స్థానిక సంస్థలు సమరం: టెన్షన్ పడుతున్న వైసీపీ…

Share Icons:

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను మార్చి 15లోగా నిర్వహించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న జగన్ పార్టీ విషయంలో కూడా కీలక నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే పార్టీలోని నాయకులకు మింగుడు పడటం లేదు. వైసీపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవ్వటంతో పాటు అభ్యర్థుల ఎంపికపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టారు.

అయితే మీరంతా అభ్యర్థుల విషయంలో కష్టపాడాల్సింది ఏమీ లేదు. అంతా పార్టీనే చూసుకుంటుంది అని జగన్ చెప్పటం నాయకులకు అసలు రుచించటం లేదు . స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో ఆ నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని , గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులు ఎవరో పార్టీయే నిర్ణయిస్తుందని వైసీపీ అధినేత, సీఎం జగన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలో, గెలుపు గుర్రాలెవరో తమకు తెలుసనీ , అభ్యర్థుల ఎంపికపై గ్రౌండ్‌ లెవల్లో ప్రజాబలం కలిగిన నేతలెవరో సర్వే ద్వారా సెలెక్ట్‌ చేస్తామని సీఎం జగన్‌ చెప్పినట్టు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు దగ్గరగా ఉండే నేతలు, అనుయాయులు, అనుకూలంగా ఉండే వారికి పార్టీ తరపున టికెట్ ఇప్పించుకునేందుకు ముఖ్యనేతలు ప్రయత్నిస్తుంటారు. ఎక్కువశాతం తమ కోసం పని చేసిన వారికే పోటీ చేసే అవకాశాలు కూడా వచ్చేలా చూస్తారు. తమ గ్రూపు వారికి, తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నించటం సర్వ సాధారణం .అయితే జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యనాయకులు తమ వారికి టికెట్లు రావేమో అని టెన్షన్ పడుతున్నారు. తమకు స్థానిక ఎన్నికల టికెట్లు కూడా నిర్ణయించే పరిస్థితి లేకుంటే స్థానికంగా తమకు ఏం గుర్తింపు ఉంటుందని వారు లోలోపల మదనపడుతున్నారు. ఇక కొందరు అసలు పార్టీ అధినాయకత్వం నిర్వహించిన సర్వేలో ఎవరికి మొగ్గు ఉందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Leave a Reply