కోడెలకు నివాళి అర్పించిన వైసీపీ నేతలు, లగడపాటి

Kodela Siva Prasad's last rites to be held at Narsaraopet today
Share Icons:

నరసారావుపేట:  ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ఈరోజు నరసరావుపేటలో జరగనున్నాయి. కోడెల అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నరసారావుపేట కోడెల స్వగృహంలో ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు.  అలాగే  వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా కోడెల పార్థివ దేహాన్ని దర్శించుకుని నివాళి అర్పించారు. కోడెల కుమారుడిని ఓదార్చారు.

ఇక మాజీ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈరోజు కోడెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మరణంతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. కోడెలకు ఇలాంటి పరిస్థితి వస్తుందని తాము ఎవ్వరం ఊహించలేదని వ్యాఖ్యానించారు.

‘మేం కాలేజీలో ఉన్నప్పుడు కోడెల ఓ పోరాటయోధుడు. ఆయన ధైర్య సాహసాలకు మారుపేరు. కోడెల చాలా బలమైన వ్యక్తిత్వం కలిగిన నేత. నా మేనమామ, కోడెల ఇద్దరూ గుంటూరు మెడికల్ కాలేజీలో కలిసి చదువుకున్నారు. మా మేనమామకు కోడెల సన్నిహితుడు. దీంతో నన్నూ మేనల్లుడిలా, వాళ్ల అబ్బాయిలా ట్రీట్ చేసేవారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా మేమిద్దరం తరచూ కలుస్తుండేవాళ్లం’ అని లగడపాటి కోడెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే కోడెల మృతి నేపథ్యంలో టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం, అధికార లాంఛనాలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘ కోడెలను ప్రభుత్వమే హత్య చేసింది, ఇక అధికార లాంఛనాలు ఎందుకు?. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినంత మాత్రాన కోడెల ఆత్మకు శాంతి చేకూరదు. పల్నాడులో టీడీపీని దెబ్బతీయాలనే కోడెలను టార్గెట్‌ చేశారు. వైసీపీ ఇబ్బందికి గురిచేస్తోందని కోడెల నా ముందు ఏడ్చారు. కోడెలను మానసిక క్షోభకు గురిచేశారు’ అని గోరంట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాజీ స్పీకర్ కోడెల బలవన్మరణం బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వేధింపులు ఆపాలని కోరారు. ప్రభుత్వానికి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా.. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. కోడెల అంత్యక్రియల నేపథ్యంలో ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు పనిచేస్తాయని అనుకోవడంలేదన్నారు.

 

Leave a Reply