హుజూర్ నగర్ లో దూసుకెళుతున్న కారు…హర్యానా, మహారాష్ట్రాల్లో కమలం జోరు

huzurnagar by election ticket fight in congress and trs
Share Icons:

హైదరాబాద్: అక్టోబర్ 21న జరిగిన హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు మిగతా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి.  మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలా బీజేపీ దూసుకెళ్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ మళ్లీ అధికారం నిలబెట్టుకునే దిశగా ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇవాళ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. తొలి రౌండ్‌ నుంచే రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి కాంగ్రెస్‌ కూటమిపై ఆధిక్యంలో కొనసాగుతోంది. మహారాష్ట్రలో 288 స్థానాలు ఉండగా, బీజేపీ కూటమి 162 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ కూటమి 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

హర్యానాలో బీజేపీ కూటమి 41 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 29 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హర్యానాలో జేజేపీ గణనీయంగా ఓట్లు చీల్చినా కాంగ్రెస్‌కు ఊరట లభించలేదు. జాట్‌ ఓట్లు గట్టెక్కిస్తాయన్న కాంగ్రెస్‌ అంచనాలు తలకిందులయ్యాయి.

హుజూర్‌ నగర్‌లో భారీ ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ దూసుకువెళుతోంది. రౌండ్ రౌండ్‌కు గులాబీ పార్టీ మెజార్టీ పెంచుకుంటూ పోతోంది. మూడోరౌండ్‌‌లో టీఆర్‌ఎస్‌కు 6,777 ఓట్ల ఆధిక్యం రాగా, నాలుగో రౌండ్‌ తర్వాత 9,356 ఓట్ల ఆధిక్యం లభించింది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకుపోతున్నారు. తాజా ఫలితాలతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. బంపర్‌ మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ పథకాలు, టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలే గెలిపిస్తున్నాయని ఆయన అన్నారు.

హుజూర్ నగర్ లో మొత్తం 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. 22 రౌండ్‌ల పాటు ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్ మధ్యాహ్నం 12 గంటలు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ తుది ఫలితం మధ్యాహ్నానికే వెలువడే అవకాశం ఉంది. కాకపోతే, ఉదయం 10 కల్లా గెలుపు ఎవరిదో అంచనాకు వచ్చేయొచ్చు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది.

ఉప ఎన్నికలో మొత్తం 2,36,842 మంది ఓటర్లున్నారు. 2,00,754 ఓట్లు పోలయ్యాయి. వాటిని లెక్కించడతోపాటూ… ప్రతి మండలానికీ 5 వీవీప్యాట్‌ల స్లిప్‌లను కూడా లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. TRS నుంచీ శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచీ పద్మావతిరెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచీ చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు.

 

Leave a Reply