మార్చి 15 లోపు స్థానిక ఎన్నికలు..

List of AP Assemblies Candidates-2019
Share Icons:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికల సందడి మొదలు కానుంది. మార్చి 15లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు, డబ్బు, మద్యం ప్రభావం లేకుండా స్థానిక ఎన్నికలు జరుగుతాయన్నారు. డబ్బు పంచుతూ అభ్యర్థి దొరికితే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.

పంచాయతీ ఎన్నికలకు 7 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 5 రోజుల పాటు ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు సర్పంచ్‌కే ఉంటాయని చెప్పారు. సర్పంచ్‌ స్థానికంగా ఉంటూ పాలన సాగించాలని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి వచ్చినప్పుడు సర్పంచ్‌ కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నియమావళే మున్సిపల్‌ ఎన్నికల్లో అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్నినాని వెల్లడించారు.

అటు డిస్కంలు, జెన్‌కోపై రూ.32వేల కోట్ల అప్పులున్నాయన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.8వేల కోట్లు… లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కోసం రూ.1500కోట్లు సబ్సిడీ ఇచ్చినట్టు పేర్ని నాని పేర్కొన్నారు.  నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏపీ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. 10వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి కోసం… జెన్‌కో ద్వారా గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. పూలు, పండ్ల తోటలకు నష్టపరిహారం పెంచామని పేర్ని నాని వెల్లడించారు.

 

Leave a Reply