తమ్ముడు రాజీనామాపై స్పందిస్తూ సంచలన విషయం చెప్పిన కేఈ కృష్ణమూర్తి…

Share Icons:

కర్నూలు: కీలక నేతలంతా టీడీపీకి షాకుల మీద షాకులిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అనుచరులకు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఆవేదన చెందిన ఆయన.. వారితో సమావేశమై ఈ నిర్ణయానికి వచ్చారు. రాజీనామా అనంతరం కేఈ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీని వీడటం బాధగా ఉందన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెసు పార్టీ విధానాలనే టీడీపీలోనూ అవలంబిస్తున్నారు. తన అన్న కేఈ క్రిష్ణమూర్తి పార్టీ మారతారా? లేదా? అన్నది ఆయన ఇష్టమన్నారు. వైసీపీ నుంచి తనకు ఆహ్వానం రాలేదని.. వస్తే వెళ్తానని కేఈ ప్రభాకర్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే తమ్ముడి రాజీనామాపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. ప్రభాకర్ తనతో మాట్లాడలేదని.. వైసీపీలోకి వెళ్తే అభ్యంతరం లేదన్నారు. కాగా.. డోన్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేఈ కృష్ణమూర్తి స్వయంగా వెల్లడించారు. డోన్‌ మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు చైర్మన్‌, 32 వార్డులు దానం చేస్తున్నామని తెలిపారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై… గవర్నర్‌ను రెండు మూడుసార్లు కలిసి ఫిర్యాదు చేశామని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ హరిచందన్‌ నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదన్నారు.

గవర్నర్‌ ఇప్పటికైనా స్పందించాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రానికి వివరించాలన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని యనమల స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూలేని పరిస్థితులను చూస్తున్నామన్నారు. వ్యవస్థలన్నీ చేతులెత్తేశాక ప్రజలే గుణపాఠం చెప్పాలని యనమల పేర్కొన్నారు.

 

Leave a Reply