హుజూర్ నగర్ బరిలో 28 మంది…ప్రచారానికి బాబు వెళ్లతారా?

huzur nagar by poll....tdp, bjp effect in election result
Share Icons:

హైదరాబాద్: తెలంగాణ హుజూర్ నగర్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది పోటీపడనున్నారు.  మొత్తం 76 మంది నామినేషన్లు దాఖలు చేయగా వాటిలో 45 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 31 మంది బరిలో నిలిచారు. బుధ, గురువారాల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇవ్వగా, చివరి రోజు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో చివరికి 28 మంది బరిలో నిలిచినట్టు రిటర్నింగ్ అధికారి చంద్రయ్య తెలిపారు. బరిలో మిగిలింది 28 మందే కావడంతో రెండు బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించనుండగా, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.

బరిలో నిలిచిన వారిలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి, బీజేపీ నుంచి కోటా రామారావు, తెలుగుదేశం నుంచి చావా కిరణ్మయిలు ఉండగా, వివిధ పార్టీలకు చెందిన 9 మంది, 15 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశాయి.

టీఆర్ఎస్ తరుపున సైదిరెడ్డిని గెలిపించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ప్రచారంలో దిగేశారు. అలాగే కేసీఆర్, కేటీఆర్ లు కూడా త్వరలోనే ప్రచార బరిలో దిగనున్నారు. ఇక తన భార్య పద్మావతిని గెలిపించుకునేందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా కష్టపడుతున్నారు. అలాగే రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేతలు సైతం హుజూర్ నగర్ లో తిష్ట వేశారు. అటు బీజేపీ నేతలు కూడా హుజూర్ నగర్ లో ప్రచారం చేస్తున్నారు.

అలాగే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి సీపీఐ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిరెడ్డికి కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనసమితి సపోర్ట్ చేస్తోంది. దీంతో సీపీఎం అభ్యర్ధి నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో టీడీపీ మద్ధతు కోరింది. సీపీఎం కూడా మద్ధతు ఇవ్వడానికి ముందుకొచ్చింది. మరోవైపు టీటీడీపీ అభ్యర్థి చావా కిరణ్మయి తరఫున ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలోని అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలకు హుజూర్‌నగర్‌లో ప్రచారం చేయాలని సూచించారు. దీంతోపాటు తాను కూడా స్వయంగా రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం.

అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ – టీడీపీ కలసి పోటీ చేశాయి. అప్పట్లో చంద్రబాబు, రాహుల్ గాంధీ కలసి కొన్నిచోట్ల ప్రచారం చేశారు. అప్పుడు చంద్రబాబు మళ్ళీ మనమీద పెత్తనం చెలాయించడానికి వచ్చారని టీఆర్ఎస్ ప్రచారం చేసి ఆ ఎన్నికల్లో లబ్ది పొందింది.  అయితే, ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేస్తే తమకే ఎక్కువ లబ్ధి జరుగుతుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది.

 

Leave a Reply