లోక్‌సభ ఫలితాల తరవాత టీ.కాంగ్రెస్‌లో భారీ మార్పులు ఉంటాయా?

Share Icons:

హైదరాబాద్, 30 ఏప్రిల్:

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి షాకులు మీద షాకులు తగులుతున్న విషయం తెలిసిందే. గెలిచిన ఎమ్మెల్యేలో సగం మంది వరకు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తమ శాసనసభాపక్షంలో విలీనం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది.

అయితే టీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలించినా… ఫలించకపోయినా… లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు ఖాయమనే టాక్ వినిపిస్తోంది. టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి ఘోర ఓటమిని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ… ఆయన సారథ్యంలోనే రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు కూడా వెళ్లారు. 

ఇక లోక్‌సభ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్‌ని మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే టీ పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డి సొంతమయ్యే అవకాశం ఉందని పలువురు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.మల్కాజ్ గిరి లోక్ సభ బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధిస్తే… ఆయనను టీ పీసీసీ చీఫ్ పదవి వెతుక్కుంటూ వస్తుందని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఓడిపోయినా… రేవంత్ రెడ్డికి టీ పీసీసీ చీఫ్ పోస్టు దక్కొచ్చని మరికొందరు భావిస్తున్నారు. 

ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే పోరాడటంతో పాటు ఆ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన నేతగా రేవంత్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. మల్కాజ్ గిరి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్‌కు ఆయన ఇదే రకమైన పోటీ ఇస్తే ఎన్నికల తరువాత తెలంగాణ కాంగ్రెస్ బాస్‌గా ఆయన నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

మామాట: చూద్దాం మరి ఫలితాల తర్వాత ఎలాంటి మార్పులు ఉంటాయో

Leave a Reply