జషిత్ క్షేమం: బాబుని కుతుకులూరులో వదిలేసి వెళ్ళిన కిడ్నాపర్లు…

kidnapped-child-jashit-safe-and-reached-his-parents
Share Icons:

రాజమండ్రి:

 

గత మూడు రోజులుగా ఏపీలో సంచలనం సృష్టించిన నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది.  బాలుడిని అపహరించుకు వెళ్లిన కిడ్నాపర్లు, రాయవరం మండలం కుతుకులూరు వద్ద ఈ తెల్లవారుజామున బాలుడిని వదిలేసి వెళ్లారు. ఆ వెంటనే బాలుడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 

ఇక జషిత్‌ ను మండపేట పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకొచ్చారు. అక్కడ నుంచి ఎస్‌ఐ నయూమ్ జషిత్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.  జషిత్‌ ను చూసిన అతని తల్లి వల్లి, కన్నీటితో గుండెలకు హత్తుకుంది. జషిత్ తిరిగి కనిపించడం వెనుక, ప్రజల పాత్ర చాలా ఉందని, వ్యక్తిగత కారణాలే బాలుడి అపహరణకు కారణమని జిల్లా ఎస్పీ నయీం తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకుంటామని అన్నారు.

 

అలాగే తనను తీసుకెళ్లిన వారు రోజూ ఇడ్లీలను మాత్రమే పెట్టారని వచ్చీరాని మాటలతో జషిత్ చెప్పాడు. తిసుకెళ్లిన వారిలో రాజు అనే వ్యక్తి తనకు తెలుసునని, అతనే తనను కారులో వదిలిపెట్టి వెళ్లాడని అన్నాడు. రాజుతో పాటు మరో ఇద్దరు ఉన్నారని చెప్పాడు. వారు తనను కొట్టలేదని అన్నాడు. కిడ్నాప్ చేసిన తరువాత వేరే ఊరికి తీసుకెళ్లి, ఓ వ్యక్తి ఇంట్లో వదిలేశారని చెప్పాడు.

 

కాగా, తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని విజయలక్ష్మి నగర్‌ లో సోమవారం రాత్రి, తన నానమ్మతో ఆడుకుంటుండగా, జషిత్ అపహరణకు గురైన సంగతి తెలిసిందే. ఆపై పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి, బాలుడి కోసం విస్తృతంగా గాలించారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించడం, అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున బాబుకి మద్ధతుగా ప్రచారం జరగడంతో భయపడిపోయిన కిడ్నాపర్లు, బాలుడిని వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది.

Leave a Reply