ఉపరాష్ట్రపతి ఉవాచ

Share Icons:

-పనితీరే కొలమానం కావాలి

-మాజీ సిఎస్‌ జోషి పుస్తకావిష్కరణలో వెంకయ్యనాయుడు

ప్రజా ప్రతినిధుల పని తీరు, దీర్ఘకాలిక ప్రజా ప్రయోజనాలే కొలమానంగా ప్రజలు వోటు హక్కును వినియోగించుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తెలిపారు. పోటీ చేసే వారి క్యారక్టర్‌, కెపాసిటీ, క్యాలిబర్‌, కాండక్ట్ ఆధారంగానే ఎన్నుకోవాలని, అలా కాకుండా క్యాస్ట్, కమ్యూనిటీ, క్రిమినాలిటీ, కరెన్సీ ఆధారంగా ఎన్నుకోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. పౌర కేంద్రిత పాలన రావాలంటే, పాలనా కేంద్రిత వోటు వినియోగం ద్వారానే వొస్తుందని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ శైలేంద్ర కుమార్‌ జోషి రచించిన ‘ఎకో టి కాలింగ్‌’ పుస్తక తెలుగు సేత ‘సుపరిపాలన’ను హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.

సందర్భంగా పాలనా నమూనాలో వొస్తున్న మార్పుల గురించి ఆయన వివరించారు. ప్రభుత్వం కంటే పాలనే కీలకమైనదని, పాలనా పక్రియలో ప్రజలను భాగస్వాములను చేయవలసిన అవసరం ఉందన్నారు. శాసనాలు చేయడం, అమలు పరచడం, మూల్యాంకనం చేయడంలాంటి అన్ని విభాగాల్లో పాలు పంచుకునేందుకు పౌరులకు అవకాశం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఎన్నికైన ఏ ప్రభుత్వమైనా ప్రజా విశ్వాసంతోనే గెలిచిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ఉపరాష్ట్రపతి, ప్రతి ప్రతినిధులు తమ పదవికి సంబంధించిన బాధ్యతలను త్రికరణశుద్ధిగా నిర్వహించాలని, ప్రజలకు పరిపూర్ణమైన సేవలు అందించాలని వెంకయ్యనాయుడు సూచించారు. పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగు పరించేందుకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. మూసి ఉంచిన గదుల్లో కాకుండా ఆరుబయట మంచి గాలిని ఆస్వాదించడం వంటి వాటి ద్వారా కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి జరుగకుండా ఆడ్డుకోవొచ్చన్నారు. గ్రావి•ణ ప్రాంతాల ప్రజలు కొవిడ్‌ మహమ్మారి బారిన తక్కువ పడడానికి ఇది కూడా ఒక కారణమని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత డాక్టర్‌ ఎస్‌కే జోషి, అనువాదకుడు బ్రహ్మయ్య తోపాటు ఆయన మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

-ఆర్.కె.

Leave a Reply