న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో చిక్కుకున్న చంద్రుడు!

Share Icons:

గ‌త నాలుగేళ్ల‌లో ఎన్నో సార్లు న్యాయ‌స్థానంలో చ‌తికిల ప‌డిన తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌రొక మారు అలాంటి ప‌రిస్థితే ఎదుర‌య్యేలా క‌నిపిస్తున్న‌ది. రాజ్యాంగ సూత్రాల‌కు అనుగుణంగా ఉండ‌క‌పోతే ఎవ‌రికైనా ఇలాంటి ప‌రిస్థితే దాపురిస్తుంది. అయితే ప్ర‌భుత్వ ప‌రంగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు ఇలా న్యాయ‌స్థానాల‌లో నిల‌బ‌డ‌క‌పోతే ప్ర‌భుత్వ విశ్వ‌స‌నీయ‌త‌పైనే అనుమానం క‌లుగుతుంది.

ఏ నిర్ణ‌యం తీసుకున్నా అది అంద‌రికి ఆమోద‌యోగ్యంగా ఉండేలా చూడాల్సిన బాధ్య‌త ఎన్నికైన ప్ర‌భుత్వాల‌పై ఉంటుంది. అలా జ‌ర‌గ‌ని ప‌క్షంలో ఎవ‌రో ఒక‌రు కోర్టుకు వెళ్ల‌క మాన‌రు, స‌హ‌జ న్యాయ‌సూత్రాల‌కు విరుద్ధంగా ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉంటే అభాసుపాలు కాక త‌ప్ప‌దు.

గ‌తంలో జ‌రిగిన అన్ని నిర్ణ‌యాలు, వాటిపై కోర్టు తీర్పుల జోలికి వెళ్ల‌కుండా తాజాగా న‌డుస్తున్న ఒక్క కేసును ప‌రిశీలిస్తే ప్ర‌భుత్వ ప‌రంగా మ‌రింత జాగ్ర‌త్త‌గా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం మాత్రం క‌నిపిస్తున్న‌ది. కాంగ్రెస్ పార్టీ కి చెందిన శాస‌న‌స‌భ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల‌ను అసెంబ్లీ నుంచి డీబార్ చేశారు. ఈ కేసు కోర్టుకు చేరింది.

తెలంగాణ శాస‌న‌స‌భ‌, శాస‌న మండ‌లి ఉమ్మ‌డి స‌మావేశంలో గ‌వ‌ర్న‌ర్ ఇ ఎస్ ఎల్ న‌ర్సింహ‌న్ ప్ర‌సంగిస్తుండ‌గా కొన్ని సంఘ‌ట‌ల‌ను జ‌రిగాయి. కాంగ్రెస్ స‌భ్యులు వెల్ లోకి దూసుకువ‌చ్చి కాగితాలు చింపి వేయ‌డం నినాదాలు చేయ‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొన్న‌ది.

ఈ సంద‌ర్భంలో జ‌రిగిన ఒక సంఘ‌ట‌న‌తో కాంగ్రెస్ పార్టీ కి చెందిన శాస‌న‌స‌భ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల‌ను అసెంబ్లీ నుంచి డీబార్ చేయాల‌ని ఆ త‌ర్వాతి రోజు శాస‌న‌స‌భ తీర్మానం చేసింది.

అన్నీ హ‌డావుడి నిర్ణ‌యాల కిందికే వ‌స్తాయా?

దాన్ని స్పీక‌ర్ ఆమోదించి అమ‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే నోటిఫికేష‌న్లు జారీ చేసి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి కూడా ప్ర‌భుత్వం నివేదించింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇలా జ‌ర‌గ‌కూడాదు. శాస‌న‌స‌భ్య‌ల అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌ను ఎథిక్స్ క‌మిటీకి నివేదించాలి. వారు విచార‌ణ జ‌రిపి నేరం నిర్ధారించాలి. ఆ త‌ర్వాత స‌భ ఆ నివేదిక‌ను ఆమోదించి చ‌ర్య‌లు చేప‌ట్టాలి.

అంతే కాదు. శాస‌న‌స‌భ్యుల స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసే అంశంపై గ‌వ‌ర్న‌ర్ ఆమోద ముద్ర కూడా ఉండాల‌ని మ‌రి కొందరు న్యాయ నిపుణులు అంటున్నారు. ఇవేవీ జ‌ర‌గ‌కుండా ఎకాయ‌కిన ఇద్ద‌రిని బహిష్కరించడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

కేసు విచార‌ణ స‌మ‌యంలో వీడియో ఫుటేజి ఇస్తామ‌ని ఎడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ చెప్ప‌డం, అందుకు ప్ర‌భుత్వం నిరాక‌రించ‌డంతో ఆయ‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. అక‌స్మాత్తుగా జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌తోనే తెలంగాణ ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డింది. ఈ పిటిష‌న్‌పై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు విచారణ చేపట్టారు.

ఉదయం కేసు విచారణకు ప్రభుత్వం తరఫున ఎవరూ హాజరుకాకపోవడంతో అడ్వొకేట్‌ జనరల్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రాలేదని రికార్డు చేస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం వచ్చిన ఏఏజీ జె.రామచంద్రరావు తాను న్యాయశాఖ తరఫున హాజరవుతున్నానని చెప్పారు.

గత వారం ఏజీ ప్రతినిధిగా హాజరయ్యానని, ప్రస్తుతం ఏజీ లేనందున ప్రభుత్వం తరఫున హాజరుకావాలని సూచనలు వచ్చాయన్నారు. అయితే, ప్రభుత్వం కూడా అసెంబ్లీలో భాగమని, గతంలో ఏజీ ఇచ్చిన మాటకు రెండూ కట్టుబడి ఉండాల్సిందేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది రవిశంకర్‌ నివేదించారు.

ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోలేరని, ప్రభుత్వ పాలన అన్నది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. అసెంబ్లీ సచివాలయం తరఫున తాను హాజరుకావడంలేదని, సభకు విచక్షణాధికారాలున్నాయని, నోటీసులు ఇచ్చే పరిధి ఈ కోర్టుకు లేదని ఏఏజీ తెలిపారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వీడియో ఫుటేజీ సమర్పిస్తున్నారా? లేదా అని ప్రశ్నించారు.

అసెంబ్లీ రికార్డుల కోసం కోర్టు ఎవ‌రిని అడ‌గాలి?

వీడియో ఫుటేజీ సమర్పించాల్సింది అసెంబ్లీ అని, దానికి తీర్మానం చేయాల్సి ఉంటుందని, అలాంటి తీర్మానం చేసినట్లు లేదని ఏఏజీ న్యాయ‌స్థానంలో చెప్పారు. అయితే ఇదే విషయమై మెమో దాఖలు చేయొచ్చని న్యాయమూర్తి చెప్పగా.. తాను చేయలేనని, అసెంబ్లీ తరఫున తాను హాజరుకావడంలేదని ఏఏజీ చెప్పారు.

ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని సూచనలు అందాయని, ఇందులో న్యాయశాఖ నామమాత్రపు ప్రతివాది మాత్రమేనని చెప్పారు. కౌంటరు దాఖలు చేయడానికి 4 వారాల గడువు ఇవ్వాలని అభ్యర్థించగా న్యాయమూర్తి నిరాకరించారు. ఇప్పటికే గడువు ఇచ్చామని, ఏప్రిల్‌ 3లోగా దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 3వ తేదీకి వాయిదా వేశారు.

అందుబాటులో ఉన్న వీడియో ఫుటేజీని సమర్పించని పక్షంలో అందులోని అంశాలు వ్యతిరేకంగానే ఉన్నట్లు పరిగణిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఉమ్మడి హైకోర్టు మంగళవారం అసెంబ్లీ కార్యదర్శికి స్పష్టంచేసింది.

ఇందుకు సంబంధించి గోపాల్‌, కష్ణాజీ కేడ్కర్‌ వర్సెస్‌ మహమ్మద్‌ హాజీ లతీఫ్‌ తదితరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉత్తర్వుల్లో పేర్కొంది.

వీడియో ఫుటేజీని ఇవ్వ‌డంలో ప్ర‌భుత్వం ఎందుకు వెన‌క్కిపోతున్న‌ది అనేది ఇక్క‌డ ప్ర‌శ్న‌. ఇక్క‌డే కేసు బ‌ల‌హీనం అవుతున్న‌ద‌ని న్యాయ‌నిపుణులు అంటున్నారు.

English Summery: For the past four years the  Telangana Government has faced so many legal hurdles. Now another major issue has came up in the High Court and the arguments are going on. 

Leave a Reply