వైసీపీ ప్రభుత్వం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి వేస్తోంది…

ap bjp president kanna lakshmi narayana fires on tdp
Share Icons:

అమరావతి:

జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన రాజధాని అమరావతి లో పర్యటిస్తూ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పిన జగన్… వారి మాటలకు పూర్తి విరుద్ధంగా వెళుతున్నారని విమర్శించారు. గత నాలుగు నెలలను పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వ తీరు ఒకడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి వేస్తున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

అన్ని విషయాల్లో ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటోందని కన్నా దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువ, పని తక్కువ అనే విషయం స్పష్టంగా కనపడుతోందని అన్నారు. అధికారంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి… ప్రతిపక్షంలో ఉన్నామనే భావనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. అన్ని పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని… అయితే, అవినీతి ఎక్కడ జరిగిందో, ఎవరు చేశారో అనే విషయాన్ని మాత్రం వెల్లడించరని అన్నారు.

ప్రజావేదికను కూల్చాలనుకున్నప్పుడు కూడా వద్దని తాను చెప్పానని… అయితే, ఏకపక్ష నిర్ణయాలతో దాన్ని కూల్చివేశారని… అదంతా ఎవరి సొమ్ము అని కన్నా ప్రశ్నించారు. ఆ సొమ్ము నీది కాదు, చంద్రబాబుది కాదని… అది ప్రజల సొమ్ము అని జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంతా నా సొంతం అనుకుంటే కుదరదని… ఏదీ నీ సొంతం కాదని అన్నారు. నా సొంతం అనుకున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని… రేపు నీకు కూడా అదే విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న పార్టీ ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాల్సి ఉంటుందని హితవు పలికారు.

 

Leave a Reply