సాగర్ లో కేసీఆర్ ,కేటీఆర్ విస్తృత  ప్రచారం…

Share Icons:
-పకడ్బందీ వ్యూహంతో నియోజకవర్గాన్ని   జల్లెడపడుతున్న టీఆర్ యస్ నేతలు
– కొందరు నేతలు బయటకు పోవటం పై ఆందోళన
***

నాగార్జున సాగర్ ఉపఎన్నికలలో టీఆర్ యస్ జోరు పెంచింది .పకడ్బందీ వ్యూహంతో టీఆర్ యస్ ముందుకు పోతుంది.అధికార పార్టీ కావటంతో దీనికి కొంత అడ్వాంటేజ్ ఉంది. దాని ఆధారంగా నియోజకవర్గాన్ని జల్లెడపడుతుంది. ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని వదులు కోవద్దని పార్టీ నాయకులకు ఆదేశాలు రావటంతో భూత అద్దాలతో అవకాశాలను వెతుకుతున్నారు. అయితే కొంత మంది టీఆర్ యస్ నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారని వస్తున్న వార్తలపై ఆందోళన ఉంది. సెంటిమెంటు ను నమ్ముకున్న టీఆర్ యస్ మరణించిన ఎమ్మెల్యే నోముల కుమారుడు నోముల భగత్ నిర్ణయించింది .  భగత్ విజయం కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ రానున్నట్లు సమాచారం .

ఇప్పటికే పార్టీ లోని ముఖ్య నేతలు సాగర్ లో మకాం వేసి టీఆర్ యస్ తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరారా తిరిగి మీటింగ్ లు పెడుతున్నారు. నోటిఫికేషన్ కు ముందే కేసీఆర్ బహిరంగ సభ పెట్టి నియోజవర్గంపై వాగ్దానాల వర్షం కురిపించారు. సాగర్ లో గెలవక పోతే పార్టీకి ఇబ్బందులు తప్పేలాలేవు అందువల్ల అభ్యర్థి కన్నా పార్టీ ప్రతిష్ట ప్రధానంగా మారింది . ఆరునూరైనా సీటు గెలవటం కీలకం కానున్నది . దుబ్బాక ఉపఎన్నిక , గ్రేటర్ హైద్రాబాద్ లో ఎదురు దెబ్బలు తిన్న టీఆర్ యస్ కు సాగర్ ఎన్నిక అత్యంత ప్రధానంగా మారింది.   దుబ్బాక ఎన్నికల్లో కేసీఆర్ లేకపోవడం తమకు నష్టం జరిగిందని అందువల్ల కేసీఆర్ ప్రచారం ఉండాల్సిందేనని టీఆర్ యస్ శ్రేణులు అంటున్నాయి. జి హెచ్ ఎం సి ఎన్నికలలో ఎల్ బి స్టేడియం లో జరిగిన సభలో కేసీఆర్ పాల్గొన్నప్పటికీ ఏమి విజయాలు సాధించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆయన వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ఒరిగేది ఏమిలేదని ప్రతిపక్షాలు అంటుంటే ఈ సారి ఆయన ప్రచారం ఉండాలని టీఆర్ యస్ శ్రేణులు కోరుకుంటున్నాయి . దీంతో ప్రచారానికి తాను కూడా స్వయంగా వెళ్లాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు సమాచారం .  తానే కాకుండా తనయుడు కేటీఆర్ కూడా వస్తాడని కేసీఆర్ వెల్లడించినట్లు తెలుస్తుంది.

గతంలో ఈ నియోజకవర్గం చలకుర్తి గా ఉంది పునర్వి భజనలో దీన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గముగా మార్చారు . ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో టీఆర్ యస్ కు చెందిన నోముల నరసింహయ్య గెలుపొందారు. ఆయన మరణంతో జరుగుతున్న ఉపఎన్నిక లో నోముల కుమారుడు నోముల భగత్ కు టికెట్ ఇచ్చారు. ఇక్కడ పోటీకోసం అనేక మంది ప్రయత్నాలు చేశారు. సెంటిమెంట్ ఆయుధంగా పోతేనే తమకు అనుకూలంగా ఉంటుందని భావించిన టీఆర్ యస్ అన్ని ఆలోచనలు పక్కన పెట్టి సానుభూతిని నమ్ముకొని అభ్యర్థిని ఎంపిక చేయటం తో టీఆర్ యస్ లో కొంత అసంతృప్తి ఉందనే ప్రచారం ఉంది.  టికెట్ ఆశించిన ముఖ్యనేత మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడు పార్టీకి గుడ్ బై చెబుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది ఆయన్ను బుజ్జగించే పనిలో టీఆర్ యస్ ఉంది. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి . టీఆర్ యస్ పార్టీ కూడా , కాంగ్రెస్ ,బీజేపీ లో ఉన్న కొందరికి గాలం వేస్తుంది. ముఖ్యులైన నేతలను దారికి తెచ్చుకోవటం ద్వారా జానారెడ్డి ను కట్టడి చేయాలనీ చూస్తుంది.

ఇప్పటికే నియోజవర్గంలో తిష్ట వేసిన టీఆర్ యస్ ఎమ్మెల్యేలు మండలాలు , గ్రామాల వారీగా ఇతర పార్టీలనుంచి తమ గాలానికి చిక్కేవారికోసం ప్రయత్నాలు ప్రారంభించారని కాంగ్రెస్ వారు పసి గట్టారు. కేసీఆర్ ,కేటీఆర్ పర్యటనల నాటికీ తమ పార్టీలో చేరే వారికీ కండువాలు కప్పాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యంత కష్టం మీద గెలిచినా టీఆర్ యస్ గెలుపు గెలుపుగా భావించటం లేదు. సాగర్ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే ఒక కిక్కు వస్తుందని ,క్యాడర్ కు బూస్ట్ ఇచ్చినట్లు అవుతుందని టీఆర్ యస్ భావిస్తుంది . ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఆశక్తిని కలిగిస్తుంది. చివరికి ఎవరిదీ పైచేయి అవుతుందో చూడాలి !!!

-కె. రాంనారాయణ, జర్నలిస్ట్

Leave a Reply