టీడీపీకి దూరమైన తారక్?

Share Icons:

అమరావతి, మార్చి02,

సినిమాలవరకూ.. నందమూరి వారసత్వాన్ని బాలయ్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ క్రమంగా తాత పెట్టిన పార్టీకి దూరమవుతున్నారా? ఈ మాటే అటు రాజకీయాలు, ఇటు సినిమా వర్గాల్లో కలుగుతోంది. కుమారుడు  నారా లోకేశ్ భవిష్యత్ కోసం చంద్రబాబు కావాలనే జూనియర్ ఎన్టీఆర్‌ ను పార్టీ రాజకీయాలకు  దూరంపెట్టారన్నది బహిరంగ రహస్యం.

అదే సమయంలో తారక్ కూడా అనువుగానిచోట అధికులమనరాదు.. అన్నట్టు కొద్దికాలంగా వివాదాల జోలికి, రాజకీయాల జోలికి వెళ్లకుండా సినిమాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి, టీడీపీ ప్రభుత్వానికి గానీ ఇబ్బంది కలిగించే ఎలాంటి పనీ చేయలేదు.

కాగా,  రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న ప్రస్తుత సమయంలో, గెలుపుకోసం అన్ని పార్టీలు సర్వం ఒడ్డుతున్న వేళ  జూనియర్ ఎన్టీయార్ వర్గం లో ఒక్కొక్కరే వైసీపీలోకి వెళ్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీకి దూరమవుతున్నారా అన్న భావన కలుగుతోంది.

జూ.ఎన్టీఆర్ కు చాలా సన్నిహితుడైన కొడాలి నాని చాలా కాలం క్రితమే వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కూడా వైసీపీ కండువా కప్పుకున్నారు. అన్నగా చెప్పుకునే నాని.. స్వయంగా మామ వైసీపీలోకి వెళ్లడంతో ఆ ప్రభావం జూనియర్ పై పడుతోంది.

వీరు కాకుండా కుటుంబంలో పెద మామ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు కూడా వైసీపీలో చేరారు. దీనితో తారక్ పరిస్థితి ఏమిటనే మాట వినిపిస్తోంది. ఇపుడు ఆయన తెలుగుదేశం పార్టికి మద్దతిస్తారా, లోపాయికారిగా వైసీపీ గెలుపుకోసం కృషి చేస్తారా… లేక నేను-నా సినిమాలు అంటూ మౌనంగా ఉండిపోతారా…?

మామాట: ఉందిగా.. ఆయుధమున్ ధరింప,.. పద్యం పాడుతారా..

Leave a Reply