రకం గాడిదల ధర రూ.25వేల వరకు ఉంటుందని సమాచారం. గాడిదల పెంపకం ద్వారా ఉపాధి లభిస్తున్నా, తమ వృత్తిలోనూ పోటీ పెరిగి గిట్టుబాటు కావడం లేదని పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు, మేకలు, పాడి పశువుల కొనుగోలుకు సబ్సిడీ ఇస్తున్న తరహాలో గాడిదల పెంపకం ద్వారా ఉపాధి పొందుతున్న తమకూ లబ్ధి చేకూరేలా చూడాలని కోరుతున్నారు.

మామాట: గాడిద చాకిరీ అని ఊరకే అన్నారా పెద్దలు.

Leave a Reply