కాలేయ మార్పిడి సర్జరీలలో పెద్ద ముందడుగు

Share Icons:
హైదరాబాద్, సెప్టెంబర్ 10,
“అవయవదానం ప్రాణాలను రక్షిస్తుంది. కానీ మనదేశంలో అవి చాలా అరుదు. అమూల్యం. ఆ విధంగా దాత నుంచి సేకరించిన కాలేయాన్ని స్వీకర్తకు అమర్చేలోగా మరికొంతకాలం సంరక్షించగల సాంకేతికవిజ్ఞానం అందుబాటులోకి వచ్చి దూరప్రాంతాలకు చేర్చేందుకు ఇంకా కొంచం వ్యవధి లభించితే నిస్సందేహంగా అది ప్రాణాలను రక్షించే దిశలో అతిపెద్ద ముందడుగు కాగలదు. అటువంటిదే అయిన నార్మోథర్మిక్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ ని యశోద హాస్పిటల్స్ తొలిసారిగా తెలుగు రాష్టాలలో ఉపయోగించింది.” ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న ఎందరో రోగులకు కొత్త జీవితం లభ్యం కానుంది అని ఈ అత్యాధునిక ‘అవయవ మార్పిడి’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరోజు ఆవిష్కరిస్తూ యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్.రావు, పేర్కొన్నారు.
దాత నుంచి సేకరించిన కాలేయాన్నిఈ యంత్రం సహజ శరీరధర్మస్థితిలో ఉంచటమే కాకుండా ఆ అవయవంలోని కణజాలం శక్తిని కోల్పోకుండా, దానిలో వ్యర్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. ఈ ఏర్పాటు ఆ అవయవాన్ని సేకరించిన తరువాత  స్వీకర్త శరీరంలో అమర్చటానికి ప్రస్తుతం 4 నుంచి 8 గంటలుగా  ఉన్న గరిష్ట వ్యవధిని ఏకంగా 24 గం.లకు పెంచుతోంది. దీంతో కాలేయాన్ని సేకరించిన స్థలం నుంచి దూరదూర ప్రాంతాలకు  అవయవాల రవాణాకు ఇంతకు ముందు ఎన్నడూ లేనంత సమయాన్ని ఇస్తుంది. ఈ సమయంలో దాత నుంచి పొందిన కాలేయం పనితీరును అంచనావేసుకునేందుకు కూడా డాక్టర్లకు అవకాశం లభిస్తుందని అయన అన్నారు.
ఈ పరికరాన్ని సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్స్ లో వరసగా జరిగిన మూడు కాలేయమార్పిడి శస్త్రచికిత్సలలో ఉపయోగించారు. చాలాకాలంగా మద్యం అలవాటు ఉన్న ఓ పురుష(67సం.) దాత నుంచి సేకరించిన కాలేయంలో బిలిరూబిన్ ఉన్నట్లు ఈ యంత్రం వెల్లడించింది. అల్ట్రాసౌండ్ పరీక్ష మాత్రం స్వల్పం నుంచి మధ్యస్థాయిలో కొవ్వు చేరినట్లు చూపించింది. మరో సందర్భంలో సజీవదాత(లైవ్ డోనార్) నుంచి సేకరించిన కాలేయంలో గణనీయమైన స్థాయిలో ఎంజైమ్స్ పెరగటాన్ని, చాలా వత్తిడి ఉన్నట్లు తెలిపింది. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇటువంటి కాలేయాలను తిరస్కరించాల్సి వచ్చేది. కానీ  నార్మోథర్మిక్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ యంత్రానికి అనుసంధానంచేసి 6 నుంచి 8 గం.ల పాటు ఉంచిన తరువాత అవి చాలా చక్కటి పనితీరును కనబరచటంతో కాలేయమార్పిడి సర్జరీలో వాడుకోగలిగాం. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్సచేయించుకున్న ఈ వ్యక్తులు  వేగంగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు.
మామాట: వైద్యపరిశోధనల ఫలితాలు పెదలకు అందినపుడే పురోగతి. 

Leave a Reply