వైసీపీలోకి బాబు ఫ్రెండ్: చీరాలలో గ్రూప్ రాజకీయాలు..

Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీని వీడగా, తాజాగా చంద్రబాబు సన్నిహితుడు, సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీలోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు సమాచారం.

కరణం బలరామకృష్ణమూర్తి గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆమంచికృష్ణమోహన్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. బలరాంకు చీరాల సొంత నియోజకవర్గం కాదు.. ఆయన అద్దంకి నుంచి పోటీ చేసేవారు. కానీ గతంలో టీడీపీలో ఉన్న ఆమంచి వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడంతో.. కరణంను చంద్రబాబు చీరాల పంపించారు. ఎన్నికలకు ముందు నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించిన ఆయన కృష్ణమోహన్‌పై 17వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఇక బలరాం వైఎస్సార్‌సీపీలో చేరితే చీరాలలో రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్సార్‌‌సీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరిపోయారు. చీరాల నియోజకవర్గంంలో సునీత, ఆమంచి వర్గాల మధ్య కాస్త గ్యాప్ ఉంది.. ఇప్పుడు బలరాం అధికార పార్టీగూటికి చేరితే.. అక్కడ మొత్తం మూడు వర్గాలుగా మారే ప్రమాదం లేకపోలేదు. మరి ఈ ముగ్గురు నేతల్ని వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆమంచి కరణం బలరాం రాకను స్వాగతిస్తారా లేదా అన్నది చూడాలి. అంతేకాదు భవిష్యత్‌లో చీరాల బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

బలరాం వైఎస్సార్‌సీపీలోకి వెళితే.. ఆయన కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్ పరిస్థితి ఏంటన్నది చూడాలి. దీంతో ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి బాటలో టిడిపి ఎమ్మెల్యే కారణం బలరాం పయనించనున్నారు. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్, విశాఖపట్టణానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఏ రెహమాన్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక పులివెందులలో జగన్‌పై పోటీచేసిన సతీష్ రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పారు. మార్చి 13న జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

 

Leave a Reply