కేశినేని కుమార్తె ట్వీట్: జగన్‌ని రాజకీయాలు పక్కనపెట్టమంటూ

Share Icons:

విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు జగన్ సర్కార్‌కు చెంపపెట్టని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని తనయురాలు, టీడీపీ నాయకురాలు కేశినేని శ్వేత ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ముఖ్యమంత్రి గారూ.. సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. రాజకీయాలు పక్కనపెట్టి కనీసం ఇప్పుడైనా ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించండి. మాస్కులు, శానిటైజర్లని ఉచితముగా పంపిణీ చేయండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇగో రాష్ట్రానికి శాపంగా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు కరోనా పట్ల పూర్తి అప్రమత్తతతో ఉన్నాయని… ఏపీలో మాత్రం ఎలాంటి చర్యలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా జగన్‌ తన అధికార దాహాన్ని వీడి.. ప్రజల ప్రాణాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని నారా లోకేష్‌ కోరారు.

కరోనాపై ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యలు చూసి ప్రపంచమంతా నవ్వుతోందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సీఎం కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడారన్నారు. ఎస్ఈసీ రమేష్‌కుమార్‌ని కులం పేరుతో దూషిస్తారా? అని వర్ల రామయ్య మండిపడ్డారు. కరోనాపై దేశమంతా అలెర్ట్‌ అయింది కానీ.. సీఎం మొద్దు నిద్ర వీడట్లేదన్నారు. గతంలో పులివెందులలో మాత్రమే దాడులు జరిగేవని.. ఇప్పుడు రాష్ట్రమంతా అరాచకాలు చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శించారు. కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారన్నారు. జగనన్నకి గిఫ్ట్‌ ఇస్తామని సీఐ స్థాయి అధికారులు.. బహిరంగంగా ప్రకటించారని వర్ల రామయ్య వెల్లడించారు.

 

Leave a Reply