ఒకే వేదికపై నుండి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన ఒకప్పటి ప్రత్యర్ధులు…

Share Icons:

జగిత్యాల, 8 అక్టోబర్:

తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ఉప్పు-నిప్పులా ఉండే కాంగ్రెస్, టీడీపీ, పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్న టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. మహాకూటమిగా ఏర్పడిన ఈ పార్టీలు ప్రచారం సందర్భంగా ఒకే వేదికపైకి చేరిన వీరిద్దరూ కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

ఎల్ రమణ మాట్లాడుతూ…ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని, రాఫెల్ స్కామ్‌పై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. కేసీఆర్ పాలన అంతమే తమ ధ్యేయమని, తమను తిట్టినప్పుడే కేసీఆర్ బలహీనత బయటపడిందని అన్నారు. కేసీఆర్ తన రాజకీయ లబ్దికోసం 9 నెలల ముందుగానే అసెంబ్లీని రద్దుచేశారని రమణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో 46 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసిందని ఆయన విమర్శించారు.

అలాగే కల్వకుంట్ల కుటుంబం నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని, కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేసినట్టు అయితే ఇన్ని ఉద్యమ పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తాయని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ ఆకాంక్షలకు భిన్నంగా పాలన కొనసాగిస్తున్నారని, ఆ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కలిగించాలనే భావనతో, ఉద్యమ పార్టీలు ఐక్యంగా నిలిచి, రాష్ట్రానికి చీడపురుగులా దాపురించిన కల్వకుంట్ల కుటుంబాన్నుంచి విముక్తి కలిగించాలనే భావనతో ఉన్నాయని తెలిపారు.

మామాట: అందుకే అంటారు…రాజకీయాల్లో శాశ్వత శత్రువులు..మిత్రులు ఉండరని….

Leave a Reply