పెళ్లిళ్లు – ఈవెంట్ మేనేజ్‌మెంట్

Share Icons:

పెళ్లిళ్లు ఈవెంట్ మేనేజ్‌మెంట్

ఇటీవల కాలంలో ప్రతి చిన్న వేడుకైనా హంగూ ఆర్భాటాలతో నిర్వహించడం మామూలై పోయింది. దీంతో ఈ ఏర్పాట్లు, అతిథులకు రాచమర్యాదలు, అలంకరణ, భోజనవసతి, గిఫ్టులు.. ఇలా ఎన్నో పనులుంటాయి. వీటన్నింటినీ నిర్వహించడం చాలా కష్టం. ఈ భారం నుంచి తప్పుకోవడానికి వేడుకలు నిర్వహించుకోవడం భారం తగ్గించుకోవడానికి అందుబాటులోకి వచ్చిందే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌.

మనిషి జీవిత కాలంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పెళ్లివేడుకే. దీన్ని అత్యంత వైభవంగా ఆకర్షణీయంగా జరపడం శ్రమతో కూడిన పని. కాస్తంత డబ్బుంటే మన అభిరుచికి తగ్గట్టుగా ఈవెంట్‌ మేనేజ్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి. ఎవరి పద్ధతులకు తగ్గట్టుగా వారికి కావల్సిన రీతిలో కూరాడి కుండలు మొదలుకుని పెళ్లికూతురు చేతిలోని కొబ్బరిబోండాం వరకు, ఇల్లు మొదలుకుని ఫంక్షన్‌హాల్‌ అలంకరణ వరకు ఏర్పాట్లు చేస్తున్నారు. విభిన్న ఆకృతిలో పెళ్లిపందిళ్లలో అతిథులను ఆహ్వానించేందుకు వెలకమ్‌ డాల్‌, పల్లకీలు, గుర్రపు బగ్గీలు వివిధ రకాల వాయిద్యాలు, డిజెమిక్స్‌లు అక్కడికక్కడే మట్టి గాజులు తయారు చేసి ఇవ్వడం….

అప్పటికప్పుడు అతిధుల చిత్రాలను గీసి ఇచ్చే చిత్రకారులు, వధూవరులను ఆశీర్వదించి వేదిక దిగిరాగానే వధూ వరులతో దిగిన ఫొటోను చేతిలో పెట్టే ఇన్‌స్టెంట్‌ ఫొటోగ్రఫీ, వధూవరులపై పూల వర్షం కురిపించే ప్లవర్‌ రేయిన్‌ మిషన్‌, గాల్లో తిరిగే ప్లయింగ్‌ కెమెరాలు, వీడియో క్రేన్‌, బిగ్‌ స్క్రీన్‌లో ఎల్‌ఇడి టీవీలు కావల్సిన రీతిలో అభిరుచికి తగ్గ వంటకాలు, రకరకాల స్వీట్స్‌, స్నాక్స్‌ ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ఆర్కెస్ట్రాతో సంగీత కచేరి, బంధువులంతా కలసి ఆడుకునేందుకు దాండియా, కోలాటం… ఒకటేమిటి… అన్ని విధాల ఆహ్లాదపరుస్తారు. సెలబ్రిటీలతో వ్యాఖ్యానించడం సహా ‘సకల సదుపాయాలు మన ముంగిట్లో’ అన్నట్టుగా నిర్వహిస్తారు… పిండికొద్దీ రొట్టె అన్నట్లు ఖర్చు బట్టి వేడుకలు ఏర్పాటుచేస్తాయి ఈ ఈవెంట్ సంస్థలు.
-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply