లేటుగా పడుకుంటున్నారా…! అయితే ఆయష్షు తగ్గడం ఖాయం…

Share Icons:

హైదరాబాద్, 5 నవంబర్:

ఒకప్పుడు మన పెద్దలు రాత్రి 8, 9గంటల కల్లా నిద్రపోయి.. ఉదయాన్నే 4 లేదా 5గంటలకు నిద్రలేచేవారు. అందువల్ల వారికి వయసు మీదపడుతున్నా మంచి ఆరోగ్యంగా ఉండేవారు. అలాగే ఎక్కువకాలం జీవించే వారు. అయితే ప్రస్తుత కాలం మాత్రం దీనికి విరుద్దంగా మారింది. చాలామంది అర్థరాత్రి 12 గంటలు, ఒంటి గంట దాటితేగానీ నిద్రపోవడం జరగదు.

ఇక దానికి తగ్గట్టుగానే ఉదయం 8, 9 కానిదే నిద్రలేవరు… కానీ ఇలా ఆలస్యంగా పడుకోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఉద్యోగరీత్యానో లేక వ్యాపార రీత్యానో నిద్రపోవడం లేటు అవుతుంది. అలాగే ఎక్కువ సమయం టీవీలు చూడటం, మొబైల్స్ వాడటం. అయితే ఆలస్యంగా పడుకోవడం వలన ఆయుక్షీణం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

ఇక రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం తొందరగా లేచేవారితో పోలిస్తే.. ఆలస్యంగా పడుకొనే వారికి ఆయుష్షు క్షీణించే ముప్పు 10% వరకు  ఎక్కువవుతున్నట్టు బయటపడింది. ఆలస్యంగా పడుకునే అలవాటు గల కొంత మందిని పరిశీలించి పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు.

ఆలస్యంగా నిద్రపోవడం వల్ల వచ్చే సమస్యలు…

ఆలస్యంగా పడుకునేవారిలో మధుమేహం, మానసిక సమస్యలే కాదు.. నాడీసంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. ఒంట్లో వాపు ప్రక్రియ మొదలవుతుంది. ఇలా ఆలస్యంగా నిద్రపోయేవారిలో ప్రవర్తన, అలవాట్లు కూడా మారిపోవచ్చు. 

ఉదాహరణకు- సమతులాహారం తీసుకోకపోవటం, జంక్‌ఫుడ్‌ తినటం వంటివి చేయొచ్చు. మద్యం, పొగ వంటి దురలవాట్లకూ బానిసలవ్వొచ్చు. కాబట్టి రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం త్వరగా లేవటం అలవాటు చేసుకోవటం మంచిది. 

మామాట: అదండీ సంగతి….అందుకే త్వరగా నిద్రపోండి ఆయష్షు పెంచుకోండి….

Leave a Reply