ఆ ఎమ్మెల్యే కూడా జగన్ చెంతకు చేరనున్నారా?

janasena mla varaprasad praises cm jagan
Share Icons:

అమరావతి: అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పాలన వ్యవహారాలపైనే దృష్టి పెట్టి ముందుకుపోతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి…తాజాగా పార్టీ మరింత బలపడేలా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలకు చెందిన నేతలని, ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలని చేర్చుకున్న జగన్…ఆ  పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కన్నేసారు. అందులో భాగంగానే వల్లభనేని వంశీ వైసీపీలో చేరనున్న విషయం తెలిసిందే.

అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంలు కూడా వైసీపీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోబే జనసేన తరుపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా జగన్ చెంతకు చేరతారని తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాదరావు కొద్ది రోజులుగా అసెంబ్లీలోనూ… బయట వైసిపికి సీఎం జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన తాజాగా గోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జ్, టీటీడీ చైర్మ‌న్‌ వైవీ.సుబ్బారెడ్డిని కలిసినట్టు సమాచారం. ఆయ‌న పార్టీ మారుతున్న‌ట్టు తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరిలో టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి వీరాంజనేయులు, తాడేపల్లిగూడెం నుంచి పోటీ ఓడిపోయిన ఈలి నానిలు టీడీపీని వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. పులపర్తి స్వయానా విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడు. గంటా ఎలాగో బీజేపీలోకి వెళతారని వార్తలు వస్తున్నాయి. దీంతో పులపర్తి కూడా ఆయనతో పాటే పయనిస్తారని తెలుస్తోంది.

అలాగే ఈలి నాని, మంత్రి చెరుకువాడ రంగనాథరాజుతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఇటీవల చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన వెస్ట్ గోదావరి సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కాలేదు. దీంతో వీరు పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.

 

Leave a Reply