జనవరి 21 నుంచి కేసీఆర్ సహస్ర చండీయాగం

Share Icons:

హైదరాబాద్, జనవరి 12: 

తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 200 మంది రుత్వికులతో చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహించనున్నారు. జనవరి 21 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ఐదురోజులపాటు సిద్దిపేట ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సహస్ర చండీయాగం చేస్తారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు పడి, రైతులు సుభిక్షంగా ఉండేలా, ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిరాఘాటంగా కొనసాగేలా, బంగారు తెలంగాణ కల సాకారం అయ్యేలా అమ్మవారి అనుగ్రహం కోసం కేసీఆర్ సహస్ర హోమాలు చేయనున్నారు. యాగశాల నిర్మాణం, ఇతర ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్, సహస్ర చండీయాగానికి పండితులకు, యోగులకు, స్వాములకు ఆయన ఆహ్వానాలు పంపారు.

ఈనెల 25 వ తేదీన పూర్ణాహుతి నిర్వహిస్తారు. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి ఈ భక్తి కార్యక్రమాన్ని జరపబోతున్నారు. ఆమధ్య విశాఖ వెళ్లిన సీఎం కేసీఆర్… శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సలహాలు, సూచనలూ తీసుకున్నారు. యాగం ఎలా చేస్తే, ప్రజలందరికీ మేలు జరుగుతుందో కనుక్కున్న ఆయన… ఎక్కడా రాజీ పడకుండా దాన్ని నిర్వహిస్తామని తీర్థస్వామికి తెలిపారు. సందర్శకులు, భక్తుల్ని కూడా ఈ యాగానికి అనుమతిస్తారని తెలుస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం యాగం ఏర్పాట్లను అష్టకాల రామ్మోహన్శర్మ, శృంగేరి పీఠం పండితులు ఫణిశశాంకశర్మ, గోపీకృష్ణశర్మ పర్యవేక్షించనున్నారు.

1997లో చండీవనం యాగం, 2005లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు న్యూఢిల్లీలో ఆయుత చండీ మహయాగం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు నవంబర్‌లో రాజశ్యామలా యాగం నిర్వహించిన అనంతరం జరిగిన ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన విషయం విదితమే. ఈ సారి ఫెడరల్ ఫ్రంట్ ను పటిష్టం చేసే దిశగా కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలను స్థానిక పార్టీలే శాసించాలన్న దిశలో కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. యాగాలు, యజ్ఞాలు సీఎం కేసీఆర్ కు కలిసి వచ్చాయి. ఆపద సమయంలో ఆదుకున్నాయి.

ఉద్యమం నుంచి ఎన్నికల్లో గెలుపు వరకు యాగాలు అండగా నిలిచాయి. ఇప్పటి వరకు పదుల సంఖ్యలో యాగాలు చేసిన గులాబీ బాస్ మరో కీలక యాగం కోసం సన్నాహాలుచేస్తున్నారు.  దేశం వివిధప్రాంతాల నుంచి వచ్చే 200 మంది రుత్వికులు పాల్గొనే యాగానికి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.

2014లో తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబర్ 27న నవ చండీయాగం చేశారు. 2015 డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఆయుత శతచండీయాగాన్ని ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ యాగానికి ప్రాంతీయ, జాతీయ స్థాయి రాజకీయ నేతలు, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ యాగ పూర్ణాహుతి కార్యక్రమానికి విచ్చేశారు.కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల సస్యశ్యామలంగా ఉండాలని యాగం జరిపినట్లు కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు నిర్వహించబోయే చతుర్వేద పురస్సర మహారుద్ర సహిత సహస్ర చండీయాగం కూడా తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చినందుకూ, భవిష్యత్తులో రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకూ తలపెట్టారు.

మామాట: ప్రజల మేలు కోసం..

Leave a Reply