“కేయాస్…కేయాటిక్…కరోనా…”

Share Icons:
దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు ఆంగ్లంలో రాసిన “ఇన్ సైడర్”.. నవలను  ‘లోపలిమనిషి’ గా తెనుగీకరించి విస్తృత ఖ్యాతి నొందిన ఆంధ్రప్రభ, వార్త, సాక్షి… పలు దినపత్రికలలో సహాయసంపాదకులుగా విధులు నిర్వహించడమే గాక అనేక గ్రంథాలను అలవోకగా రచించిన “కల్లూరి భాస్కరం”గారి కలంనుంచి జాలువారిన ఈ విశేష వ్యాసం.. పాలకులకు మార్గదర్శకం అని పేర్కొనవచ్చు..   

“కేయాస్… కేయాటిక్… కరోనా…

*****

హఠాత్తుగా ఏదైనా విపత్తు మీదపడినప్పుడు వెంటనే ఏంచేయాలో తోచదు. గందరగోళానికి లోనవుతాం. గందరగోళాన్ని ఇంగ్లీష్ లో ‘కేయాస్(chaos)’ అంటారు. ఆ గందరగోళంతో ఏర్పడే పరిస్థితిని ‘కేయాటిక్’ అంటారు. తొలి విడత, మలి విడత కరోనా దాడి, దానిపై ప్రభుత్వాల ప్రతిస్పందన చూసినకొద్దీ నాకు ఈ కేయాస్, కేయాటిక్ అనే మాటలే ఎంతసేపూ నాలుక మీద ఆడుతున్నాయి.

కేయాస్ అనే మాటకు అస్తవ్యస్తం, అవ్యవస్థ అనే అర్థాలను కూడా నిఘంటువు ఇచ్చింది. కానీ, కేయాస్, కేయాటిక్ అనే మాటలే శక్తిమంతంగా అనిపించాయి. ఇలాంటప్పుడే మనం పరభాషాపదాలు వాడతాం కాబోలు. పైగా నిఘంటువు కేయాస్ అనే మాటను ‘సృష్ట్యాది’కి తీసుకెళ్ళి, సృష్టికి ముందు జలస్థలాలు అన్నీ కలిసి ఉన్న స్థితిని ఆ మాట సూచిస్తుందని చెబుతోంది. అలా కూడా కేయాస్, కేయాటిక్ అనే మాటలే మరింత శక్తిమంతంగానూ, గంభీరంగానూ, లోతుగానూ ధ్వనిస్తున్నాయి.

ప్రకృతి సృష్టించినవి, మనిషి సృష్టించినవి… ఇలా విపత్తులు రకరకాలుగా ఉంటాయనీ; వాటి వ్యాప్తీ, తీవ్రతా కూడా భిన్నభిన్నంగా ఉంటాయనీ మనకు తెలుసు. బహుశా మనకు అంతగా తెలియనిదల్లా వెనకటి కాలంలో వాటిని ఎలా ఎదుర్కొన్నామన్నదే. దేశంలోని ఏదో ఒక ప్రాంతం కరవు, వరదలు, తుపానుల తాకిడికి గురైనప్పుడు కూడా మనం గొప్పగా వాటిని ఎదుర్కొని ఉండం. చాలావరకూ వాటికి తలొగ్గి; జననష్టాన్ని, ధన నష్టాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండి ఉంటాం.

సర్ ఆర్థర్ కాటన్ రోజుల్లో గోదావరిమండలంలో పెద్ద కరవు వచ్చినప్పుడు అదే జరిగింది. తిండిలేక ఆకలిచావుకు దగ్గరైన జనం మరోచోటికి వలసపోవడానికి బయలుదేరారు. నడిచి నడిచి, ఇంక ఒక్క అడుగు కూడా ముందుకు వేసే ఓపిక కూడా నశించిపోయినవారు దారిలోనే కుప్పకూలి కన్నుమూశారు. అలా బాట వెంబడి ఎక్కడ చూసినా పీనుగులే కనిపించాయి. ఆ దృశ్యం చూసి చలించిపోయే కాటన్ ధవిళేశ్వరం ఆనకట్టను సంకల్పించాడు. ఆయన కుమార్తె రాసిన ఆయన జీవితచరిత్రలో ఈ సమాచారం కనిపిస్తుంది.

ఇక, దేశస్థాయిలో కరవో, లేదా ఇప్పటిలా ఏ కరోనాలాంటి మహమ్మారో విరుచుకుపడనప్పుడు ఏం చేసి ఉంటామో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇలాంటి విపత్తులను ఎంతో కొంత సమర్థంగా ఎదుర్కోవాలంటే ఒక బలమైన కేంద్రప్రభుత్వం ఉండాలి. మౌర్యుల కాలంవరకూ మనదేశంలో కేంద్రప్రభుత్వం అనే మాటకు దగ్గరగా వచ్చే వ్యవస్థ ఏదీ లేదు. దేశం అంతటిమీదా కాకపోయినా, ఎక్కువ భూభాగం మీద ఆధిపత్యాన్ని స్థాపించుకుని, ‘కేంద్రప్రభుత్వం’గా గుర్తింపు తెచ్చుకునే అవకాశం మొదటిసారి మౌర్యులకే కలిగింది. అయితే, అది ఉత్తుత్తి ఆధిపత్యమే అయుంటుంది. ఎందుకంటే, ఇప్పటిలా అప్పట్లో రవాణా, కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు కనుక సుదూరప్రాంతాలను ప్రత్యక్షంగా పాలించే అవకాశం లేదు.

ఆ తర్వాతి కాలంలో ముస్లిం పాలనలోనూ, బ్రిటిష్ పాలనలోనూ కూడా దేశమంతా పూర్తిగా ఒకే కేంద్రప్రభుత్వవ్యవస్థకిందికి రాలేదు. బ్రిటిష్ ప్రభుత్వంలో వందలాది ప్రాంతాలలో సంస్థానపాలన సాగుతూ ఉండేది. ఏదేమైనా దేశస్థాయిలో ప్రకృతి, లేదా ఇతర విపత్తులు ఎదురైనప్పుడు ఆగమేఘాలమీద కదిలి వాటిని సమర్థంగా ఎదుర్కోడానికి సాయపడే రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థకానీ; ప్రజలపట్ల పూర్తి బాధ్యత వహించే ప్రజాస్వామిక, సంక్షేమప్రభుత్వవ్యవస్థ కానీ బ్రిటిష్ కాలంలో కూడా లేదు.

స్వాతంత్ర్యం తర్వాత మాత్రమే దేశం అంతటి మీదా ఆధిపత్యం వహించే కేంద్రప్రభుత్వం మొదటిసారి ఏర్పడింది. ఇది గుర్తుపెట్టుకోవలసిన చారిత్రకవిశేషం. అంతేకాదు, బ్రిటిష్ కాలంలో కూడా లేని అత్యాధునిక రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థతోపాటు; అప్పటికంటె వందల రెట్లు ఎక్కువైన అర్థబలం, అంగబలం నేడున్నాయి. అంతకన్నా ముఖ్యంగా ప్రజలకు పూచీ వహించవలసిన ప్రజాస్వామిక, చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ, సంక్షేమ ప్రభుత్వవ్యవస్థను మనం రూపొందించుకున్నాం. కనుక, హఠాత్తుగా వచ్చిపడే దేశస్థాయి విపత్తును సమర్థంగా ఎదుర్కొని, తక్కువ నష్టంతో బయటపడే వెసులుబాటు సూత్రరీత్యానైనా మనకు స్వాతంత్ర్యం తర్వాతే లభించింది. ఒకటి, రెండు రాష్ట్రాలను ప్రభావితం చేసే వరదలు, తుఫానులు, భూకంపాలను ఎదుర్కోవడంలో చాలినంత అనుభవాన్ని, నైపుణ్యాన్ని, సాధనసంపత్తిని మనం కొంతవరకు సమకూర్చుకున్న మాట నిజం.

అయితే, అకస్మాత్తుగా ప్రపంచస్థాయిలోనూ, దేశస్థాయిలోనూ విరుచుకుపడిన కరోనాలాంటి విపత్తును ఎదుర్కోవడంలో ఆ అనుభవాన్ని వాడుకోగలుగుతున్నామా? పోనీ తొలివిడత కరోనా తీసింది దొంగదెబ్బ కనుక తగినంత జాగ్రత్తపడలేదనుకుంటే, రెండో విడత కరోనా నాటికైనా మేలుకున్నామా?

మేలుకోలేదని అనకపోయినా, రెండో విడత కరోనా ఉధృతిని ఊహించలేదని కేంద్రప్రభుత్వమే ఒప్పుకుంటోంది. పైగా కరోనా ముప్పు ఇక తప్పినట్టేనన్న భావనకు కేంద్రప్రభుత్వముఖ్యులు అప్పటికే వచ్చేసి, జనానికి కూడా ఆ భావన కలిగించారు. పశ్చిమబెంగాల్ ఎన్నికలప్రచారంలో మాస్క్ కూడా లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ డజన్ల కొద్దీ ర్యాలీలలో పాల్గొని; మాస్కులతో పాటు కరోనా జాగ్రత్తలన్నింటినీ గాలికొదిలేయడానికి జనాన్ని పరోక్షంగా ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర ప్రతిపక్షపార్టీలవాళ్లూ అదే చేశారు కదా అని అని చెప్పి ప్రధానిని ఆయన పార్టీ వాళ్ళు వెనకేసుకొచ్చారు తప్ప; ప్రధానిని, ముఖ్యమంత్రిని ఒకే గాటన కట్టకూడదన్న ఇంగితం లేకపోయింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద ప్రధాని ఫొటోయే ఉంది కనుక, దేశమంతటికీ ఆదర్శం కావలసిన బాధ్యత కూడా ఆయనకు ఉంటుంది.

ఆపైన- ముందుచూపు, జాగ్రత్త లోపించిన ప్రభుత్వాలు జనాన్ని ఎలా ముంచుతాయో కుంభమేళస్నానాలు మరింత సింబాలిక్ గా చెప్పాయి. కిందటి సంవత్సరం మార్చిలో, ఢిల్లీలోని తబ్లిజీ జమాత్ ముఖ్యకేంద్రంలో వేలమంది జనం సమావేశమైనందుకు హాహాకారాలు చెలరేగాయి, అది న్యాయమే. అయితే, ఆ హాహాకారాలు చేసినవారు, అంతకన్నా పెద్ద ముప్పు కాగల కుంభమేళస్నానాలపై నోరువిప్పలేదు. ఇంత కరోనా ఉపద్రవంలో కూడా ఒకరి తప్పును భూతద్దంలో చూపించారు, ఇంకొకరి తప్పును అసలే చూడకుండా కళ్ళు మూసుకున్నారు. అదేమని అడిగితే, ఎక్కువ కేసులు, మరణాలు మహారాష్ట్ర, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఉన్నాయా; కుంభమేళ జరిగిన రాష్ట్రంలో ఉన్నాయా అన్న కుతర్కాన్ని తీసుకొచ్చారు.

ఇక్కడ కుంభమేళస్నానాలు ఆగాయో లేదో, అక్కడ గంగలో శవాలు తేలాయి.

****

కేయాస్….కేయాస్…కేయాస్…

దేశస్థాయి, ఇంకా చెప్పాలంటే ప్రపంచస్థాయి విపత్తునూ; అది సృష్టించే కేయాస్ నూ ఎదుర్కొనే అనుభవం, బహుశా మానవాళి చరిత్రలోనే కరోనా రూపంలో మొదటిసారి వచ్చింది. నాకు గుర్తున్నంతవరకూ, తొలివిడత కరోనా సమాచారం 2019 డిసెంబర్ నుంచే రావడం మొదలైంది. 2020 మార్చి మొదటివారంనుంచే కొన్ని రాష్ట్రాలు మేలుకోవడం ప్రారంభించాయి. కేంద్రం మేలుకోడానికి మరికొన్ని రోజులు పట్టింది. నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సందర్శన అందుకు కారణమన్న వ్యాఖ్య అప్పుడే వినిపించింది. సరిగ్గా పోలిక ఎలా కుదిరిందో చూడండి: కరోనా తొలివిడతప్పుడు ట్రంప్ భారత్ సందర్శన తర్వాతే కేంద్రం రంగంలోకి దిగింది; రెండవ విడతప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, కుంభమేళా జరుగుతుండగా రంగంలోకి దిగింది.

తొలి విడతప్పుడు లాక్ డౌన్ విధించి, దాని అమలుకు కొన్ని గంటల సమయమే ఇచ్చిన వెంటనే జనంలో కేయాస్ మొదలైంది. అయితే ఆ కేయాస్ ఎక్కువగా కనిపించినది చిరుద్యోగులు, చిన్నవ్యాపారులు, వెండర్లు, వలసకార్మికులవంటి అట్టడుగువర్గాలలో! లాక్ డౌన్ లో మధ్యతరగతి, ఉన్నతమధ్యతరగతి జనం కూడా ఇబ్బందులు పడ్డారు కానీ; అవి అట్టడుగువర్గాలు ఎదుర్కొన్న కేయాస్ తో పోల్చదగినవి కావు. విపత్తుల సందర్భంలో అడుగుబడుగువర్గాలు ఎదుర్కొనే కేయాస్; మధ్యతరగతి జనాలకూ, పాలకులకూ అనుభవానికి అందదు; కనుక పాలకులకు అంతగా పట్టదు. కరోనా తొలివిడతప్పుడు విద్యుద్దీపాలు ఆర్పి కొవ్వొత్తి దీపాలు వెలిగించండనీ, పళ్లేలు, తప్పేళాలు మోగించండనీ ప్రధాని చెప్పగానే; మధ్యతరగతి జనం ఉత్సాహంగా రంగంలోకి దిగిపోయారు. ఆ ఉత్సాహం వెర్రితలలు వేసి ‘సోషల్ డిస్టెన్స్’ ను తుడిచేస్తూ రోడ్లమీదికి ప్రవహించడం కూడా చూశాం.

ఈ సంవత్సరం ఏప్రిల్ లో వచ్చిన రెండో విడత కరోనా- మొదటి విడతకు భిన్నం. ఈసారి కేయాస్ కిందినుంచి మధ్యతరగతికి, ఎగువమధ్యతరగతికి, ప్రభుత్వాలకు పాకింది. అడుగుబడుగువర్గాలు అంత నోరువాయీ, వ్యక్తీకరణా ఉన్నవి కావు కనుక వాళ్ళు ఎదుర్కొన్న కేయాస్, పైవర్గాలలో ప్రకంపనలు సృష్టించలేదు. రెండో విడతప్పుడు అది నోరూవాయీ, వ్యక్తీకరణా ఉన్న వర్గాలను తాకింది కనుక ప్రభుత్వాలలో కూడా గడబిడ మొదలైంది. ప్రాణవాయువు కోసం డిమాండ్లు హోరెత్తుతూ ఉంటే, ఊపిరాడక జనం పిట్టల్లా రాలిపోతూ ఉంటే ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి. జనాగ్రహం పాదాల కింద మంటలు పెడుతుంటే; విమర్శలూ, ఆక్షేపణల ములుకులు ప్రతి ఒక్క రోమకూపాన్నిగుచ్చుతూ ఉంటే, నిస్సహాయత ఉక్రోషంగా మారి అసహనంగా వ్యక్తమై అసత్యాలకు, అర్ధసత్యాలకు, దూషణ, ప్రతిదూషణలకు పురిగొల్పింది.

ఇందులో కేంద్రం, రాష్ట్రం అన్న తేడాలు, హద్దులు చెరిగిపోయాయి. ఈ కేయాటిక్ పరిస్థితి ఏకంగా రెండునెల్లపాటు కొనసాగింది. ముఖ్యస్థానాలలో ఉన్నవారు మొహం చాటేశారు, మౌనం వహించారు. ఇప్పుడిప్పుడు కేసులు, మరణాలు తగ్గుతుండడంతో ధైర్యంగా ముందుకొచ్చి జనానికి మొహం చూపిస్తున్నారు.

తొలి విడతప్పుడే సమస్య తీవ్రతను అంచనా వేసి జాగ్రత్తపడడంలో ప్రభుత్వాలు ముందుచూపును చాటలేదు. కేసులు, మరణాలు పెద్దగా లేకపోయేసరికి కరోనా తోకముడిచిందన్న భరోసాకు పాలకులే వచ్చేసి, ఎప్పటిలా రోజూవారీ రాజకీయాలు, ఎన్నికల తిరునాళ్ళలోకి దిగిపోయారు. తీరా కరోనా, నేను ఉన్నానంటూ వచ్చి హఠాత్తుగా మీదపడేసరికి కళ్ళు తేలేశారు. నిజానికి కరోనా రెండో విడత రాక గురించి ముందునుంచీ హెచ్చరికలు అందుతూనే ఉన్నాయి. యూకే లాంటి సాక్ష్యాలు కళ్ళముందున్నాయి. అవేవీ పాలకులపై ప్రభావం చూపలేదు. ఎన్నికలు, ఇతర రోజువారీ రాజకీయకూటయుద్ధాలే అధినాయకుల బుర్రల్ని పూర్తిగా ఆక్రమించుకున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఎపెడెమిక్, పెండెమిక్ ల గురించి ఎంతో చరిత్ర ఉంది. ఆ చారిత్రక అనుభవాల ఆధారంగా ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పాల్సిన అంచలంచెల అధికారయంత్రాంగం ఉంది. వేల కోట్ల రూపాయలతో మనం పెంచి పోషించుకుంటున్న వ్యవస్థ అది. అది ఏం చెప్పిందో, ఏం చెప్పలేదో, చెప్పినా పాలకులు విన్నారో లేదో, వినే లక్షణం వాళ్ళకు ఉందో లేదో… అన్నీ ప్రశ్నార్థకాలే.

****

ప్రభుత్వాలలో కేయాటిక్ పరిస్థితి రెండు విషయాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపించింది: మొదటిది ఆక్సిజన్ కొరత; రెండవది, వ్యాక్సిన్ కొరత. ఈ రెండు కొరతలకూ కారణం, ముందుచూపు లోపించడమే. తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉంటే ఎన్నో ప్రాణాలు దక్కేవి. పోనీ వ్యాక్సినైనా అందుబాటులో ఉంటే మరిన్ని చావుల్ని ఆపేది. ఈ  వైఫల్యాలలో ఎవరి బాధ్యత ఎంతన్నది బాధితజనానికి అక్కర్లేదు. సందర్భాన్ని బట్టి కేంద్ర, రాష్ట్రాలు రెంటినీ దోషులుగా జనం వేలెత్తి చూపించారు. కిందటి సంవత్సరం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆక్సిజన్ తో సహా అత్యవసర వైద్య సరఫరాల పర్యవేక్షణ బాధ్యతను ఒక సాధికారబృందా(empowered group)నికి అప్పగించింది కనుక, ఆక్సిజన్ ను కేటాయించవలసింది కేంద్రమే కనుక వైఫల్యంలో పెద్ద వాటా దానిదే. ఆక్సిజన్ సత్వరరవాణా వంటి అంశాలలో రాష్ట్రాల వైఫల్యం ఉండవచ్చు. కరోనా తొలివిడత అనుభవం దృష్ట్యా, కావలసిన ఆక్సిజన్ పరిమాణాన్ని అంచనా వేసి జాగ్రత్త పడడంలో రాష్ట్రాలు ముందుచూపు చాటలేదు.

ఒకవైపు నిమిష నిమిషానికీ చావు ఘంటలు మోగుతుంటే, ఇంకోవైపు జనం తననే దోషిగా చూపెసరికి కేంద్రానికి కాళ్ళూ, చేతులూ ఆడలేదు. ఆక్సిజన్ సరఫరాకు రాష్ట్రాలు తమ ఏర్పాట్లు చేసుకోవచ్చు కదా అని, నిందను వాటి మీదికి తోసేస్తూ చిన్నపిల్లల కయ్యానికి దిగింది. ఆక్సిజన్ లేక ప్రాణాలు కడంటిపోతున్న దృశ్యాలు కళ్ళముందే కనిపిస్తుంటే ఆక్సిజన్ పుష్కలంగా ఉందని బుకాయించింది. యూపీ ప్రభుత్వం అయితే ఆక్సిజన్ కొరతను ఎత్తిచూపినవారిపై కేసు పెట్టేవరకూ వెళ్లింది. కొరత లేదన్న పచ్చి అబద్ధం ఎలా ఆడుతున్నారని అడిగితే, ఉందంటే జనం ప్యానిక్ అయిపోరా అన్న ప్రశ్న అధికారప్రతినిధులనుంచి ఎదురైంది.

కేయాటిక్ పరిస్థితిలో హడావుడిగా గొయ్యి తవ్వి వాస్తవాలను పాతిపెట్టే ప్రయత్నం చివరికి విఫలయత్నంగా మారి ప్రభుత్వాలను మరింత అభాసుపాలు చేస్తుంది. అయినాసరే, సత్యధర్మాలను, పారదర్శకతను బలిపెట్టే ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు ఇలా కేయాటిక్ పరిస్థితిలో కూరుకుపోయిన స్థితిలో మొత్తం వ్యవహారాలను న్యాయస్థానాలు చేతుల్లోకి తీసుకోవలసివచ్చింది. ఎగ్జిక్యూటివ్ అంశాలలో న్యాయస్థానం ఎంతగా జోక్యం చేసుకుంటే అంతగా ఎగ్జిక్యూటివ్ విఫలమైందని అర్థం. అయినా ఎగ్జిక్యూటివ్ సిగ్గుతో చితికిపోయిన, చితికిపోతున్న దాఖలా ఎక్కడా లేదు. బండబారిన ఎగ్జిక్యూటివ్ మీద న్యాయస్థానాల అక్షింతలు దున్నపోతుమీద వాన కావడం కొత్తవిషయం కాదు కానీ, ఇప్పటి కేయాటిక్ పరిస్థితిలో ఎగ్జిక్యూటివ్ పూర్తిగా బట్టలిప్పేసింది. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం అన్న తేడా ఏమీ లేదు.

****

వ్యాక్సిన్ కొరత కేయాటిక్ పరిస్థితికి మరింత క్లాసిక్ ఉదాహరణ. కరోనా తొలివిడత దాడినుంచి కోలుకోకుండానే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిపడ్డాయి. అప్పటికింకా వల్లకాట్లో చితిమంటలు ఆరలేదు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వోట్ల చేపలకోసం ఉచిత వ్యాక్సిన్ ను ఎరేసి దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచారు. తీరా ఏడాది కూడా గడవకుండానే ఏం జరిగిందో చూశాం. అందరికీ ఉచితమన్న హామీ అటకెక్కి రేట్ల పట్టిక ముందుకొచ్చింది. పోనీ రేటు చెల్లించి కొనుక్కుందామంటే వ్యాక్సినే దొరకని పరిస్థితి వచ్చింది. ‘వ్యాక్సీన్లు, విశ్వనాథ ఫిలాసఫీ, బ్రిటిషోళ్లే మేలు’ అనే శీర్షికతో పెట్టిన ఒక ఫేస్ బుక్ పోస్ట్ లో మిత్రుడు పి. మోహన్ విశ్వనాథవారి ‘వేయిపడగలు’ నవలలోని ఒక ఘట్టాన్ని ఉదహరించారు. ఆ నవలలోని నాయకుడైన ధర్మారావు ఒక ఊరు వెళ్లినప్పుడు టీకా వేయించుకోమని ఒక వ్యక్తి బతిమాలుతాడు. “నీ టీకా వేయించుకుని నేను జ్వరంతో బాధపడాలా, నాకు వ్యాధి వచ్చినా రాకపోయినా నీ టీకా వేయించుకోవడం వల్ల తప్పక వస్తుంద”ని ధర్మారావు తిరస్కరిస్తాడు.

అంటే, బ్రిటిష్ కాలంలో టీకా ఉన్నా వేసుకునేవాడు లేడు; ఇప్పుడు వేసుకోడానికి జనం ముందుకొచ్చినా టీకా లేదు.

వోటుకక్కుర్తితో ఉచిత వ్యాక్సిన్ కు హామీ ఇవ్వడంలో చూపించిన తొందర, వ్యాక్సిన్ సరఫరాకు కంపెనీలతో ఒప్పందం చేసుకోవడంలో చూపించలేదు. ఈ విషయంలో యు.ఎస్., యు.కె. బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, మరికొన్ని దేశాలు చూపిన ముందుచూపు మన పాలకులకు వరవడి కాలేదు, చురుకు పుట్టించలేదు. ఈ దేశాలు గత ఏడాది మే నుంచే, వందల మిలియన్ల డోసుల మేరకు వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందం చేసుకోవడం ప్రారంభించాయి. మనం ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలలో, అది కూడా మొత్తం 17 మిలియన్ల లోపు డోసుల కొనుగోలుకు సిద్ధమయ్యాం.

హఠాత్తుగా కరోనా రెండో విడత మొదలై, కేవలం రోజుల వ్యవధిలోనే కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోయిన దశలో వ్యాక్సిన్ కొరత కొట్టొచ్చినట్టు కనిపించి, జనంలో హాహాకారాలు చెలరేగాయి. ఆ కేయాటిక్ పరిస్థితిలో దిక్కుతోచని ప్రభుత్వం, వ్యాక్సిన్ కొరతకు కొన్ని ప్రతిపక్షరాష్ట్రప్రభుత్వాలే కారణమైనట్టు నమ్మించబోయింది. వ్యాక్సిన్ ఏదని అడిగితే, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వ్యర్థం కావడాన్నీ, వ్యాక్సిన్ వేసుకోడానికి జనం ముందుకు రాకపోవడాన్నీ చర్చకు తెచ్చి అసలు సమస్యపై ముసుగు కప్పబోయింది. వ్యాక్సిన్ వ్యర్థమూ, జనాల వెనుకంజా సమస్యలే కానీ, వ్యాక్సిన్ కొరతకు సమాధానాలు కావు.

ఇలా కరోనాపై యుద్ధం కాస్తా కేంద్ర-రాష్ట్రాల యుద్ధంగా మారి, మరో వైరస్ గా పరిణమించింది. వ్యాక్సిన్ విధానాన్ని వికేంద్రీకరించాలనీ, తాము నేరుగా వ్యాక్సిన్ ను తెప్పించుకునేందుకు అవకాశమివ్వాలన్న రాష్ట్రాల డిమాండ్ లో ‘రాజకీయం’ కచ్చితంగా ఉండవచ్చు. అలాగని కేంద్రం కాడి వదిలేసి జనాన్ని ముంచలేదు. విదేశీ కంపెనీలతో రాష్ట్రాలు నేరుగా ఒప్పందం చేసుకోలేవని కేంద్రానికి తెలియదా? అదీగాక, తను ఏమనుకుంటే అది చేయడమే తప్ప ఇతరులు కోరినట్టు చేయడం ఈ ప్రభుత్వంలో ఎప్పుడూ చూడలేదు. రైతుల ఆందోళన, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన వగైరాలు ఇందుకు సాక్ష్యాలు. కేయాటిక్ పరిస్థితిలో పచ్చిగా బయటపడిపోతున్న చేతకానితనానికి ఫెడరలిజం, వికేంద్రీకరణ అనేవి ముసుగులయ్యాయి.

కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇంత చవకబారు, దిగజారుడు ఘర్షణను ఎప్పుడూ చూసి ఉండం. నేటి అసాధారణ విపత్కర పరిస్థితిలో కేంద్ర-రాష్ట్రాల మధ్య ఉండవలసింది సయోధ్య, సహకారం. అవి ఏ సమయంలోనూ, ఏ కోశానా కనిపించలేదు. తొలి విడత కరోనాను ‘మేనేజ్’ చేసిన ఘనతను తన ఖాతాలోకి వేసుకునేందుకు కేంద్రం ప్రయత్నించింది కనుక; వ్యాక్సిన్ సర్టిఫికెట్ల మీద ప్రధాని బొమ్మ వేసుకుంది కనుక వ్యాక్సిన్ బాధ్యత మొత్తం కేంద్రానిదేననుకుంటాం. ఈ దేశంలో ముందునుంచీ టీకాల కార్యక్రమం కేంద్రం సారథ్యంలోనే సాగుతోంది కూడా. కానీ కేయాటిక్ పరిస్థితిలో కరచరణాలాడని కేంద్రం, అన్ని రకాల లాజిక్కులను, పెద్దరికాన్ని గాలికొదిలేసి రాష్ట్రాలతో పేచీకి దిగింది. విజయాలను తన ఖాతాలో వేసుకోవాలనుకుంది కానీ, వైఫల్యాలను మాత్రం రాష్ట్రాల ఖాతాలో వేయబోయింది.

ఇలాంటి ఈ వ్యాక్సిన్ విధానం రాష్ట్రాలలోని సొంత పార్టీ ప్రభుత్వాలకు, మిత్రపక్షప్రభుత్వాలకు కూడా కొరుకుడు పడలేదు. ప్రభుత్వాలూ, జనాలతోపాటు; న్యాయస్థానాలు కూడా తీవ్రంగా తప్పుపట్టడంతో కేంద్రం విధానాన్ని మార్చుకోవలసివచ్చింది. అయినా అందరికీ ఉచితమన్న హామీ గల్లంతై; ప్రభుత్వాల మాటకూ, చేతకూ మధ్యనున్న గండిని మరింత పెద్దగా చూపించింది. స్తోమత ఉన్నవారు, లేనివారన్న తేడా లేకుండా అందరికీ వ్యాక్సిన్ ను ఉచితం చేసి; స్తోమత ఉన్నవారినుంచి విరాళాలు సేకరించి ఉంటే బాగుండేది. అందువల్ల ప్రభుత్వంపట్ల ప్రజల్లో ఒక సానుకూలభావన, భరోసా పెరిగి ఉండేవి.

వ్యాక్సిన్లకు మనదేశం గ్లోబల్ క్యాపిటల్ గా మారిందన్నాం. ఇక్కడ తయారవుతున్న రెండు వ్యాక్సిన్ రకాలను మేక్ ఇన్ ఇండియాగా చూపించి బుజాలు చరచుకున్నాం. రెంటిలో ఒకదానికి క్లినికల్ పరీక్షలు పూర్తి కాకపోయినా వినియోగానికి అనుమతి ఎందుకిచ్చారని కొందరు అడగడం, ఇప్పటి అనుభవంలో తొందరపాటు కావచ్చు. అంతమాత్రానికే వాళ్ళ దేశభక్తిని ప్రశ్నించి, “యాంటీ-నేషనల్” అన్న ముద్రతో భయపెట్టేశాం.

చివరికి ఏం చేశాం?! రెండు నెలలు కూడా తిరగకుండానే విదేశీ వ్యాక్సిన్లకోసం పరుగులు తీశాం. దాంతో మన ఆత్మనిర్భరోపదేశాలు ప్రహసనాలుగా, మన దేశీయోత్పత్తుల ప్రస్తుతులు ప్రగల్భాలుగా మిగిలాయి.

కేయాటిక్ పరిస్థితిలో ఎటువంటి మంచికీ ఎలాంటి హామీ ఉండదు. ఆరోగ్యకరమైన అన్ని రకాల ఆలోచనలూ, విలువలూ, మర్యాదలూ; ఆపైన సత్యధర్మాలూ, పెద్దరికం-చిన్నరికం తేడాలూ అన్నీ తుడిచిపెట్టుకుపోతాయి.

**** 

ముందే చెప్పుకున్నట్టు దేశవ్యాప్తంగా తలెత్తిన ఒక కేయాటిక్ పరిస్థితిని ఎదుర్కోవడంలో మనకు అనుభవం తక్కువ, అసలు లేదనే చెప్పవచ్చు. విచిత్రంగా, గత ఏడేళ్లలో, నేటి అధిపాలకుని నాయకత్వంలోనే కేయాటిక్ పరిస్థితిని ఎదుర్కోవడం ఇది రెండవసారి. నోట్ల రద్దు వల్ల తలెత్తిన కేయాటిక్ పరిస్థితి మొదటిది. అది మానవకల్పిత విపత్తునుంచి పుట్టినది(కరోనా కూడా అలాంటిదేనని అంటున్నారు కానీ, ఇంకా నిర్ధారణ కాలేదు). నోట్లరద్దు చర్య చివరికి పులిస్వారీగా మారడంతో, అనేకసార్లు గోల్ పోస్టులు మార్చుకుంటూ పోయాం. చివరికి అది ప్రభుత్వాన్ని, సారథిని ఎక్కడెక్కడో తిప్పి తిప్పి క్షతగాత్రంతో విడిచిపెట్టింది. ఆ విపత్తు ప్రభావం ఎక్కువగా పడింది కూడా నోరూవాయీ లేని అడుగుబడుగు వర్గాలపైనే. దాని తాకిడికి పెద్దగా గురికాని వర్గాలూ, ఆపైన అనుకూల మీడియా అధిపాలకుని క్షతగాత్రం పెద్దగా జనం కంటపడకుండా కొంగు అడ్డుపెట్టి కాపాడాయి.

ఇప్పటి కరోనా పరిస్థితితో పోల్చదగిన కేయాటిక్ పరిస్థితి ప్రభుత్వంలో తలెత్తిన సందర్భం మరొకటి కూడా ఉంది. అది, 1962 నాటి భారత-చైనా యుద్ధం. పి. వి. నరసింహారావు తన ‘లోపలి మనిషి’లో భారత-చైనా యుద్ధపూర్వాపరాలను చాలా విపులంగా రాశారు. చైనాతో ఈశాన్యసరిహద్దు విభాగంలో సంభవించిన స్వల్పకాలికయుద్ధంలో భారత్ కు సంపూర్ణపరాజయం ఎదురైంది. అది దేశప్రజలను ఆగ్రహోదగ్రులను చేసింది. తన సుదీర్ఘ చరిత్రలో భారత్ అంతవరకూ ఏ ఒక్క యుద్ధంలోనూ గెలవని చరిత్ర దానికి తోడవడంతో జనం మరింత కుమిలిపోయారు. భారతదేశ విదేశాంగవిధానం మొత్తం అస్తవ్యస్తమైపోయినట్టు తోచింది. చైనా వెన్నుపోటు పొడిచిందన్న బాధ నెహ్రూను విపరీతంగా కుంగదీసి ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది.

కాకపోతే, నెహ్రూ నాటి వైఫల్యాన్ని ధైర్యంగా అంగీకరించారు. “నిర్లక్ష్యం వహించామనీ, నమ్మి మోసపోయామనీ” రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారు. రక్షణమంత్రి వి. కె. కృష్ణమీనన్ ఓటమిని ఒప్పుకున్నారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కడిగివిడిచిపెట్టాయి. “పాజిటివిటీ” చాటున ముఖం దాచుకోవడానికి, “యాంటీ-నేషనల్” పేరిట ఎదురుదాడితో విమర్శకుల గొంతు నొక్కడానికి ప్రభుత్వం ప్రయత్నించలేదు. ఇక్కడ ప్రత్యేకించి ఒక ఆసక్తికరమైన పోలికను చెప్పుకోవాలి. ఆక్సిజన్ కావలసినంత ఉంది కానీ, వాటిని ఆయా ప్రాంతాలకు చేర్చే రవాణా వ్యవస్థే లేదని ఇప్పటి ప్రభుత్వం అన్నట్టే; చైనాను ఎదుర్కోడానికి సాధనసంపత్తి ఉంది కానీ, దానిని వెంటనే తరలించగల రవాణా వ్యవస్థే లేదని నెహ్రూ ప్రభుత్వం కూడా అంది.

ఒక విపత్తు వచ్చిపడినప్పుడు మనం చతికిలపడిపోవడం జాతీయస్వభావమేమోనని కూడా అనిపిస్తుంది. మనం మౌలికంగా ఉద్వేగస్వభావులం. అన్ని దశల్లోనూ ఆలోచనపై ఉద్వేగం పెత్తనం చేస్తుంది. మహాభారతయుద్ధం ఇందుకొక చక్కని ఉదాహరణ. యుద్ధం అనేటప్పటికే అందులో ఒక ఉద్రిక్తత ఉంటుంది. ఆవేశకావేశాలు విజృంభిస్తాయి. అవన్నీ కలసి ఒక కేయాటిక్ పరిస్థితికి దారి తీయిస్తాయి. ముందు వేసుకున్న ప్రణాళికాలే కాదు, ఉచితానుచితాలు, ధర్మాధర్మ విచికిత్సలు… అన్నీ గాలికెగిరిపోతాయి. మహాభారతయుద్ధంలో అదే జరుగుతుంది. రెండు పక్షాలూ కలసి ముందే కొన్ని యుద్ధనియమాలు పెట్టుకుంటాయి. చివరికి ప్రతి ఒక్క నియమమూ ఉల్లంఘనకు గురవుతుంది.

ఒక పెద్ద విపత్తును తగినంత సామర్థ్యంతో, ముందు చూపుతో, ప్రణాళికతో ఎదుర్కొనే నైపుణ్యం మనకు ఇక ముందైనా అలవడడానికి ఈ అనుభవం పనికొస్తుందా? ఏమో, కాలమే నిర్ణయించాలి.

*****

Leave a Reply