“అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ” –  తెలంగాణ ఊపిరి

Share Icons:

“అన్యాయాన్ని ఎదిరించిన ధిక్కార స్వరం కాళోజీ” –  తెలంగాణ ఊపిరి  

” తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు

సంకోచ పడియెదవు సంగతేమిటిరా?

అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు

సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా .”

ఈ మాటలు అన్నది ఎవరో కాదు. ప్రముఖ కవి, రచయిత, మాటల మాంత్రికుడు, ధిక్కార స్వరాన్ని  వినిపించి, అందరి గొడవను తన గొడవ గా భావించిన అక్షర యోధుడు మన “కాళోజీ నారాయణ రావు”. రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ ……. కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న” గా సుపరిచితులు.

ఆయన తెలంగాణ ప్రజల ప్రతి ఉద్యమానికి ప్రతిధ్వనిగా పేరొందారు. ఆయన రాజకీయ సాంఘికచైతన్యాల సమాహారం. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి, గొంతుక కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన వైతాళికుడు. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయన కలం ఝళిపించారు. తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ గ్రహీత. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నది. వరంగల్ లోని నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయన పేరు పెట్టింది.

1914, సెప్టెంబరు 9 న (కర్ణాటక) బీజాపూర్ జిల్లా రట్టిహళ్లిలో జన్మించాడు.   తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. .కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో రచయిత గా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. కాళోజీ కుటుంబం బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన మడికొండ లో స్థిరపడింది. హైదరాబాదు పాతబస్తీలోని చౌమహల్ న్యాయపాఠశాలలో చదివిన కాళోజీ, సిటీ కాలేజీ లోనూ, హన్మకొండ కాలేజియేట్ ఉన్నత పాఠశాల లో చదివి   మెట్రిక్యులేషను ఉత్తీర్ణుడయ్యారు. 1939లో హైదరాబాదు న్యాయకళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. గ్రంథాలయోద్యమంలో  చురుగ్గా పాల్గొన్నారు.. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. ఫలువురు ప్రముఖులతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయన  నగర బహిష్కరణకు గురయ్యారు. 1953 లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు.

కాళోజీ నెలల ప్రాయంలోనే తల్లి చనిపోవడంతో అన్న కాళోజి రామేశ్వరరావు వద్ద పెరిగారు. ఆయన ఉర్దూ కవి.. కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి చురుకుతనం వల్ల ఆయన ప్రభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా కలిసిమెలిసి బతికారు. ఒకవిధంగా తండ్రిలా పెంచాడు..  .కళోజి ఆంధ్రప్రడేశ్ శాసనమండలి సభ్యునిగా 1958 నుండి 60 రెండేళ్ళు ఉన్నారు. “ఆంధ్ర సారస్వత పరిషత్” వ్యవస్థాపక సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీలో కూడా ఆయన. తెలంగాణ రచయితల సంఘం అధ్యకునిగ, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగా ఉన్నారు.

ఒకటా.. రెండా.. ఆయనెకెన్ని పురస్కారాలో… గౌరవాలో:

1992 లో  భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ;  1972 : తామ్రపత్ర ;  1968 : “జీవన గీత” రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనువాద పురస్కారం; బూర్గుల రామకృష్ణారావు మెమోరియల్ మొదటి పురస్కారం; 1981లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ  సత్కారం. “ప్రజాకవి” బిరుదు.  ఆంధ్రప్రదేశ్ లో అనేక సాహితీ సంఘాల సత్కారాలు అందుకున్నారు. రామినేని ఫౌండేషన్ అవార్డు, గాడిచర్ల ఫౌండేషన్ అవార్డు….కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్  1992 లో డాక్టరేట్ ప్రదానం చేసింది. 1996లో సహృదయ సాహితీ విశాఖ  గురజాడ అవార్డు.,

1996లో కళసాగర్ మద్రాస్ విశిష్ట పురస్కారం. మరాఠీ, ఇంగ్లీషు,ఉర్దూ భాషల్లో పండితుడు. ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. 1943 లో ఆయన కథల్ని “కాళోజీ కథలు” పేరుతో అప్పట్లో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన సంస్థ పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక తీసుకువచ్చారు . విశాలాంధ్ర కావాలనీ కోరినా, . తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ వాదించిన ధీశాలి కాళోజీ . పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ — ఇలాంటి ఎన్నో మాటలు చెప్పిన కాళోజీ. జీవితాంతం తెలంగాణ వాదిగా సాగారు.

2002 నవంబరు 13 కనుమూసారు. ఆయన చిరస్మరణీయులుగా నిలిచేందునుకు అన్ని జిల్లాలలొ  కాంస్య విగ్రహాలు నెలకొల్పి,. హన్మకొoడలో  కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు  వేగవంతం చేయాలి.

-నందిరాజు రాధాకృష్ణ 

Leave a Reply