ప్లాస్టిక్ బాటిల్స్‌తో బ్రేస్‌లైట్ చేద్దామా…

Share Icons:

హైదరాబాద్:

మనం నీళ్ళ కోసం వాడే బాటిల్లను కొద్ది రోజుల తర్వాత బయట పడేస్తాం. అలాగే డ్రింక్ తాగాక మిగిలే బాటిళ్ళు బయట పడేస్తాం. అవి భూమిలో కలవకుండా భూకాలుష్యాన్ని కలిగిస్తాయి. అలా కాదని కాల్చేసినా పర్యావరణం కాలుష్యం అవుతుంది. అందుకే ఆ బాటిళ్ళను అందమైన బ్రేస్‌లైట్లలా తయారు చేసుకోవచ్చు.

bracelets with plastic bottleఏంటి నమ్మలేకపోతున్నారా? బాటిళ్ళేంటి? బ్రేస్‌లైట్లుగా తయారు చెయ్యడమేంటి? అని.. నిజమేనండీ.. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంటి వద్దే ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. పైగా షాపుకి వెళ్ళి ఈ కలర్ బాలేదు డిజైన్ మాత్రమే బాగుంది. వేరే కలర్ ఉంటే బాగుండు అనక్కర్లేదు. మీకు నచ్చిన రంగులో నచ్చిన డిజైన్‌తో బ్రేస్‌లైట్ తయారు చేసుకోవచ్చు.

ఎలా చేస్తారో తెలుసుకుంటే మరీ ఇంత సింపులా? అని మీరు కూడా ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుందాం రండి..

కావలసిన వస్తువులు…

  1. వాడేసిన ప్లాస్టిక్ బాటిల్
  2. నచ్చిన గోళ్ళ రంగులు
  3. టేపు
  4. ఐరన్ బాక్స్
  5. కత్తెర

తయారీ విధానం..

  1. ముందుగా ఖాళీ బాటిల్ తీసుకుని మూత తీసిన ఖాళీ బాటిల్ తీసుకుని దాని మధ్యలో టేపు చుట్టాలి. ఇప్పుడు ఆ టేపు ఉన్న భాగం మాత్రమే కత్తిరించాలి. ఇలా టేపు ఉంచి కత్తిరించడం వల్ల వంకర లేని సర్కిల్స్ వస్తాయి.  
  2. ఇప్పుడు మెల్లగా టేపు తీసేయాలి. ఐరన్ బాక్స్ తీసుకుని స్విచ్ ఆన్ చెయ్యాలి. కొంచెం వేడెక్కగానే దానిపై ఈ ప్లాస్టిక్ సర్కిల్‌కి రెండు వైపులా ఉన్న అంచులని రద్దుతూ ఉండాలి. ఆ వేడికి గరుకుగా ఉండాల్సిన ప్లాస్టిక్ కరిగి నునుపుగా తయారవుతుంది. నునుపుగా తయారయ్యింది అనుకున్నప్పుడు వెంటనే దానిని తీసేయాలి.
  3. పక్కన పెట్టి చల్లారాక మీకు నచ్చిన రంగుని బ్రష్ సాయంతో దాని లోపలా, వెలుపలా పూర్తిగా పుయ్యాలి.
  4. ఇది కూడా పూర్తిగా ఆరాక నచ్చిన గోళ్ళ రంగు తీసుకుని దానిపై డిజైన్లు వేసుకోవచ్చు.
  5. ఇలా మిగిలిన బాటిల్‌ను కూడా కత్తిరించి ఇదే విధంగా నచ్చిన రంగులలో నచ్చిన డిజైన్లలో బ్రేస్‌లైట్లను తయారు చేసుకోవచ్చు. పిల్లల కోసం చెయ్యాలనుకుంటే చిన్న చిన్న బాటిళ్ళని వాడి ముద్దు ముద్దుగా ఉండే బ్రేస్‌లైట్లని తయారు చెయ్యొచ్చు.

ఇలా తయారు చేసిన బ్రేస్‌లైట్లు పిల్లల్ని ఎంత గానో ఆకర్షిస్తాయి. పిల్లలే కాదు పెద్దవాళ్ళు సైతం వీటికి ఫిదా అవ్వాల్సిందే..

మామాట: ఇంకెందుకు మరి ఆలస్యం మొదలుపెట్టేయండి..

Leave a Reply