తిరుపతి, సెప్టెంబర్ 10,
జనులంతా భక్తితో కొలిచే వినాయక చవితి పండగ మరెంతో దూరంలో లేదు. చవిత అంటే బొజ్జగణపయ్యకు కుడుములు ఉండ్రాళ్లు ఇలా చాలా ఫలహారాలతో నైవేద్యం పెట్టాలి. మరి ఈ ఏడాది మనం డ్రైఫ్రూట్ కుడుములు (మోదకాలు ) ట్రై చేద్దామా. ఇవి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా సులభంగా డ్రై ఫ్రూట్ మోదకాల తయారీ చూద్దాం.
కావలసిన పదార్ధాలు..
బియ్యపు పిండి -పావు కిలో
నెయ్యి -200 గ్రాములు
జీడిపప్పు -100 గ్రాములు
బాదం పప్పు -100గ్రాములు
కిస్మిస్ (ఎండు ద్రాక్ష -150 గ్రాములు
ఎండు ఖర్జూరం (డేట్స్) – 200 గ్రాములు
కొబ్బరి తురుము – 200 గ్రాములు
గసగసాలు – 50 గ్రాములు
పాలపొడి – 200 గ్రాములు
పాలు – 200 గ్రాములు
యాలకల పొడి – టీ స్పూన్
ఉప్పు రుచికి దగినంత
మంచి నీళ్లు -150 గ్రాములు
తయారు చేసే విధానం..
నాన్ స్టిక్ పెనం స్టౌ పై పెట్టి సన్నని మంట పెట్టాలి. అందులో కొద్దిగా నెయ్యి వెయ్యాలి, అందులో సన్నగా తరిగి ఉంచుకున్న జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు, ఎండు ద్రాక్ష వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి. ఇపుడు ఒక చెంచా గసగసాలు వేసి వేయించాలి. ఇపుడు చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్న డేట్స్ వేసి, వేగనివ్వాలి.
మరో పెనం తీసుకుని, చిన్నమంటపై పెట్టాలి, అందులో ఒక చెంచా నెయ్యి, కప్పు పాలు పోసి వేడి చేయాలి. పాలు కాగిన తరువాత అందులో ఒక కప్పు పాల పొడి వేయాలి. ఉండలు కట్టకుండా, గరిటెతో కలుపుతూ వేగనివ్వాలి. ఈ మిశ్రమం పెనంకు అంటుకోకుండా కోవాలాగా వచ్చిన తరువాత అందులో కప్పు కొబ్బరి పొడి వేసి, రెండు నిమిషాలు కలుపుతూ ఉండాలి, ఇపుడు డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని ఈ పెనంలోకి మార్చుకోవాలి. కొద్దిగా వేలకల పొడి చల్లుకోవాలి. మిశ్రమం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
మరో పెనం పెట్టుకుని, అందులో గ్లాసు నీళ్లు, చెంచా ఉప్పు, చెంచా నెయ్యి వేసి వేడి చేయాలి. నీరు మరిగే దశలో తగినంత బియ్యపు పిండి వేసి, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. సన్న సెగపై మూతపెట్టి, 5 నిమిషాలు ఉండనివ్వండి, ఈ పిండి మిశ్రమాన్ని గిన్నలోకి తీసుకుని, చపాతి పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న ఉండలుగా తీసుకుని, మోదకం బ్లాకుల్లో సర్థి, మథ్యలో సిద్దం చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రం ఉంచి జాగ్రత్తగా మూసివేయాలి. ఇలా సిద్దం చేసుకున్న మోదకాలను 10 నిమిషాలు ఇడ్లీ లాగా ఆవిరిపై ఉడికించి తీయాలి. అంతే.. ఎంతో రుచుగా ఉండే మోదకాలు దేవుని నైవేద్యానికి సిద్దం.
మామాట: దేవునికి కూడా కొత్త రుచులు తినిపిద్దాం