“ప్రత్యర్థులపై కక్ష్య సాధింపుకు వ్యవస్థలను వాడుకుంటే పతనం తప్పదు” మమత

Share Icons:
-ఇదే జరిగితే మోదీ, అమిత్ షాల యుగం ముగిసినట్టే: మమతా హెచ్చరిక
-బీజేపీని ఓడించడం సాధ్యమే అనే విషయం బెంగాల్ ప్రజలు రుజువు చేశారు
-బీజేపీకి బుద్ధి చెప్పేందుకు దేశ ప్రజలు ఏకం కావాలి
-మోదీ, షా రాజకీయాలను బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు

 

పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీకి చెందిన టీఎంసీ పార్టీ ఘన విజయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మమత మాట్లాడుతూ, బీజేపీని ఓడించడం సాధ్యమే అనే విషయాన్ని బెంగాల్ ప్రజలు నిరూపించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాతీర్పే అంతిమమని చెప్పారు. ఎన్నికల ఫలితాల ద్వారా బెంగాల్ ప్రజలు యావత్ దేశానికి మార్గాన్ని చూపించారని అన్నారు. ప్రజాస్వామ్యంలో అహంకారాలకు చోటు లేదని చెప్పారు.ప్రత్యర్థులపై కక్ష్య సాధింపుకు వ్యవస్థలను వాడుకుంటే మోదీ, అమిత్ షాల యుగం ముగిసినట్టే నన్నారు . కక్ష సాధింపులకు సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థలను బీజేపీ వాడుకుంటోందని మమతా ఆరోపించారు . ఇలాంటి విధానాలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని… మోదీ, షా చేస్తున్న రాజకీయాలను బీజేపీలో పలువురు కీలక నేతలు కూడా తప్పుబడుతున్నారని అన్నారు. వీరు చేస్తున్న రాజకీయాలను దేశం మరెంతో కాలం భరించలేదని వ్యాఖ్యానించారు.

బీజేపీ మతతత్వ పార్టీ అని… ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు వారు ఏమైనా చేస్తారని, ఫేక్ వీడియోలను కూడా వాడతారని మమత మండిపడ్డారు. అధికారాన్ని, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేసిందని దుయ్యబట్టారు. దేశ సమాఖ్య విధానాన్ని బీజేపీ నాశనం చేసిందని విమర్శించారు. బీజేపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.

 

బెంగాల్ లో చోటుచేసుకున్న కొన్ని హింసాత్మక ఘటనలకు బీజేపీ బూతద్దంలో చూపిస్తోందని… ఇలాంటి ఘటనలు అన్ని రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటాయని మమత చెప్పారు. హింసకు తాను పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. ఓటమి బాధను తట్టుకోలేక బీజేపీ మత విద్వేషాలను రాజేస్తోందని మండిపడ్డారు. బీజేపీ నిబద్ధతను కోల్పోయిందని… ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను చూసుకున్నది తాము కాదని, కేంద్ర బలగాలే చూసుకున్నాయని చెప్పారు. తమ విజయం ప్రజల విజయమని… ఈ విజయాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నామని తెలిపారు.

 

-కె. రాంనారాయణ, జర్నలిస్ట్.

Leave a Reply