
మెదక్, జనవరి 19:
టీఆర్ఎస్ అగ్రనేతల్లో హరీశ్ రావు ఒకరు. సిద్ధిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం హరీశ్ భవితవ్యంపై ఆందోళనలు ముసురుకున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకుగాను క్రమంగా మేనల్లుడు హరీశ్‌ను పక్కనపెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను కేసీఆర్ నియమించడం – ఆపై హరీశ్ ఎక్కడా కనిపించకపోవడం ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.
అయితే ఆయనకు ఒక్క సిద్ధిపేటలోనే కాదు.. రాష్ట్రమంతటా మంచి జనాదరణ ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. గులాబీ పార్టీ విజయానికి కృషిచేశారు. పార్టీలో హరీశ్ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేలా తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంటోంది. అదే టీఆర్ఎస్లో కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి చేరిక. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన వంటేరు గులాబీ కండువా కప్పుకోవడం దాదాపుగా ఖాయమైంది. ఇది హరీశ్ రావుకు ప్రతికూలాంశమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొంతకాలంగా కేసీఆర్-కేటీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రధానంగా దృష్టిసారించారు. ఆపరేషన్ మెదక్ పేరుతో టీఆర్ఎస్ను జిల్లాలో బలోపేతం చేస్తున్నారు. జిల్లాలో తనకు సన్నిహితుడైన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ పదవిని కేటీఆర్ ఇటీవలే ఇప్పించారు. జిల్లా వ్యాప్తంగా పలువురు నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిలో పలువురికి కీలక పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మెదక్ లో హరీశ్ ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హరీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాలోనిదే.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ బాధ్యతలను కూడా హరీశే చూసుకుంటున్నారు. వంటేరు చేరికతో ఇక గజ్వేల్ బాధ్యతలు హరీశ్‌కు దూరమవుతాయి. అంటే హరీశ ఇక కేవలం సిద్ధిపేట నియోజకవర్గ స్థాయి నేతగా మాత్రమే ఉంటారన్నమాట. ఇన్నాళ్లూ టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్‌గా ఓ వెలుగు వెలిగిన హరీశ్ పరిస్థితి ఇప్పుడు ఇలా తయారయిందే అంటూ ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు.
మామాట: మరి కేసీఆర్ ఎలాంటి స్కెచ్ వేశారో…