అప్పుడు చంద్రబాబు ఓ కాంగ్రెస్ నేత కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పారు….

Sexual harassment case against Lakshmi Parvathi
Share Icons:

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబుకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఇందిరాగాంధీ సీటు ఇచ్చిన సమయంలో ఆయన దగ్గర డబ్బులేమీ లేవని అన్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పెద్ద కాంగ్రెస్ లీడర్ కూతురుని పెళ్లి చేసుకుంటానని చంద్రబాబు చెప్పి, తన ఎన్నికల ఖర్చు మొత్తం ఆయనతో పెట్టించాడని ఆరోపించారు.

ఇక ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలిచారని, సంజయ్ గాంధీని పట్టుకుని మంత్రి పదవి కూడా దక్కించుకున్నారని చెప్పారు. అప్పుడు చంద్రబాబు మంత్రి పదవి తెచ్చుకోవడం చాలా పెద్ద గొడవ అయిందని, మొదటి నుంచి కూడా బాబుది అడ్డదారి రాజకీయమేనని విమర్శించారు. కానీ, మధ్య వర్తుల ద్వారా ఎన్టీఆర్ కూతురుని పెళ్లి చేసుకోవడానికి చంద్రబాబు ముందుకొచ్చాడని, ఈ నిర్ణయంతో ఎన్నికల్లో ఎవరైతే చంద్రబాబుకు డబ్బు ఖర్చు పెట్టారో వారు చాలా బాధపడ్డారని అన్నారు.

తన కూతురిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, ఇప్పుడు ఇంత అన్యాయం చేస్తావా? అని చంద్రబాబును ఆ నాయకుడు ప్రశ్నించారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కు అల్లుడిని అయితే తనకు పెట్టిన ఎన్నికల ఖర్చంతా తీర్చేస్తానని ఆ నాయకుడికి చంద్రబాబు చెప్పారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. అలాగే నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ మంచి వాళ్లని, ఎటువంటి కల్మషం వారిలో లేదని లక్ష్మీపార్వతి అన్నారు. పెద్దచెట్టును నాశనం చేయడానికి ఓ పురుగు చాలు, అలాగే, నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

అయితే ఆ రోజున హరికృష్ణ, బాలకృష్ణలను తీసుకొచ్చి టీడీపీ అధ్యక్ష పదవి ఒకరు, ముఖ్యమంత్రి పదవి మరొకరు తీసుకోండంటూ వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబు నాటకాలు ఆడారని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్థం కోసం హరికృష్ణ, బాలకృష్ణలను రాజకీయాల్లోకి దింపారని విమర్శించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను, హరికృష్ణ కూతురు సుహాసినిని, కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ను తన స్వార్థం కోసం చంద్రబాబు వాడుకుని వదిలేశారని దుయ్యబట్టారు. మొత్తానికైతే లక్ష్మీపార్వతి గత కొన్ని రోజులుగా చంద్రబాబుపై  విమర్శలు చేస్తూనే ఉన్నారు.

Leave a Reply