లోక‌నాయ‌కుడు అవుతాడా?

Share Icons:

లోక‌నాయ‌కుడు అవుతాడా?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కొత్త శ‌కం ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో వ్య‌తిరేక భావ‌న‌లు, క‌క్ష‌పూరిత వ్య‌వ‌హారాలు న‌డిచాయి. డిఎం కె, ఏఐఏడిఎంకెలు వీధిపోరాటాల నుంచి అసెంబ్లీ పోరాటాల వ‌ర‌కూ చేసుకునేవి.

ఎవ‌రు అధికారంలో ఉంటే వారు అధికారం లేని వారిని వేధించేవారు.

ఇప్పుడు ప‌రిస్థితి క్ర‌మేపీ మారుతున్న‌ది. క‌మ‌ల్‌హ‌స‌న్‌, ర‌జ‌నీకాంత్‌లు కొత్త పార్టీలు ప్రారంభించ‌డంతో ప‌రిస్థితులు మారుతున్నాయి.

ఎంత కాలం పాటు ఈ స‌హృద‌య భావ‌న‌లు ఉంటాయో తెలియ‌దు కానీ ప్ర‌ముఖ న‌టులు క‌మ‌ల్‌హ‌స‌న్‌, ర‌జ‌నీకాంత్‌లు ఒక‌రినొక‌రు అభినందించుకుంటూనే రాజ‌కీయ పార్టీలు పెట్టుకున్నారు.

ఏఐఏడిఎంకె మొత్తం అయోమ‌యంలో ఉండి దిన‌క‌ర‌న్ వైపు చూస్తున్న‌ది. డిఎంకె ఇన్ని కొత్త పార్టీల మ‌ధ్య త‌న వాటా వెతుక్కుంటున్న‌ది.

ఇలా మారిన ప‌రిస్థితుల్లో కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారిపై గురుత‌ర బాధ్య‌త ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే పార్టీ విధి విధానాల‌ను ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌హ‌స‌న్ రాజ‌కీయ పార్టీపై విశ్లేష‌ణ జ‌రిపితే ఇప్పుడు స‌బ‌బుగా ఉంటుంది.

క‌మ‌ల్‌హ‌స‌న్ రాజ‌కీయ ప్ర‌స్తానం ఎటు? అనేది ఇప్ప‌టి ప్ర‌శ్న‌.క‌మ‌ల్‌హ‌స‌న్ ద‌క్షిణాది రాష్ట్రాల‌కు కేంద్ర బిందువుగా ఉండేలా త‌న రాజ‌కీయ పార్టీ పేరును గుర్తును పెట్టుకున్నారు.

కమల్‌హాసన్ త‌న రాజకీయ పార్టీ ‘మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)’ను ఈ నెల 21న రాష్ట్ర రాజకీయ రాజధాని మదురైలో ఘనంగా ఆరంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న తాను చేపట్టబోయే పనులు, వాటి ఫలితాలను వెల్లడించారు. కానీ ఏవిధంగా తన లక్ష్యాలను చేరుకుంటారు? వాటి ఫలితాలు ప్రజలకు ఎలా అందుతాయి? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వలేకపోయారు.

రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో కూడా చెప్ప‌లేదు. అందరికీ విద్య అని క‌మ‌ల్‌హ‌స‌న్‌ అన్నారు. అది ఏవిధంగా అందరికీ అందుతుంది? ఎంత ఖర్చు చేస్తే అందుతుందో చెప్పలేకపోయారు.

పట్టభద్రులకు ఉపాధి అని చెప్పారు. అది ఎలా అని వివరించలేదు. గ్రామాలను పార్టీ ద్వారా దత్తత తీసుకుని అభివృద్ధి సాధిస్తారా? దానికి మరేదైనా మార్గం ఉందా? అనే విషయాలను వెల్లడించలేదు.

అవినీతిని రూపుమాపుతానని, ఓటుకు నోటు ఇవ్వకుండా… వసతి, పని కల్పిస్తానని చెప్పిన ఆయ‌న ఏవిధంగా వాటిని సాధిస్తారో వివరించలేదు.

దక్షిణాది రాష్ట్రాల ఐక్యతను పార్టీ జెండాలో ప్రదర్శించడం, ద్రావిడ సిద్ధాంతాలపై తన పార్టీ నిర్మితమైందని చెప్పడం, కేరళ ముఖ్యమంత్రి సందేశం, దిల్లీ ముఖ్యమంత్రి ప్రసంగం లాంటి చర్యలతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి తాను వ్యతిరేకమని సంకేతాలు ఇచ్చారు.

త‌న‌కు రాజ‌కీయ గురువు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి ఎన్‌.చంద్ర‌బాబునాయుడు అని క‌మ‌ల్‌హ‌స‌న్ చెప్పారు. చంద్ర‌బాబునాయుడు ఇప్పుడు ప్ర‌ధాని మోడీకి, బిజెపికి వ్య‌తిరేకంగా మారుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా త‌దిత‌ర అంశాల‌ను ఆయ‌న తెర‌పైకి తెచ్చి బిజెపితో క‌య్యానికి కాలుదువ్వుతున్నారు. ఇప్పుడు ఆయ‌న త‌నకు మార్గ‌ద‌ర్శి అంటూ క‌మ‌ల్‌హ‌స‌న్ ప్ర‌క‌టించ‌డం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అదే విధంగా తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ కూడా క‌మ‌ల్‌హ‌స‌న్ రాజ‌కీయ ప్ర‌వేశాన్ని పూర్తిగా స్వాగ‌తించారు.

తెలుగుదేశం, టిఆర్ ఎస్ పార్టీలు రాజ‌కీయంగా ద‌గ్గ‌ర‌కు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇద్ద‌రి నుంచి క‌మ‌ల్‌హ‌స‌న్‌కు సానుకూల స్వాగ‌తం ల‌భించ‌డం కూడా ఇక్క‌డ గ‌మ‌నార్హం.

క‌మ‌ల్‌హ‌స‌న్ త‌మిళ‌నాడుతో బాటు వీరంద‌రి సాయంతో కేంద్ర రాజ‌కీయాల్లోకి కూడా వ‌స్తారా అనేది కూడా ఇప్పుడు ప్ర‌శ్న‌. అయితే రాజకీయంగా కమల్‌కు ఇంకా పరిపక్వత రాలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అనేక అంశాలు ఆయనకు సవాలుగా నిలుస్తున్నాయి.

తాను విషయాన్ని సూటిగా చెప్పలేకపోవడంతో గ్రహించడానికి సామాన్యులకు కొంత సమయం పడుతోంది. సమాజానికి, ప్రజలకు మంచి చేయాలన్న ఆయన సంకల్పం నెరవేరాలంటే అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉంది.

తనకు స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన చెప్పిన తీరు బాగున్నా… ఎంతవరకు అమలు చేస్తారనే అంశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.

మరోవైపు పార్టీని ఇకపై కోర్‌కమిటీ నడపనుంది. విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులతో ఆ కమిటీ ఏర్పాటైంది.

ర‌జ‌నీకాంత్ వెనుక ప్ర‌ధాని మోడీ ఉన్నార‌ని ఇప్ప‌టికే త‌మిళ‌నాడు మొత్తం కోడై కూస్తున్న‌ది. ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నిస్వామిలు త‌మ‌కు మోడీ మార్గ‌ద‌ర్శ‌నం చేస్తున్నార‌ని చెబుతూనే ఉన్నారు.

క‌మ‌ల్‌హ‌స‌న్ మోడీ వ్య‌తిరేక వైఖ‌రి తీసుకున్న‌ట్ల ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌ల వ‌ల్ల తెలుస్తున్న‌ది. రానున్న రోజుల్లో అయినా ఇటు క‌మ‌ల్ అటు ర‌జ‌నీకాంత్‌లు ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుల్లా దాగుడుమూత‌లు ఆడ‌కుండా నేరుగా రాజ‌కీయాలు చేస్తారేమో చూడాలి.

English Summery: Noted Actor Kamal Hasan started new political party with fan fair. But the question is whether he succeeds in his political strategies or not.

One Comment on “లోక‌నాయ‌కుడు అవుతాడా?”

Leave a Reply