మహా రాజకీయాల్లో బీజేపీ ఎంపీ చిచ్చు: మండిపడుతున్న శివసేన…

maharashtra-musical-chairs-congress-dithers-governor-times-out-sena-calls-ncp
Share Icons:

ముంబై: ఇటీవల శివసేన, కాంగ్రెస్, ఎన్‌సి‌పిలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్ధవ్ థాకరే సీఎంగా ప్రమాణం కూడా చేశారు. అయితే ఉద్ధవ్ కంటే ముందు బీజేపీ తరుపున దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేసి మూడురోజుల్లో తగిన బలం లేక దిగిపోయారు. అయితే బలం లేకపోయిన దేవేంద్ర సీఎంగా ప్రమాణం ఎందుకు చేశారో కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధమయ్యాయని తమకు తెలుసని, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన రూ.40 వేల కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని, వీటిని కాపాడాలన్నదే ఫడ్నవీస్ ఉద్దేశమని అన్నారు. అందుకే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, ఆ నిధులను తిరిగి కేంద్రానికి బదలాయించారని వ్యాఖ్యానించారు.

దీనిపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ… ’80 గంటలు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రానికి దేవేంద్ర ఫడ్నవీస్ 40,000 కోట్ల రూపాయలను మహారాష్ట్ర నుంచి బదిలీ చేశారని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే అంటున్నారు. ఇది మహారాష్ట్రకు ద్రోహం చేయడమే అవుతుంది’ అని ట్వీట్ చేశారు.

ఇక ఇదే అంశంపై ఫడ్నవీస్ స్పందించారు. ఇదంతా పూర్తి అసత్య ఆరోపణ అని ఫడ్నవీస్ అన్నారు. తన మూడు రోజుల పాలనలో ఎలాంటి నిధులను కేంద్రానికి తిప్పి పంపలేదని ఆయన చెప్పారు. బుల్లెట్ రైలు విషయంలో భూసేకరణ చేయడం మినహా మహారాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో మరేమీ లేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులను కేంద్ర ప్రభుత్వం అడగడం కానీ, అలాంటి విన్నపాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం కానీ జరగలేదని చెప్పారు.

ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా లను డీకొట్టి మహారాష్ట్రలో అధికారం సాధించామని శివసేన వ్యాఖ్యానించింది. ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ సామ్నా పత్రికలో ఒక కాలమ్ రాస్తూ ఈ వ్యాఖ్య చేశారు. ఉద్దవ్‌ ఠాక్రే నేతృత్వంలోని కూటమిని మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం స్వాగతించిందని తెలిపారు. శక్తివంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా త్రయాన్ని ఢీకొట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తమ కూటమి ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లు కొనసాగుతుందని సంజయ్‌ రౌత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ చొరవతోనే కూటమి సాధ్యమయిందని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేశారు.

 

Leave a Reply