కన్నడ రాజకీయం: నా హక్కులని గవర్నర్ శాసించలేరు: స్పీకర్ సంచలన వ్యాఖ్యలు

karnataka speaker ramesh kumar sensational comments
Share Icons:

బెంగళూరు:

 

బలపరీక్ష చేసి మెజారిటీ నిరూపించుకోవాలని కర్ణాటక గవర్నర్ విధించిన డెడ్ లైన్ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల లోపు మెజార్టీని నిరూపించుకోవాలని గవర్నర్‌ చేసిన సూచనను సీఎం కుమారస్వామి, స్పీకర్ పట్టించుకోలేదు. ఈ సందర్భంగా కన్నడ విధానసభలో గవర్నర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు నినాదాలు చేశారు.

 

అయితే గవర్నర్ చేసిన సూచనను స్పీకర్ ధిక్కరించడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తనను సుప్రీం కోర్టు, గవర్నర్ శాసించలేరని స్పీకర్ స్పష్టం చేశారు. చర్చ పూర్తి కాకుండా బల పరీక్ష నిర్వహించలేమని స్పీకర్ రమేష్ తేల్చిచెప్పారు.

 

గవర్నర్ లేఖ పంపింది సీఎం కుమారస్వామికి అని, అందువల్ల నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆయనేనని స్పీకర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారనే అంశంపై చర్చ జరగాలని సీఎం కుమారస్వామి పట్టుబట్టారు. ఇదిలా ఉంటే.. మిత్ర పక్షం కాంగ్రెస్‌పై కర్ణాటక సీఎం కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సొంత సభ్యులను కాంగ్రెస్ కాపాడుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. ఇరు పక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

కోట్ల రూపాయలు ఆఫర్‌ చేస్తుంటే ఎలా కాపాడుకుంటామని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. అలాగే బీజేపీ వ్యవహరిస్తున్న తీరును కుమారస్వామి ఎండగట్టారు. అనేక సార్లు ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూసిందని ఆయన ఆరోపించారు. తాను అమెరికా పర్యటనలో ఉండగా ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారన్నారు. బీజేపీ మరోసారి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపిందన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర బీజేపీ భద్రత కల్పిస్తోందని.. అధికారం కావాలనే కోరిక తనకు లేదన్నారు.

 

సీఎం స్థానంలోనే కూర్చోవాలనే ఆశ తనకు లేదన్నారు. ఇవాళ కాకపోతే రేపు అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. తానేమీ యాధృచ్చికంగా సీఎం కాలేదని..పరిస్థితులే తనను సీఎం చేశాయన్నారు.

 

Leave a Reply