సోనియా హిత‌బోధ‌-సందిగ్ధంలో మ‌మ‌త‌

Share Icons:

సోనియా హిత‌బోధ‌-సందిగ్ధంలో మ‌మ‌త‌

కాంగ్రెస్ ర‌హిత‌, బిజెపి ర‌హిత ఫ్రంట్ ఏర్పాటు సాధ్య‌మా? కాదా? ఈ ప్ర‌శ్న అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా ఇప్పుడు ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌దిని తొలిచేస్తున్న‌ది. ఇలాంటి ఫ్రంట్ ఉండాల‌ని గ‌ట్టిగా కోరుకుంటున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావుతో క‌లిసి వెళ్లాలా లేదా అనేది కూడా ఇప్పుడు మమ‌త‌ను వేధిస్తున్న ప్ర‌శ్న‌.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు క‌లిసి వ‌చ్చే వారు త‌క్కువ మంది క‌నిపిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్ చంద్ర‌బాబునాయుడు ఇంకా త‌న నోరు విప్ప‌లేదు. కాంగ్రెస్ ర‌హిత‌, బిజెపి ర‌హిత మూడో ఫ్రంట్ ఏర్పాటు ఒక అడుగు ముందుకు ప‌ది అడుగులు వెన‌క్కి లా మారి ఉన్న‌ది.

దీనికి చంద్ర‌బాబునాయుడు క‌లిసి వ‌స్తే కానీ ఊపు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. కాంగ్రెస్ వ్య‌తిరేక‌త‌తో పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇటీవ‌లె బిజెపితో కూడా తెగ‌తెంపులు చేసుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మమ‌త‌, కెసిఆర్ ల‌తో క‌లిసి ప‌ని చేస్తారా లేదా అనేది ఇంకా తేల‌క‌పోవ‌డం ఇక లోపం.

మ‌రో వైపు సీనియ‌ర్ నాయ‌కుడు కురువృద్ధుడు శ‌ర‌ద్‌ప‌వ‌ర్ త‌న వంతు పావులు క‌దుపుతున్నారు. ఆయ‌న అడుగులు కాంగ్రెస్ వైపే ప‌డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీతో క‌లిసి త‌ప్ప మిగిలిన పార్టీలు ఏం చేయ‌లేవ‌ని ఆయ‌న నిశ్చితాభిప్రాయంలా క‌నిపిస్తున్న‌ది. కాంగ్రెస్ కావాలి కానీ రాహుల్ గాంధీ వ‌ద్దు అనేది శ‌ర‌ద్ ప‌వ‌ర్ నినాదం.

ఈ నినాదాన్ని ఆహ్వానించాలా లేక అస‌లు కాంగ్రెస్‌నే వద్ద‌నాలా అనేది మమ‌త సంశ‌యం. అనుభ‌వం లేని రాహుల్‌ను మోయ‌లేమ‌ని అందువ‌ల్ల కాంగ్రెస్ పార్టీ త‌మ పంచ‌న చేరాల‌ని శ‌ర‌ద్‌ప‌వ‌ర్ చేసిన ప్ర‌తిపాద‌న‌ను మమ‌త తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు సోనియాగాంధీకి వినిపించారు. అందుకు ఆమె స‌సేమిరా అన్న‌ట్లే క‌నిపిస్తున్న‌ది. కాంగ్రెస్ పార్టీనే పెద్ద పార్టీ కాబ‌ట్టి రాహుల్ గాంధీనే ప్ర‌ధాని అభ్య‌ర్ధి అనేది సోనియా గాంధీ స్ప‌ష్టం చేశారు. దాంతో మమ‌తా బెన‌ర్జీ ప‌రిస్థితి మ‌రింత సంక‌టంగా మారిన‌ట్లు క‌నిపిస్తున్న‌ది. బిజెపి, కాంగ్రెస్ పార్టీ లేకుండా కెసిఆర్ చెప్పిన విధంగా ఫ్రంట్ న‌డ‌పాలా?

శ‌ర‌ద్ ప‌వ‌ర్ చెప్పిన‌ట్లు కాంగ్రెస్‌, మైన‌స్ రాహుల్ గాంధీ గా జ‌ట్టుక‌ట్టాలా? ఇలా చేస్తే కెసిఆర్ క‌లిసి వ‌స్తారా?

సోనియాగాంధీ చెప్పిన‌ట్లు కాంగ్రెస్ జ‌ట్టులో చేరిపోవాలా?

ఇవి ఇప్పుడు మ‌మ‌తా బెన‌ర్జీ మ‌దిని తొలిచేస్తున్న ప్ర‌శ్న‌లు.

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, అఖిలేష్ యాద‌వ్‌లు మాత్రం కాంగ్రెస్‌తో జ‌త క‌ట్టేందుకు ఇప్ప‌టికే సంసిద్ధ‌త వ్య‌క్తం చేసేసి త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. మాయ‌వ‌తి కి కూడా ఇంత‌కు మించిన ఆప్ష‌న్ లేదు. రామ్ విలాస్ పాశ్వాన్ కూడా బిజెపితో తెగ‌తెంపులు చేసుకుని కాంగ్రెస్ తో క‌ల‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ది.

మ‌మ‌త బెన‌ర్జీ చెన్నై వెళ్లి క‌రుణానిధితో స‌మావేశం కాబోతున్నారు. బ‌హుశ ఆయ‌న కూడా కాంగ్రెస్‌తో ఉంటేనే మంచిద‌ని మ‌మ‌త‌కు స‌ల‌హా ఇవ్వ‌వ‌చ్చు.

ఇప్ప‌టికే కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో క‌లిసి వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌మ‌తా బెన‌ర్జీ తుది నిర్ణ‌యం తీసుకుని కాంగ్రెస్‌తో వెళ్లిపోతే కెసిఆర్ ప్ర‌తిపాదించిన ఫ్రంట్‌కు ఫుల్‌స్టాప్ ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.

English Summary: It seems that the West Bangal Chief Minister Mamatha Benarjee is in a fix whether to go with Congress or not. Shardpower pushing her to words Congress and the Telangana Chief Minister to the non Congress non BJP Front. Sonia Gandhi clarified that the Congress will lead the front, if required. 

Leave a Reply