న్యూ ఢిల్లీ నుంచి కేజ్రీ బంపర్ విక్టరీ…దూసుకెళుతున్న ఆప్..

Share Icons:

ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ దూసుకెళుతుంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో ఆప్ 58 స్థానాలు కైవసం చేసే దిశగా వెళుతుంటే, బీజేపీ 12 స్థానాలకే పరిమితమైంది. ఇక న్యూ ఢిల్లీ స్థానం నుంచి సి‌ఎం కేజ్రీవాల్ విజయం సాధించారు. ఇక ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఆప్ అధినేత, ఢిల్లీకి మూడోసారి కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ట్విట్టర్ వేదికగా బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ‘భారత ఆత్మను ఢిల్లీ ఓటర్లు గెలిపించారు’ అంటూ బీజేపీని ఉద్దేశించి పీకే పరోక్షంగా ట్వీట్ చేశారు.

అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైన ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు. సాంప్రదాయం ప్రకారం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే… ముచ్చటగా మూడోసారి సీఎం కాబోతూ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టించిన కేజ్రీవాల్ ఫిబ్రవరి 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలిసింది.

అటు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూటగట్టుకోవడంపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె, కాంగ్రెస్ నేత షర్మిష్ఠ ముఖర్జీ స్పందించారు. పై స్థాయిలో ఉన్న నేతలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇంతటి దుస్థితి దాపురించిందని ఫైర్ అయ్యారు. ‘‘మేము ఢిల్లీలో మళ్లీం ఓడాం. ఆత్మపరిశీలనకు సమయం చాలించి, నేరుగా చర్యలకై రంగంలోకి దిగాల్సిందే’’ అని స్పష్టం చేశారు. పై స్థాయిలో ఉన్న నేతల ఆలస్యంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహం లోపించడం, నేతల మధ్య సమన్వయం లేకపోవడం, కార్యకర్తల ఆశలపై నీళ్లు చల్లడం, కార్యక్షేత్రంలోని కార్యకర్తలతో నేతలకు సత్సంబంధాలు లేకపోవడం… ఇవన్నీ పార్టీ ఘోర ఓటమికి కారణాలని ఆమె తేల్చారు. ఈ ఓటమికి నైతికంగా తానూ బాధ్యత వహిస్తానని షర్మిష్ఠ ప్రకటించారు.

 

Leave a Reply