టీడీపీకి షాకులు మీద షాకులు: పార్టీని వీడుతున్న నేతలు…

Share Icons:

అమరావతి:

ఏపీలో తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఘోరంగా ఓడిపోయి ఢీలా పడిపోయిన పార్టీని పలువురు ముఖ్య నేతలు వీడుతున్నారు. చాలామంది బీజేపీలో చేరిపోగా, తాజాగా మరికొందరు వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తాజాగా తూర్పు గోదావరికి చెందిన వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేశారు. అలాగే విశాఖపట్నంకి చెందిన సీనియర్ నేత ఆడారి తులసీరావు కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరింది. ఆడారి తనయుడు ఆనంద్ మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున అనకాపల్లి ఎంపీగా పోటి చేసి ఓడిపోయారు.

అటు ఇదే జిల్లాకి చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే జిల్లాలో తాజాగా టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సోదరుడు కూడా టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీకి త్వరలో ఆయన రాజీనామా ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారని సమాచారం.

అటు కడప జిల్లాలో కూడా టీడీపీకి డబుల్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. చాలాకాలం పాటు చిరకాల శత్రువులుగా ఉండి ప్రస్తుతం టీడీపీలో మిత్రులుగా కొనసాగుతున్న కడప జిల్లా నేతలు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఆదినారాయణ బీజేపీలోకి వెళ్ళేందుకు రంగం సిద్ధం చేసుకోగా, రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే అంతకముందు ఆదినారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఉండేవారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి రామసుబ్బారెడ్డిపై విజయం సాధించారు. కానీ టీడీపీ అధికారంలోకి రావడంతో ఆది జంప్ కొట్టేశారు. చంద్రబాబు ఆదికి మంత్రి కూడా ఇచ్చారు. ఇక రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు.

అయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్న పెద్ద పొసగ లేదు. కానీ మొన్న ఎన్నికల ముందు బాబు ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చారు. దీంతో రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోతే, ఆది కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయిన నేతలు పార్టీ మారడానికి చూస్తున్నారని తెలిసింది. ఇప్పటికే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఆది బీజేపీలోకి వెళుతుంటే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. త్వరలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు.

 

Leave a Reply