“గ్రంథాలయోద్యమ సంస్కర్త” మాడపాటి హనుమంతరావు

Share Icons:

గ్రంథాలయోద్యమ సంస్కర్త” మాడపాటి హనుమంతరావు….

గ్రంథాలయోద్యమం సంఘ సంస్కరణ  వయోజన విద్య  స్త్రీవిద్య మహిళాభ్యదయం సాహిత్య వికాసం సాంస్కృతికభివృద్ధి వంటి అనేక ఉద్యమాల ద్వారా తెలుగు జాతి ప్రగతికి పాటుపడిన తేజోమూర్తి.. ఆయనే మాడపాటి హనుమంతరావు.  నీలగిరి పత్రిక,  గోల్కొండ పత్రిక,  సుజాత పత్రిక  దేశబంధు పత్రిక … వంటి వాటికి తోడ్పాటు అందించిన అక్షర దీప్తి   ఆయన.   హైదరాబాద్ నగర మొట్టమొదటి మేయర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాన మండలి తొలి అధ్యక్షుడు  ప్రజాహిత  కార్య సేవా  తత్పరుడు,  ఆంధ్ర పితామహ  బిరుదాంకితుడు  కూడా. తెలంగాణ   ఆంధ్రోద్యమ నిర్మాతలలో  ఘనుడు. రచయిత, వ్యాసకర్త.నిద్రాణ అవస్థలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి  కొత్త ఊపిరిలూది మేల్కొల్పిన వైతాళికుడు, తెలంగాణలో  తెలుగు భాష సాంస్కృతిక పునరుజ్జీవనానికి  జీవితం అంకితం చేసిన  మహోన్నత వ్యక్తి మాడపాటి హనుమంత రావు. నిజాం పాలనలో ఉర్దూ, గోండు భాషలు తప్ప తెలుగు భాషకు తెలంగాణాలో గౌరవంలేని రోజుల్లో ‘మేం ఆంధ్రులం’ అని చెప్పగలిగిన ధైర్యశాలి మాడపాటి .నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి ఆంధ్ర మహాసభను నెలకొల్పిన ధీశాలి..

        దేశంలో ప్రథమంగా నెలకొల్పిన బాలికల పాఠశాలలో ఒకటైన  హైదరాబాదులోని నారాయణగూడ  బాలికోన్నత పాఠశాల సంస్థాపకుడాయన. అృదుకే ఆ పాఠశాలకు మాడపాటి హనుమృతరావు బాలికోన్నత పాఠశాల పేరు పెట్టారు.  రైతాంగ జీవితంపై 1912లో తొలి కథానిక ‘ఎవరికి?’ రచించింది ఆయనే. 1885 జనవరి 22వ తేదీన వరంగల్ జిల్లా మధిర తాలూకా ఎర్రుపాలెం గ్రామం మాతామహుని స్థానంలో ఆయన జన్మించారు. తల్లి జమలాపురం ఆడబడుచు వేంకట సుబ్బమ్మ. తండ్రి వేంకటప్పయ్య.  హనుమంతరావు వరంగల్‌లో చదివి మద్రాసు మెట్రిక్ పాసయ్యారు. కొన్నేళ్ళు వరంగల్‌ విద్యాశాఖలో పనిచేసి, తరువాత సెలవుపెట్టి హైదరాబాద్‌లో  ‘లా’ పరీక్ష ఉత్తీర్ణులై  1917లో న్యాయవాద వృత్తి చేపట్టారు. తెలుగు భాషపై మక్కువ ఎక్కువ కావడంతో 1900లో వశ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, 1904లో వరంగల్‌ శ్రీ రాజరాజనరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించారు. హనుమంతరావు  కార్యదర్శి. కొన్ని వత్తిళ్ళ వలన ఆయన రాజీనామా చేసి, వేరొకర్ని ఏర్పాటు చేశారు.

నైజాం కాలంలో పటేల్‌, పట్వారీ, పోలీసుల జులుం వలన  అన్నదాతలు  యాతనలు పడేవారు. పెత్తందార్ల ఆగడాలను అరికట్టడానికి వెలసిన  ప్రజా సంఘాలు వెలిసి గ్రామ ప్రాంతాల చైతన్యానికి సంకేతాలుగా నిలిచాయి. తెలంగాణా వెనుకబాటు తనానికి కారకులైన నిజాం పాలక విధానాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాలను నడిపించడంలో మాడపాటి హనుమంతరావు కృషి మరువలేనిది. 1921లో నిజాం రాష్ట్ర ఆంధ్ర జన సంఘం కార్యదర్శిగా సారథ్యం వహించారు.

తెలుగుజాతిని ఐక్యం చేయడానికి గ్రంథాలయాలే పునాదిగా హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్ర గ్రంథాలయం, హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం ప్రోప్సహించారు. నిజాం పాలనలో మగ్గుతున్న తెలుగు ప్రజల భాషా, సాంస్కృతిక గుర్తింపు చాటడానికి సమర్థ ఉపకరణంగా ఆయన జర్నలిజాన్ని ఉపయోగించుకున్నారు. న్యాయ,  పౌర, రాజకీయ హక్కులను గురించి  ‘నీలగిరి’ పత్రిక, ‘గోల్కొండ’, ‘సుజాత’, ‘దేశబంధు’, ‘తెలంగాణా’ పత్రికల్లో వ్యాసాలు  రాశారు. పిరదౌసి ఫార్సీ కవితను తెలుగులోకి అనువదించారు. ముషీర్‌ ఎ దక్కన్‌ అనే ఉర్దూ పత్రికకు చాలాకాలం సంపాదకీయాలు రాసారు. 1935 లో కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. 1946 ఫిబ్రవరి 6,7 తేదీలలో మాడపాటి షష్టిపూర్తి ఉత్సవాలు తెలంగాణాలో జరిగిన సందర్భంగా సన్మాన రూపంలో వసూలైన డబ్బుతో ఆంధ్ర చంద్రికా గ్రంథమాలను స్థాపించి కొన్ని గ్రంథాలను ప్రచురించారు. అంతేకాక బంకించంద్ర ఛటర్జీ వ్రాసిన ఆనందమఠ్‌ ప్రసిద్ధ నవలను తెలుగులో ఆయన అనువదించారు. మాడపాటి మొత్తం పదమూడు కథలు రాశారు. వీటిలో హృదయశల్యం, రాణీసారందా, ముసలిదాని ఉసురు, నేనే, అగ్ని గుండం, నాడు నీ పంతం, నేడు నా పంతం, ఆత్మార్పణం, తప్పు , ఎవరికి, విధిప్రేరణం అనే కధలు ‘మల్లికాగుచ్చం’ పేరుతో 1911 లో పుస్తక రూపం దాల్చాయి.

రాష్ట్రం నిజాం చెఱ వీడిన తర్వాత 1951లో హైదరాబాద్‌ నగర పాలక సంస్థ మొదట మేయర్‌గా ఎన్నికై మాడపాటి నగరా భివృద్ధి కెంతో కృషి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్‌కు శాశ్వత సభ్యులయ్యారు. 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్‌ ఇచ్చి సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ విధాన పరిషత్‌ మొదటి అధ్యక్షులుగా ఆరేళ్లు కొనసాగారు. మాడపాటికి భారత ప్రభుత్వం 1955 జనవరి 26న పద్మభూషణ్‌ బిరుదునిచ్చి సత్కరించింది. ఆంధ్ర పితామహుడనే పేరు గాంచిన మాడపాటి హనుమంతరావు 1970 నవంబర్‌ 11వ తేదీన 86వ ఏట తనువు చాలించారు.

-భరద్వాజ

Leave a Reply