మూడు రాజధానులు…నాలుగు కార్పొరేషన్స్: డిసైడ్ అయిపోతుందా?

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరైనదో కాదో..స్థానిక సంస్థల ఎన్నికలు తేల్చేయనున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కరెక్ట్ అని తెలియాలంటే నాలుగు కార్పొరేషన్ ఫలితాలు ఎలా వస్తాయనేది చూడాలి. అటు మూడు రాజధానుల వ్యతిరేకిస్తున్న టీడీపీకి కూడా ఇవే ప్రతిపాదిక కానున్నాయి.

అయితే మూడు రాజధానులపై అమరావతితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ తీవ్ర ప్రభావం పడుతోంది. అందుకే ఇప్పుడు వాటి పరిధిలోకి వచ్చే విజయవాడ, గుంటూరు కార్పోరేషన్ల ఫలితాలపై అందరి దృష్టీ నెలకొంది. మూడు రాజధానుల ప్రకటనలో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని ప్రకటించిన నేపథ్యంలో అక్కడ జరిగే కార్పోరేషన్ ఎన్నికలు తమకు ఏకపక్ష విజయాన్ని కట్టబెడతాయని వైసీపీ ఆశిస్తోంది. అదే సమయంలో నగరంలో తమకున్న నలుగురు ఎమ్మెల్యేల అండతో కార్పోరేషన్ ఎన్నికల్లో ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ ఆశిస్తోంది. అయితే విశాఖ రాజధానిని ఉత్తరాంధ్ర వాసులు ఆహ్వానించం లేదంటున్న టీడీపీ వాదనను తిప్పికొట్టాలంటే వైసీపీకి జీవీఎంసీలో విజయం తప్పనిసరిగా మారింది. దీంతో వైసీపీ నేతలు ఇక్కడ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.

వాస్తవానికి విజయవాడ, గుంటూరులో అమరావతి ఉద్యమ ప్రభావం, విశాఖలో కొత్త రాజధాని ఇచ్చారన్న అనుకూల ప్రభావం ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే హైకోర్టు కేటాయించిన కర్నూలు కార్పోరేషన్ లో ఎలాంటి ప్రభావం ఉండబోతోందన్నది ఈసారి దాదాపు అప్రస్తుతంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ కర్నూలు జిల్లాలో ఏకపక్షంగా విజయాలు సాధించింది. అలాగే హైకోర్టు రాబోతున్న నేపథ్యంలో వైసీపీకి ఇక్కడ వాతావరణం పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. అందుకే మూడో రాజధాని అయిన కర్నూలు ఫలితాలపై అంత ఆసక్తి కనిపించడం లేదు..

మూడు రాజధానుల ప్రకటన పరిణామాలు, ప్రస్తుతం ఉన్న ఎన్నికల వాతావరణాన్ని బట్టి చూస్తే విజయవాడ, గుంటూరులో టీడీపీకి, విశాఖలో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడాల్సి ఉంది. కానీ అమరావతి ఉద్యమం ప్రభావం రాజధాని గ్రామాలకే పరిమితమైందని భావిస్తున్న వైసీపీ విజయవాడ, గుంటూరు కార్పోరేషన్లలో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే విశాఖలో కొత్త రాజధాని ప్రకటనతో తమకు పూర్తి అనుకూల వాతావరణం ఉందని నమ్ముతోంది. మరి చూడాలి మూడు రాజధానుల నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల ఏ మేర ప్రభావం చూపుతుందో?

 

Leave a Reply