దీదీ.. నన్ను క్షమించి పార్టీలో తిరిగి చేర్చుకోండి: బీజేపీ మహిళా నేత సోనాలి వేడుకోలు!

Share Icons:
*ఎన్నికలకు ముందు పార్టీని వీడిన సోనాలి
*క్షమించి పార్టీలో చేర్చుకోవాలని విన్నపం
*జీవితాంతం దీదీ నీడలో బతికేస్తానన్న నేత

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సోనాలి గుహ.. తనను క్షమించాలంటూ ముఖ్యమంత్రి మమతకు లేఖ రాశారు. తాను పార్టీ మారి తప్పు చేశానని, తనను క్షమించి తిరిగి పార్టీలో చేర్చుకోవాలని అందులో కోరారు. ఆ లేఖను ట్విట్టర్‌లోనూ షేర్ చేశారు. దీదీ లేకుండా తాను ఉండలేనని ఆ లేఖలో పేర్కొన్న సోనాలి ముక్కలైన మనసుతో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. ఉద్వేగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయం తనను వేధిస్తోందని, అక్కడ తాను ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు క్షమించకుంటే తానిక బతకలేనని, తనను క్షమించి తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే జీవితాంతం మీ చల్లని నీడలో బతికేస్తానని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు పలువురు టీఎంసీ నేతలతోపాటు సోనాలి కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోనాలికి మమతతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో చేరిన సోనాలి ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. అయితే, ఇప్పుడు అక్కడ ఇమడలేక తిరిగి సొంతగూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply