తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి?

Share Icons:

హైదరాబాద్, 21 జూన్:

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ..ఆ తర్వాత జరిగిన పంచాయితీ, లోక్‌సభ, పరిషత్ ఎన్నికల్లో కూడా దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికలు అన్నీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలోనే జరిగాయి.

ఇక అటు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కూడా వైఫల్యం చెందింది. దీంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల పీసీసీలను మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ పీసీసీ మార్పు కోసం కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పక్కనబెట్టి….కొత్త పీసీసీ చీఫ్‌ కోసం అధిష్ఠానం పెద్దల  పరిశీలనలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్లు ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. అందరినీ కలుపుకొని పోయే తత్వం ఉండటం జీవన్‌రెడ్డికి సానుకూలాంశం. అదే సమయంలో.. రేవంత్‌రెడ్డితో పోలిస్తే.. ఆయన ఆ స్థాయి ప్రజాకర్షక నేత కాదనే వాదనలు ఉన్నాయి.

రేవంత్‌రెడ్డి విషయానికి వస్తే.. సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టగల సమర్థత, ప్రజాకర్షక నేతగా నిరూపించకోవడం కలిసివచ్చే అంశాలుగా ఉన్నాయి.

అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాసంకల్ప యాత్రను చేపట్టి.. ఏపీ మొత్తం తిరిగిన వైఎస్‌ జగన్‌కు.. అది ఎన్నికల్లో బాగా ఉపయోగపడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే ఆలోచనను అధిష్ఠానం ముందు రేవంత్‌రెడ్డి ఉంచినట్లు సమాచారం.

ఇక మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్‌ని వీడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 24న బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ రాజ్యసభ సీటు ఇస్తే మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో రాజగోపాల్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం.

 

Leave a Reply