మోడీకి ముందు కేసీఆర్ 22 డిమాండ్లు…మరి జగన్ ఎన్ని అడుగుతారో?

KCR, Jagan to Meet PM Modi; May Seek Funds and Approval for Pending Projects
Share Icons:

ఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన 22 డిమాండ్లని నెరవేర్చల్సిందిగా కేసీఆర్ మోడీని కోరారు.  22 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి కేసీఆర్ అందించారు. అందులో రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ. 450 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అయితే ఇంకా ఒక ఏడాది నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ కోరారు.

అలాగే ఐఐఎంను మంజూరు చేయాలని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని విన్నవించారు. నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయకు రూ. 5 వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ. 19,205 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఇక కరీంనగర్ లో ఐఐఐటీ, బయ్యారంలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి చేయాలని కోరారు.

రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని,  సెంట్రల్ యూనివర్శిటీ తరహాలో వరంగల్లో గిరిజన యూనివర్శిటీని కేంద్ర నిధులతో ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్ టెక్స్ టైల్ పార్క్ కు రూ. 1000 కోట్లను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పలు విన్నపాలతో కూడిన లేఖను ప్రధానికి ముఖ్యమంత్రి అందించారు.

ఇదిలా ఉంటే నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యి ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా కోరనున్నారు. వీరి మధ్య జరిగే సమావేశంలో ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులపై చర్చించనున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. నవరత్నాల పథకాలకే చాలా డబ్బు ఖర్చవుతోంది. ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ఫలితాలు పెద్దగా కనిపించట్లేదు. కేంద్రం నుంచీ చాలా అంశాల్లో నిధులు ముందుగా అనుకున్నట్లుగా రావట్లేదు. అవి వస్తే కొంతవరకూ ఆర్థిక లోటును భర్తీ చేసుకోవచ్చు. ఈ విషయంపై సీఎం జగన్ ఎక్కువగా ఫోకస్ పెడతారని తెలుస్తోంది.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయిన మర్నాడే… ప్రధానితో ఏపీ సీఎం జగన్ భేటీ అవుతుండటం రాజకీయంగా చర్చకు దారితీసింది. వ్యూహాత్మకంగానే ఇదంతా జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.ఎలా జరిగిన అంతిమంగా రాష్ట్రానికి నిధులు రప్పించడమే జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది.

 

Leave a Reply