శివసేన సర్కార్‌కు ఊహించని షాక్: మంత్రి పదవికి ముస్లిం నేత రాజీనామా

uddhav-thackeray-as-cm-resolution-passed-unanimously-by-all-ncp-shiv-sena-congress-mlas
Share Icons:

ముంబై: ఇటీవలే మహారాష్ట్రలో శివసేన, ఎన్‌సి‌పి, కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే తాజాగా మంత్రివర్గ విస్తరణ జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగి వారం రోజులు కూడా కాకముందే ఉద్దవ్ సర్కార్ కు భారీ షాక్ తగిలింది. తనకు శాఖ ఇంకా కేటాయించకపోవడంపై అసంతృప్తికి గురైన ఆ పార్టీ ఏకైక ముస్లిం మంత్రి అబ్దుల్ సత్తార్.. తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రిగా ప్రమాణం చేసి ఐదు రోజులు దాటినా తనకు శాఖను కేటాయించకపోవడంపై సత్తార్ తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాకరేకి పంపారు.

కేబినెట్‌ బెర్త్ కోసం ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కక పోవడంతో వారిని బుజ్జగించడం శివసేనకు కత్తిమీద సాములా తయారైంది. ఇదే సమయంలో సత్తార్ రాజీనామా చేయడంతో ఆ పార్టీకి మరింత తలనొప్పిగా మారింది. సిల్లోద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుపున మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్తార్..  2019 లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగాబాద్ సీటు ఆశించిన ఆయన.. తనకు సీటు దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే స్థానిక బీజేపీ నాయకులు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించడంతో శివసేన కండువా కప్పుకున్నారు.

ఇదిలా ఉంటే మహాత్మాగాంధీ హంతకుడు నాథూరాం గాడ్సేకు, ప్రముఖ హిందూత్వ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌కు శారీరక సంబంధం ఉందని కాంగ్రెస్‌ అనుబంధ ‘సేవాదళ్‌’ పేర్కొనడంపై శివసేన మండిపడిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సేవాదళ్‌ విడుదల చేసిన ఒక బుక్‌లెట్‌లో ఆ విపరీత వ్యాఖ్యలను పొందుపర్చారు. దీనిపై మహారాష్ట్రలో కాంగ్రెస్‌ మిత్రపక్షం శివసేన స్పందిస్తూ.. సావర్కర్‌ గురించి కాంగ్రెస్‌ నేతల మెదళ్లలో చెత్త ఉందని వ్యాఖ్యానించింది. సావర్కర్‌ దేశభక్తిని, వీరత్వాన్ని ప్రశ్నించడం ద్వారా వారు తమను తాము కించపర్చుకుంటున్నారని సేన ఎంపీ సంజయ్‌రౌత్‌  పేర్కొన్నారు.

 

Leave a Reply