అలాంటప్పుడు టీడీపీనే బంగారం చేయాల్సింది రేవంత్….

Komatireddi venkatareddi fires on his own party leader revanth reddy
Share Icons:

హైదరాబాద్, 10 మే:

సొంత పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిపై సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు.

పార్టీలోని సీనియర్లను అవమానించేలా రేవంత్‌ వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీని బంగారం చేస్తానన్న తీరుపై కోమటిరెడ్డి స్పందిస్తూ…అలాంటప్పుడు టీడీపీనే బంగారం చేయాల్సిందని అన్నారు.

అలాగే తాను ఎన్నో ఏళ్లుగా ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నానని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం కాదనుకుని నిరవధిక నిరాహార దీక్షకు దిగానన్నారు.

నల్గొండలో ఫ్లోరైడ్‌ సమస్య పరిష్కారానికి దీక్షలు చేపట్టానని అన్నారు. తనంతట తాను దీక్ష చేస్తుంటే రేవంత్ రెడ్డి చెబితే ఆందోళనకు దిగాననడం విడ్డూరంగా ఉందన్నారు.

అలాగే తమ శాసనసభ సభ్యత్వంపై వేటు పడిన నేపథ్యంలో గాంధీభవన్‌లో రెండు రోజుల దీక్ష చేయడానికి రేవంత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.

అసలు రేవంత్ దగ్గర తాము ఎలాంటి సలహా తీసుకోలేదని, ఇది తన సహచర ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలిసి తీసుకున్న నిర్ణయమన్నారు.

ఇక మరొక సందర్భంలో శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలోకి వచ్చిన 4 రోజులకే రేవంత్‌కు అంత ఉలికిపాటు పనికిరాదని అన్నారు. పీసీసీపై విమర్శలు చేయడం తగదనీ, కాంగ్రెస్‌లో ఎవరైనా బేషరతుగానే చేరుతారన్నారు. రేవంత్‌కు రాహుల్‌ ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. సీఎం కావాలన్న కోరిక ఆయన వ్యక్తిగతమన్నారు.

మామాట: మొత్తానికి రేవంత్ మాటలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి..

Leave a Reply