అరుదైన ఘనత సొంతం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు…

Share Icons:

హైదరాబాద్, 21 జూన్:

కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అరుదైన ఘనత సొంతం చేసుకుంది. శంకుస్థాపన చేసిన తరువాత, అతి తక్కువ సమయంలో పనులు పూర్తయిన ప్రాజెక్టుగా కాళేశ్వరం …. విన్నర్స్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్, కంట్రీ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. అత్యంత భారీ ప్రాజెక్టుగా, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమైన ఈ ప్రాజెక్టుని సీఎం కేసీఆర్ నేడు జాతికి అంకితం చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఏపీ సీఎం జగన్‌తో పాటు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు, హైద‌రాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు. .

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు గురించి భారత ముఖ్య సలహాదారు కొండవీటి మురళి ఓ ప్రకటన చేశారు. ప్రాజెక్టును నిర్మించిన నిర్మాణ సంస్థ ‘మేఘా’తో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారీ మోటార్లను తయారు చేసి అందించిన బీహెచ్ఈఎల్ సైతం రికార్డులో చోటు దక్కించుకున్నాయని తెలిపారు.

 

Leave a Reply