ఆంధ్రపత్రిక కు, అమృతాంజన్ కు చిరునామా: కాశీనాథుని నాగేశ్వరరావు.

Share Icons:

ఆంధ్రపత్రిక కు, అమృతాంజన్ కు చిరునామా: కాశీనాథుని నాగేశ్వరరావు.

ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమ ప్రోత్సాహకుడు, బహుముఖ ప్రజ్ఞా శాలి కాశీనాథుని నాగేశ్వరరావు.  ఆయనను నాగేశ్వరరావు పంతులు అనేవారు. దేశోద్ధారక అని ఆయనను అంతా గౌరవించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ‘కళాప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. ఆయన కృష్ణా జిల్లా ఎలకుర్రు గ్రామంలో శ్యామలాంబ, బుచ్చయ్య దంపతులకు 1867లో మే 1న జన్మించారు. స్వగ్రామంలోనూ, తరువాత మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం సాగింది. 1891లో ‘మద్రాసు క్రిస్టియన్ కాలేజి’లో పట్టభద్రుడయ్యారు. ఆ కాలేజిలో ప్రమముఖ విద్యావేత్త డా.రెవరెండ్ మిల్లర్ ప్రభావం ఆయనపై బడింది. వివేకవర్ధనిలో కందుకూరి వీరేశలింగం వ్యాసాలు కూడా ఆయనను ప్రభావితం చేశాయి. తొలుత కొన్నేళ్ళు ఆయన మద్రాసు, కలకత్తా, బొంబాయిలో ఉద్యోగ వ్యాపారాలు నిర్వర్తించారు. ప్రత్యేక ఆసక్తితో 1893లో అమృతాంజన్ లిమిటెడ్ స్థాపించారు. ఆయన స్వయంగా రూపొందించిన అమృతాంజనం అతి కొద్దికాలంలో అద్భుతమైన ప్రజాదరణ పొందింది..

ఆయన ఎప్పుడూ పదవులు ఆశించలేదు. ఆంధ్రపత్రిక, అమృతాంజనం సంస్థలు ఆయన సృష్ఠి.  ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసారు.. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం కూడా రాసారు. లక్షలకు లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తే అవకాశాలున్నా ఎప్పుడూ ఆడంబరాల జోలికి పోలేదు. అసమాన దానశీలి. ఆయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవా కలాపాలకు ధారాళంగా ఆయన సహాయం చేస్తుండేవారు అమృతాంజనం ద్వారా గడించిన డబ్బును పేద విద్యార్థులకి ఉపకారవేతనాలుగా అందజేసారు. ఆయన దేశభక్తి, దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కొనియాడాడు.

పత్రికా రంగం – ఆంధ్ర పత్రిక

1907లో సూరత్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించారు. పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో పులిట్జర్ ప్రయత్నంతో పోల్చవచ్చు.  సెప్టెంబరు 1908లో బొంబాయినుండి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వారపత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా దృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిబింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభింఛాడు. 1914 ఏప్రిల్ 1న మద్రాసునుండి ఈ పత్రిక తొలిసారిగా వెలువడడం తెలుగు పత్రికా రంగంలో ఒక సువర్ణాధ్యాయం. 1924లో ఆయన ప్రారంభించిన భారతి సాంస్కృతిక, సాహితీ పత్రిక తెలుగు సాహితీప్రియుల అభిమాన పత్రికగా నిలచింది. ఆంధ్రపత్రిక స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర వహించిన పత్రిక. పత్రికకు 1908 నుండి 1938 వరకు కాశీనాథుని నాగేశ్వరరావు, 1938 నుండి 1972 వరకు శివలెంక శంభుప్రసాద్, 1972 నుండి 1989 వరకు శివలెంక రాధాకృష్ణ,  1989 నుండి పత్రిక మూతపడే వరకు వీరాజీ సంపాదకుluగా ఉన్నారు.

దేశోద్ధారక : మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఆంధ్ర ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలన్న ఉద్యమానికి అరంభదశ నుండి నాయకులులో కీలక పాత్ర పోషిస్తూ రాష్టర్ విభజన అంశానికి అధిక ప్రాధాన్యతనిస్తూతన పత్రికలలో విస్తృతంగా ప్రచారం కల్పించారు. రాజకీయపరంగానూ, తెలుగు భాష, సంస్కృతిలకు సంబంధించిన ఇతర విషయాలలోనూ ఆయన తెలుగు జాతికి చేసిన సేవను గౌరవిస్తూ తెలుగువారు ఆయనను దేశోధ్ధారక బిరుదుతో సత్కరించారు.

రాజకీయాలు..

టంగుటూరి ప్రకాశం సమకాలీనుడైన నాగేశ్వరరావు 1924 – 1934 మధ్యకాలంలో నాలుగు సార్లు ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షునిగా ఉన్నారు. ముఖ్యంగా ఖద్దరు ఉద్యమానికి నాగేశ్వరరావు బలమైన మద్దతును, సహకారాన్ని అందించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం సమయంలో చురుకుగా పాల్గొన్న నాయకులలో ఆయన ఒకరు. నాగేశ్వరరావుపై ప్రజలకు ఎంతో అభిమానం, నమ్మకం ఉండేవి.

ఆంధ్ర గ్రంథమాల :

తెలుగు భాషకు ఆయన చేసిన సేవ అపారం. తెలుగు భాషాభిమానం సాహిత్యం, విజ్ఞానశాస్త్రాలలో ఉన్న ఆసక్తి అనన్య సామాన్యం. ఆంధ్ర గ్రంథమాల ద్వారా తెలుగు భాషలో అనేక భాషా, సాహితీ, విజ్ఞాన విషయాలపై గ్రంథాలను పరిచయం చేసి శాస్త్ర, సాహిత్య విజ్ఞానాభివృద్ధికి దోహదపడ్డారు. బసవపురాణం, పడింతారాధ్య చరిత్ర, జీర్ణ విజయనగర చరిత్ర, తంజావూరాంధ్ర నాయకుల చరిత్ర మొదలైన ప్రాచీన గ్రంథాలకు తోడు, మాలపిల్ల, మహాత్మాగాంధీ ఆత్మకథ తదితర ఆధునిక గ్రంథాలనేకం ప్రచురించారు. ఈయన అనేక విషయాలపై వ్యాసాలు మరియు అనేక గ్రంథాలకు పరిచయవాక్యాలు, ప్రవేశికలు కూడా రాశాడు. 1938లో కొమర్రాజు వెంకటలక్ష్మణరావు విరచిత ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు ముద్రించారు. తెలుగు నాటకరంగానికి విశేష సేవలు చేశారు. తెలుగు నాటకం అభివృద్ధి చేసేందుకు 1929లో ఆంధ్ర నాటక కళా పరిషత్తును స్థాపించిన నాటకరంగ ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు.

పత్రికా రంగంలోనే కాక ప్రచురణా రంగంలో ఆయన కృషి విస్తరింపజేసి 1926లో ‘ఆంధ్ర గ్రంథమాల’ అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ 20 పైగా పుస్తకాలు ప్రచురించింది. తిరుమల వెంకట రంగాచార్యులు సంకలనం చేసిన పారిభాషిక పదకోశము వాటిలో పేరెన్నికగన్నది. సామాన్యులకు పుస్తకాలు అందుబాటులో ఉండాలని తక్కువ వెలకు విక్రయించారు. తెలుగునాట గ్రంథాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వర్ణించవచ్చు.  1938 ఏప్రిల్ 1వ తేదీన ఆయన మద్రాసులో తనువు చాలించారు.

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply