మల్కాజిగిరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్ధుల బలాబలాలు…

Share Icons:

హైదరాబాద్, 27 మార్చి:

మల్కాజిగిరి లోక్‌సభ నియోజక వర్గం… దాదాపు 30 లక్షల ఓటర్లతో దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గంగా ఉంది. ఇక మొన్నటివరకు మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానం నుంచి ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి బరిలోకి దిగారు. అటు టీఆర్ఎస్ చెక్ పెట్టేందుకు కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. మోదీ మేనియానే తనకు శ్రీరామరక్ష అనుకుంటూ బీజేపీ తరఫున రాంచందర్‌రావు పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్రులు తమకే అండగా నిలుస్తారన్న ఆశ పెట్టుకుని జనసేన అభ్యర్థిగా బి.మహేందర్‌ రెడ్డి రంగంలో ఉన్నారు.

అయితే పోటీ కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్యనే ఉండనుంది. ఇక ఇప్పటి వరకూ మల్కాజిగిరి రెండుసార్లు ఎన్నికలు జరిగితే.. తొలిసారి కాంగ్రెస్‌.. మలిసారి టీడీపీ గెలిచాయి. మేడ్చల్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, ఎల్బీ నగర్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలోకి వస్తాయి. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డి..టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డిల బలాబలాలని ఒకసారి పరిశీలిస్తే…

కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు..కేసీఆర్‌ని ధీటుగా ఎదురుకుంటున్న రేవంత్‌కి ప్లస్ పాయింట్స్. అలాగే సమస్యలపై పోరాటం..కేంద్రంలో అధికారంలోకి వస్తే రేవంత్‌కి కీలక పదవి వచ్చే అవకాశం ఉండటం..అలాగే ఆంధ్రా ఓటర్లలో రేవంత్‌పై అభిమానం… టీడీపీ పరోక్ష మద్ధతు ఉండటం రేవంత్‌కి కలిసిరానున్నాయి. అయితే పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్‌కి ఎమ్మెల్యేలు లేకపోవడం…బలమైన నాయకులంతా టీఆర్ఎస్‌లో చేరడం మైనస్.

ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి విషయానికొస్తే..టీఆర్ఎస్‌కి బలమైన కేడర్ ఉండటం..ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల మద్ధతు..ఆర్ధిక బలం..కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్లస్. కానీ రాజకీయాలకి కొత్త కావడం.. మామ మల్లారెడ్డిపైనే ఆధారపడటం మైనస్.

మామాట: మరి ప్రజలు మద్ధతు ఎవరికి ఉంటుందో

Leave a Reply