పెళ్లంటే నూరేళ్ల పంట…

Share Icons:

భారతీయ సంస్కృతికి మన ఆచారవ్యవహారాలు దర్పణం పడతాయి. అందులో అత్యంత అద్భుతమైనది, ఆదర్శనీయమైనది, అనుసరణీయమైనది వివాహ పద్దతి. పెళ్లన్నది నూరేళ్ళ పంట, ఏడేడు జన్మల బందమని పెద్దలంటారు. ఇటువంటి బందాన్ని ఆనందంగా అన్యోన్యతగా ఉండాలనుకుంటే దంపతులమద్య చక్కటి అవగాహన, పరస్పర నమ్మకం, సానుకూలదృక్పదం తప్పనిసరి. అనుకోని సందర్భాలలో ఏ పరిస్థితుల కారణంగానైనా ఇద్దరి మద్య కోపతాపాలు, పట్టింపులు చోటు చేసుకున్నప్పుడు మనది జీవితకాల శాశ్వతబందమన్న సత్యాన్ని మరువక కాస్త సర్దుకుపోవడం ఇద్దరికీ తప్పనిసరి. జీవిత రధానికి ఇద్దరు రెండుచక్రాలు. కనుక దంపతులు వారివారి సమస్యలను, మాటపట్టింపులను అనురాగంతో అవగాహనతో వారే పరిష్కరించుకోవడం ఉత్తమం.

ప్రేమంటే ఇద్దరి మనసుల కలయిక కావచ్చు, మరి పెళ్లంటే? అదో పెద్ద వ్యవస్థ. మనసుల కలయికను మించి ఇద్దరి జీవితాలను, వారి కుటుంబాలను కలిపే అతి పురాతనవ్యవస్థ. ఇద్ద‌రు మ‌నుషులు సుదీర్ఘ‌కాలం పాటు క‌లిసి ఉండాలంటే అల‌వాట్లు, అభిరుచులు క‌ల‌వ‌డం కాదు…. వారి మాన‌సిక స్థాయి ద‌గ్గ‌ర‌గా ఉండాలి. అంటే ఒక విష‌యం ఇద్ద‌రికీ ఒకేలా అర్థం కావాలి. క‌నీసం ఆ విష‌యం ప‌ట్ల విభేదాలు త‌క్కువ ఉండాలి. దీన్ని మానసిక సంతుల్యం అంటున్నాం. ఇది లేన‌పుడు స్నేహ‌మైనా, కాపుర‌మైనా నిల‌బ‌డ‌దు. మానసిక సమతుల్యంతో సంబంధం లేకుండా  కూడా చిర‌కాలం సాగే పెళ్లిళ్లు కొన్ని ఉంటాయి. వీటిని నిలిపి ఉంచేది అంత‌స్సూత్రంగా ఇద్ద‌రి మ‌ధ్య ఉండే ప్రేమ కావ‌చ్చు. లేదా ప్రేమ లాంటి అవ‌స‌రం కావ‌చ్చు.

భిన్నకుటుంబంలో పుట్టి విభిన్న వాతావరణంలో పెరిగిన వధువు, వరుడు వివాహం ద్వారా దగ్గరౌతారు. తమను ఒకటిచేసిన వివాహబంద విలువను గ్రహించి వారివారి భావనలను అలవాట్లును అర్ధవంతంగా ఆరోగ్యవంతంగా ఒకటిగా చేసుకొని నడుచుకోవాలి. భర్తకు సంబందించిన అన్ని బాధ్యతలందు భార్య పాలుపంచుకోవాలి. భర్తను అనుసరిస్తూ, అతనిని అర్ధంచేసుకుంటూ మనస్సులో మనసై, తనువులో తనువై ఆనందంగా ప్రవర్తించాలి. మృదుమధురంగా మనుగడ సాగిస్తూ మగని మన్నన పొందగలగాలి. కుటుంబ గౌరవప్రతిష్టలు ఇల్లాలిపైనే ఆధారపడివుంటుంది కాబట్టి భర్త కుటుంబాన్ని  భార్యగా, కోడలుగా, వదినగా, తల్లిగా చక్కగా నేర్పుగా ఇంటిలో పెద్దల సలహాలతో నిర్వహించగలగాలి.

అత్తమామలను, ఆడబిడ్డలను, తోడికోడళ్ళను, బావామరుదులను, ప్రేమగా చక్కగా చూసుకుంటూ ఇంటికి దీపంలా వెలుగొందాలి. కుటుంబ అభివృద్ధిని, అందరిహితం కోరే భర్త ఎప్పుడూ తన భార్యను తనతో సమానంగానే భావించాలి. అందరినీ వదిలి తనచేయి పట్టుకొని ఎంతో నమ్మకంతో సహధర్మచారిణిగా తన ఇంటికి వచ్చిందన్న భావనతో భార్యను ప్రేమగా అర్ధంచేసుకుంటూ ఆమెను చక్కగా చూసుకోవాల్సిన భాద్యత భర్తదే.

కుటుంబ జీవన విధానానికి  ప్రతీకగా నిలబడుతుంది భారతదేశం. ఈ వ్యవస్థ ప్రారంభమైంది ఇక్కడే, ఇంకా పచ్చగా ఉంది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా లేనప్పుడు, ఎవ్వరి ప్రేమా పొందలేనప్పుడు వారిలో అశాంతి బయలుదేరుతుంది.  ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూడటానికి కారణం కుటుంబ వ్యవస్థ. పిల్లల్ని కన్నాక వాళ్ల బాధ్యత తీసుకుంటేనే అది ‘వసుధైక కుటుంబం’ అవుతుంది. వివాహ బంధాన్ని మూడింతల అద్భుతంగా చెప్పవచ్చు. ఎద్దరు ఏక శరీరులు అవుతారు కాబట్టి అది ఒక భౌతిక బంధం. రెండు కుటుంబాలు ఆప్తులవుతారు గనుక  కాబట్టి  అది ఒక సాంఘిక అద్భుతం. మన ధర్మం ప్రకారం ఆదిదంపతులైన పార్వతీపరమేశ్వరులు కుటుంబ వ్యవస్థకు మూలాధారం. పార్వతి, శివుడు, వినాయకుడు, కుమారస్వామి కలిసి ఒక కుటుంబంగా మనకు ఆదర్శంగా కనిపిస్తారు. ఒక కుటుంబంలాగ ఏర్పడి, ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి వివాహబంధం మూలాధారం.  దైవానికి, సమాజానికి గల సంబంధాన్ని వివాహం చూపిస్తుంది కాబట్టి అది ఒక ఆత్మీయ బంధం అని కూడా చెప్పచ్చు.

కుటుంబ బాధ్య‌త‌లు, ప‌రువు, పిల్ల‌లు, మ‌రో కొత్త వ్య‌క్తితో అనుబంధం సాగించ‌గ‌ల తీరిక‌, కోరిక‌, చాక‌చ‌క్యం లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా కొన్ని కాపురాలు స‌జావుగా సాగనట్టుగా క‌న‌బ‌డుతుంటాయి. ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే ఆడామ‌గా మ‌ధ్య హెచ్చుత‌గ్గులు, మాన‌వ సంబంధాల్లో వ‌స్తున్న మార్పులు, ఆధునిక మ‌నిషి ముందున్న జీవ‌న ల‌క్ష్యాలు మారిపోవ‌డం. భార్యా భర్తలిద్దరూ రోజూ ఉదయం, సాయంత్రం కలిసి కాసేపు అహంకారాలు, అరమరికలు లేకుండా మాట్లాడుకుంటే ఉంటే ఒకరి నొకరు అర్ధం చేసికోడానికి సహాయపడుతుంది. చిన్న చిన్న అపార్థాలు, వాటికి మనసు గాయపడటం, తిరిగి సర్దుకోవడం, ఎప్పటికైనా నిలిచేది ప్రేమేనన్న సత్యం…. జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల్లో ఈ గర్వం ఎందుకు? అని  దంపతులు ఆలోచిస్తే….జీవితం ఒక నిత్య ఆనంద కరమైన పయనం అవుతుంది….

 

రచయిత – నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply