భారతరత్న లిరువురూ అనర్ఘరత్నాలే.
మదన్ మోహన్ మాలవియా, అటల్ బిహరి వాజ్‌పేయీ
(నేడే ఇరువురి పుట్టినరోజు)
ఏసుక్రీస్తు జన్మించిన తేదీన పుట్టి ప్రపంచ ఖ్యాతి నొందిన మరో ఇద్దరిని స్మరించుకుందాం. మదన్ మోహన్ మాలవియ, అటల్ బిహరి వాజ్ పేయీ.. ఒకే దినాన జన్మించిన ఇరువురు మహానుభావుల కిరువురికీ ఒకేసారి భారతరత్న పురస్కారాలు లభించడం దేశానికే గర్వకారణం. పురుషులందు పుణ్యపురుషులు వేరయా.. అన్నారు.. కానీ, మానవజాతి లోనే మహా పురుషులు వారిరువురూ. ఏసుక్రీస్తు జన్మించిన డిసెంబరు 25 వ తేదీన విరబూసి సువాసనలు వెదజల్లిన స్వర్ణ పుష్పాలు. భారతదేశం వారిరువురి జన్మతో పావన మయిందనడంలో సందేహం లేదు. మదన్ మోహన మాలవియ, అటల్ బిహారి వాజ్ పేయీ… వారిరువురూ చారిత్రిక పురుషులే. వీరిరువురికీ భారత ప్రభుత్వం భారతరత్న అవార్డులను ఒకే రోజు ప్రకటించడం మరో విశేషం.
మాననీయుల్లో మహనీయుడు మదన్ మోహన్ మాలవియ……
మాలవియా గొప్ప విద్యావేత్త, కర్మయోగి. భగవద్గీతను జీవితంలో తు.చ. తప్పక పాటించిన నిష్టాగరిష్ఠుడు. రాజకీయవేత్త. స్వాతంత్ర్య సమరయోధుడు. భరతమాత ముద్దు బిడ్డలలో ఈయన ఒకరు. 1861 డిసెంబరు 25 న జన్మించిన పండిత మదన్ మోహన్ మాలవియ సంప్రదాయకంగా రెండు సంస్కృత పాఠశాలలో విద్య అభ్యసించి, తరువాత ఇంగ్లీషు పాఠశాలలో విద్యాభ్యాసం సాగించారు. విద్యార్ధి దశలోనే ఆయన “మకరంద్” కలం పేరుతో కవిత్వం వ్రాయడం ప్రారంభించారు. ఆ కవితలు వివిధ దిన, వార, పక్ష, మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. యుక్త వయస్సులో హిందుస్తాన్ (హిందీ), ది ఇండియన్ యూనియన్ (ఇంగ్లీషు) రెండు దినపత్రికలను స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ కు 1909లో, 1918లో అధ్యక్షపీఠం అలంకరించారు. బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు.
సంప్రదాయబద్ధ హిందూ కుటుంబంలో జన్మించిన ఈయన బాల్యం నుంచే వేదాధ్యయనం చేశారు. లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రూ, ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలసి సైమన్ కమిషన్ ను వ్యతిరేకించారు. 1930 సంవత్సరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీతో కలసి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిథ్యం వహించారు. న్యాయశాస్త్ర అధ్యయనం తరువాత 1891లో అలహాబాద్ జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ తరువాత రెండేళ్లకు హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించారు. 1912 నుంచి ఇంపీరియల్ లెజిస్లటివ్ కౌన్సిల్ సభ్యునిగా, తరువాత 1926 వరకూ సెంట్రల్ లెజిస్లటివ్ అసెంబ్లీ సభ్యునిగా కొనసాగారు. సత్యమేవ జయతే నినాదానికి అద్భుత ప్రాచుర్యం మాలవ్యా వలననే లభించింది. 1946 డిసెంబర్ 12 న వారణాసిలో తనువు చాలించారు.,
అత్యున్నత విలువల రాజనీతిజ్ఞుడు అటల్ బిహారి
రాజకీయాలలో అత్యున్నత విలువలు పాటించిన భారతీయుడు అటల్ బిహారి వాజ్‌పేయీ…. 1924లో క్రీస్తు జన్మదినాన పుట్టిన గొప్ప మానవతా వాది. వాజపేయి గ్వాలియర్ సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం చేసి, గ్వాలియర్ విక్టోరియా కళాశాల (ప్రస్తుత లక్ష్మీబాయి కళాశాల)లో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడైనారు. కాన్పూరు దయానంద ఆంగ్లో వైదిక కళాశాలలొ చదివి రాజనీతిశాస్త్రంలో ఎం.ఎ. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. రాష్ట్రీయ స్వయంసేయక్ సంఘ్ విస్తారక్ గా ఉత్తరప్రదేశ్ వెళ్ళిన వాజపేయి, అక్కడ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నడిపిన “రాష్ట్రధర్మ” (హిందీ మాసపత్రిక), “పాంచజన్య” (హిందీ వారపత్రిక) పత్రికలలో, “స్వదేశ్”, “వీర్ అర్జున్” వంటి దిన పత్రికలలో పనిచేసి పాత్రికేయజీవితం ప్రారంభించారు. వాజపేయి ఆజన్మ బ్రహ్మచారి.
కవి, గాయకుడు, ద్రష్ట, మేధావి, భాషా ప్రవీణుడు, సంఘ్ కార్యకర్త, సాత్వికుడు, సంస్కృతీ, సాంప్రదాయ విలువలకు పట్టం కట్టిన రాజకీయ వేత్త, పాలకపక్షం ప్రశంలందుకున్న ప్రతిపక్ష నేత, ముమ్మారు ప్రధాని.. అన్నీ కలగలిపిన ఒక అరుదైన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారి వాజ్‌పేయీ. దేశంలో నాలుగు రాష్ట్రాల నుంచి పోటీ చేసి గెలిచిన ఏకైక వ్యక్తి వాజ్‌పేయీ. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్ ల నుంచి పోటీ చేశారు. అలాగే దేశం లోని ఏడు నియోజక వర్గాల నుంచి గెలిచిన ఒకే ఒక్క నాయకుడు ఆయనే. సీనియర్ పార్లమెంటేరియన్‌గా నాలుగు దశాబ్దాల జీవితం ఆయనది.
ఎంత తీరిక లేకున్నా కూడా కొంత సమయాన్ని సంగీతం వినడానికి, ఇంకొంత సమయాన్ని రుచికరమైన వంటకాలు తయారు చేయడంలో ఇష్టంగా గడిపారు. పోతనలా సహజ పాండిత్య గరిమతో అలరారే నేతలలో మన పూర్వ ప్రధాని వాజ్‌పేయీ అగ్రగణ్యులు. ప్రతి పక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయీని తన గురువు గా అంగీకరించి అయన ద్వారా తానూ ఎంతో ఉత్తేజం పొందానని దివంగత ప్రధాని పి వి నరసింహారావు పార్లమెంటులో పేర్కొన్నారు. ఆయన నిజంగా భారత అనర్ఘరత్నం.. ప్రతిపక్షంలో ఉన్నా ధైర్య సాహసాలను మెచ్చుకుంటూ ఇందిరా గాంధీని సైతం శ్లాఘించిన ప్రజాస్వామ్య వాది. దేశంలో అత్యున్నత భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన ఆరోగ్యం ఎలాఉందో? ప్రపంచానికి తెలియకుండా అజ్ఞాతంలో కొన్నేళ్ళుగా ఉండి ఆగస్ట్ 16, 2018 దివంగతులు కావడంతో ఒక అనర్ఘరత్నం మాయమైంది. కొన్నేళ్ళపాటు పార్టీలో ఆయన్ను తలుచుకుంటున్నవారే కనపడ లేదు.
ఈ పర్యాయం హిందువులకు పవిత్రమైన ముక్కోటి ఏకాదశి కూడా అదే రోజు కావడం మరొక విశేషం.
– నందిరాజు రాధాకృష్ణ – సీనియర్ పాత్రికేయుడు