పాడి పంటల పండుగ – సంక్రాంతి

Share Icons:

పాడి పంటల పండుగ – సంక్రాంతి

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు. ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనంపుష్ప సమర్పణంశరణాగతి అనే ఈమూడింటిని ఆచరిస్తే నేనే రక్షిస్తానని విష్ణువు భూదేవికి చెప్పారట. అందుకే భూదేవి కలియుగంలో జీవులను భగవంతుని కృపకు పాత్రులుగావడానికి తానే స్వయంగా తమిళనాడు  తిరువారూర్ జిల్లా  శ్రీవిల్లి పుత్తూరులో ఆండాళ్(గోదాదేవి)గా అవతరించినట్లు చరిత్ర చెబుతుంది. తెల్లవారు ఝాము నుంచే శ్రీవేంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవతో పాటు ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. ఈ నెల ప్రారంభంనుంచి తొలి పక్షం రోజులవరకు సూర్యోదయానికి పూర్వమే అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈనెల మొత్తం వైష్ణవ దేవాలయాలు  అర్చనాది కార్యక్రమాలతో కళకళలాదుతూ నిత్య కల్యాణంగా కనిపిస్తాయి.

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు. ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం నీ, దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనమనీ అంతారు.  మనకు ఒక సంవత్సరం కాలం అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణమైతే రాత్రి  దక్షిణాయణం.. అందుకే ఉత్తరాయణం మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే తనువుచాలించాడు.  .

“సంక్రాంతి”, “సంక్రమణం” అంటే చేరడమని అర్ధం. “జయసింహ కల్పద్రుమం” గ్రంథంలో “సంక్రాంతి”ని  “తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః” అని నిర్వచించారు — మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది.

ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని భక్తుల నమ్మకం. పుష్య మాసంలో వచ్చే సంక్రాంతి మూడు రోజుల పండుగ. దీన్నే పెద్ద పండగగా చెప్పుకుంటాం. మార్గశిర, పుష్య మాసాలు హేమంత ఋతువులో వస్తాయి. ఇది చలి కాలం. సౌరమానం ప్రకారం ఈ పండగ సాధారణంగా జనవరి 13, 14, 15 వ తేదీలలో ఉంటుంది.

రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి దీన్ని రైతుల పండుగగా అభివర్ణిస్తారు. సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పల్లె వాతావరణంపాడి పంటలు. వివిధ పనులపై గ్రామాల నుండి పట్టణాలకు వలస వచ్చిన వారంతా సంక్రాంతి పండుగకు  వారి స్వగ్రామాలకు చేరుకుంటారు. మకర సంక్రాంతి రోజున ఆడపడుచులనుఅల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, కొత్త బట్టలు పెట్టి… బంధుమిత్రులతో కలిసి ఆనందంగాఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు. 

సంక్రాంతి సందర్భంగా స్త్రీలు కొన్ని వ్రతాలను ఆచరిస్తారు. వాటిలో గొబ్బిగౌరి వ్రతం ఒకటి. ఈ వ్రతాన్ని భోగినాడు ప్రారంభిస్తారు. ధనుర్మాసం మొదలు సంక్రాంతి పండుగ వరకు ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో ముచ్చటగా కనిపిస్తుంది. ఆ ముగ్గుల మధ్యన ఇంటి ఆడపడుచులు అందంగా గొబ్బిళ్లను తీర్చిదిద్ది, గొబ్బిపాటలు పాడుతూ.. కేరింతలు కొడుతుంటారు.

మొదటి రోజు “భోగి”: ఉదయాన్నే లేచి ఇంటి ముందు “స్వర్గ వాకిళ్లు” అనే ముగ్గు వేస్తారు. ముగ్గు మధ్యలో “గొబ్బెమ్మలు” పెడతారు. వీధులలో “భోగి మంటలు” వేస్తారు. కుటుంబంలో అన్దరూ తలస్నానాలు చేసి “సంక్రాంతి లక్ష్మి” ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలు కలిపి “కలగూర” వండుతారు. “నువ్వు పులగం, పొంగలి”, ప్రధాన వంటకాలు. సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటం జరుపుతారు. బొమ్మల కొలువు పెడతారు. వాటికి హారతి యిచ్చి, పేరంటం చేస్తారు.

రెండవ రోజు “సంక్రాంతి”: ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇవాళ్టితో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలవుతుంది. బెల్లం, గుమ్మడి కాయలు దానం ఇస్తారు. పితృదేవతలకు “తర్పణాలు” వదులుతారు. ఈ రోజు కూడా ఇంటి ముందు “రథం” ముగ్గు వేయటం సాంప్రదాయం. “గొబ్బెమ్మలు” పెడతారు. బొమ్మల కొలువు, పేరంటం చేస్తారు.

మూడవ రోజు “కనుమ పండగ”: ఈ రోజును “పశువుల పండుగ” అని కూడ అంటారు. వ్యవసాయదారులు పశువులను   కడిగి శుభ్రం చేసి పసుపు కుంకుమలతో, పూలతో అలంకరించి పూజిస్తారు. పశువుల కొట్టంలో “పొంగలి” వండి అందులో పసుపు, కుంకుమ కలిపి పొలాలలో చల్లి చీడ-పీడలు సోకకుండా కాపాడమని ప్రార్ధిస్తారు. గుమ్మడి కాయలు పగులకొట్టి పోలి (బలి) వేస్తారు. పూలు దండలు గుచ్చి పశువుల మెడలో వేస్తారు. దూడల మెడలకు, కాళ్ళకు చిరుగంటలు కడతారు. ఎద్దు కొమ్ములకు వారి వారి అభిరుచిని బట్టి పసుపు, కుంకుమ, రంగులతో అలంకరిస్తారు. గంగిరెద్దులను కూడా అలంకరిస్తారు. కొన్నిప్రాంతాలలో  కనుమ నాటి సాయంత్రం పశువుల ఊరేగింపు, కోడి పందాలు, గొర్రె పొట్టేళ్ళ పందాలు జరుపుతారు. కనుమ రోజు మినుము తినాలని “గారెలు” చేసుకు తింటారు. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలుఅత్తింటికి వెళ్ళిన అల్లుళ్ళు కూడ కనుమ రోజు తిరుగు ప్రయాణమవ్వరు. కనుమ నాడు కాకి కూడ కదలదని సామెత. మాంసాహారులు కనుమనాడు తప్పక మాంసం వండుకుంటారు. బొమ్మల కొలువు ఎత్తివేస్తూ  బొమ్మలకు హారతి పట్టి పేరంటం చేస్తారు.

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply